బ్రతుకు భారమైన అవ్వ: --కందర్ప మూర్తి , కుకట్ పల్లి , హైదరాబాదు.

   రోడ్డంట తిరిగి బిచ్చమెత్తుకుని కడుపు నింపుకునే
ముసలి అవ్వ  నాగమ్మ వంట్లో  శక్తి లేక  ప్రభుత్వ పాఠశాల
దగ్గరున్న మర్రి చెట్టు కింద ఉంటూ పాఠశాలకు వచ్చే విధ్యార్థులు
 ఉపాధ్యాయులు  టిఫిన్ బాక్సుల్లో మిగిల్చి పెట్టిన ఆహారంతో
జీవితం సాగిస్తోంది.
       పాఠశాలకు శలవు రోజున నాగమ్మకు ఉపవాసమే.పాఠశాల
నివాస ప్రాంతాలకు దూరమైనందున అటు వచ్చేవారు కూడా లేరు.చెట్టు మాటున చిన్న ప్లాస్టిక్ సంచులు అట్టలకు చుట్టి
గుడారంలా చేసుకుని నివశిస్తోంది..అక్కడ దొరికే మెతుకులకు
ఆశ పడి ఒక  వీధి కుక్క తోడుగా ఉంటోంది.
      అవ్వ నాగమ్మ  ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు.ఆమె
వయసు, శరీర దీనావస్థను గమనించిన ప్రధానోపాధ్యాయుడు
ఆమెను అనాథ శరణాలయంలో ఆశ్రయం కల్పించారు.
       వాస్తవానికి  అవ్వ నాగమ్మ  పదిమందికి  అన్నం పెట్టిన అన్నపూర్ణ. పల్లెలో వయసులో  ఉండేటప్పుడు నాగమ్మ భర్తతో
బాగా బతికిన ఇల్లాలు. అడిగిన వారికి లేదనకుండా పెట్టిన
చెయ్యి ఆమెది.
       కిరాణా షాపులో భర్తకు  చేతోడుగా ఉంటూ ఉన్న ఒక్క
కొడుకును పట్నానికి పంపి పెద్ద చదువులు చదివించింది.
హోదా  ఉధ్యోగం పొందిన  కొడుకు చెడు  సహవాసాల పాలయాడు.
        పెద్దింటి పిల్లను ప్రేమ పెళ్లి చేసుకుని నిరక్షరాస్యులైన
కన్నవాళ్లను  నిర్దాక్షిణ్యంగా వదిలేసి విదేశాలకు వెళిపోయాడు.
మనో వ్యాధితో  నాగమ్మ భర్త మంచం పట్టాడు. వ్యాపారం
దివాలా తీసింది. దిగులుతో భర్త ఊపిరి ఆగింది. నాగమ్మ
ఎవరూ లేని అనాధగా మారింది. మరో ఆధారం లేక పొట్ట
కూటి కోసం పట్నానికొచ్చి బిచ్చకత్తెగా మారింది ముసలి అవ్వ
నాగమ్మ.
                  *.                      *.                       *