పల్లెటూరు(బాల గేయం): - అయిత అనిత--జగిత్యాల


 పచ్చాపచ్చని పల్లెతల్లి మాఊరు

గలగల పారేనీటితో ఓ సెలయేరు


పాడిపశువుల పాలవెల్లి మాఊరు

మమతలు కలబోసుకున్న హుషారు


కిలకిల పక్షులు పలుకరించే మాఊరు

కల్మషమెరుగని మనసులున్న ఒకమేరు


వ్యవసాయమే బతుకుదెరువుల మాఊరు

చెమటచుక్కల పరిమళాల పూలతేరు


ఏ దిష్టి తగిలిందో ఏమో 

అయ్యింది ఊరంతా బేజారు

పొలాలన్ని మాయమై మాఊరు

కాలుష్యం నీడన కార్చుతుంది కన్నీరు


చిన్నా మున్న చిట్టి పొట్టి రారండి

చకచక మొక్కలన్నీ నాటండి

పల్లెకు పూర్వవైభవం తేరండి

హరితయజ్ఞంలో సమిధలై అలరారండి