మీరేమో అట్టా! ఆయనేమో అట్టా!:--- యామిజాల జగదీశ్
 నాకు ఎవరైనా అలవాటైతే వారి దగ్గరే అరటిపళ్ళు కొనడం అలవాటు. ఒకవేళ అతను గానీ కనిపించకపోతే కొనకుండా ఇంటికి వచ్చేసిన రోజులున్నాయి. అలా వచ్చినప్పుడు ఎవరో ఒకరి దగ్గర కొనొచ్చుగా అని నా భార్యామణి అంటూ ఉంటుంది. 
అయినా చెవికెక్కినా తలకెక్కించుకోను ఈ మాట. అతనిది అత్తిలి. నన్ను నాన్నగారూ అని పిలుస్తుంటాడు. ఎప్పుడు కలిసినా ఒక అరటిపండు వొలిచి తినడానికిస్తాడు ...ఆ విషయం అటుంచి ఇక్కడో విషయం చెప్పదలచుకున్నాను....
ఎప్పట్లాగే కాస్సేపటి క్రితం అరటిపళ్ళకోసం వెళ్ళాను. అతను ఉండనే ఉన్నాడు ఉండవలసిన చోట. నన్ను చూసేసరికే ఓ నవ్వు నవ్వాడు ఎప్పట్లాగానే. అయితే అప్పటికే అక్కడ ఓ జంట అతని దగ్గరకొచ్చారు పళ్ళు కొనుక్కోవడానికి. ఆ జంటలో ఆమె మల్లెపూవులా అతనేమో తారుడబ్బాలా ఉన్నారు. వారిద్దరినీ చూస్తుంటే కాకి ముక్కుకి దొండపండు మాట గుర్తుకొచ్చింది. 
ఆమె అరటిపళ్ళతనితో చెప్తోంది...
"ఇదిగో ఒక్క పండుమీదా ఆవగింజంత నల్ల మచ్చ ఉండకూడదు. అలాగైతేనే నీ దగ్గరే ఎప్పుడూ కొంటాను" అంది. 
అలాగేనన్న అరటిపళ్ళతను సన్నగా ఓ మాటన్నాడు ఆమెకు వినిపించేలాగానే...
"ఎర్రగా ఉన్న మీరేంటీ నల్లగా ఉన్న ఆయన్ని చేసుకున్నారు?" అని
అతనన్న మాటలకు వచ్చిన నవ్వుని బలవంతంగా ఆపుకున్నాను. ఆవిడేమనుకుందో మరి. వాళ్ళాయనేమో నల్లగా ఓ పెద్ద దిష్టి చుక్కలా ఉన్నాడు తెల్లని మల్లెపువ్వల్లే సుకుమారంగా ఉన్న ఆమెకు.
ఈ జంటనే కాదు, చాలా జంటలంతే...భార్యాభర్తల్లో ఒకరు నల్లగా ఉంటే మరొకరు తెల్లగా. ఒకరు సన్నగా ఉంటే మరొకరు లావుగా. ఒకరు మృదువుగా ఉంటే మరొకరు మోటుగా. ఒకరు నవ్వుతూ కనిపిస్తే మరొకరు రుసరుసలాడుతూ. 
దేవుడెందుకిలా భిన్న ధృవాలనే ఏకం చేస్తుంటాడు. అంతేగా మరి, స్త్రీపురుషుడు కలిస్తేగా సృష్టి....