'' ఆ'' ఇద్దరు :- టి. వేదాంత సూరి


 ఆక్లాండ్ లో వేసవి తీవ్రత పెరిగింది. ఎండ మండి పడుతుంది. ఆ ప్రభావంతో దాహం పెరిగింది. ఎండలో వెళ్లి వస్తే తల నొప్పి, వస్తోంది. అందుకే ఉదయం కాకుండా సాయంకాలం ఏడు గంటల సమయం లో వాకింగ్ వెళ్ళాం, ఆద్య, ఆరియా తో బయలు దేరాము. అప్పుడు ఎండ తగ్గింది కానీ చలి గాలులు వస్తున్నాయి. 
అక్కడికి వెళ్ళాక చక్రాల బండి పైనుంచి దిగుతానని ఆరియా మారాం చేసింది. వచ్చేప్పుడు చెప్పులు వేసుకు రాలేదు. అయినా ఇబ్బంది ఏమీ లేదని దింపాము, అక్కడ పచ్చికలో అటు, ఇటు చక్కర్లు కొట్టింది. ఆద్య కూడా పరుగులు తీసింది. 
ఎంత ఆడుకున్నా ఒక సారి నానమ్మ వద్దకు వచ్చి హాగ్ ఇస్తుంది ఆద్య, అక్క వచ్చిందంటే చాలు ఆరియా కూడా వస్తుంది. 
ఇక్కడ పచ్చికను ప్రతి రెండు , మూడు రోజులకు ఒక సారి కట్ చేసి శుభ్రం చేసి వెళతారు. చాలా ఆహ్లాద కరంగా ఉంటుంది. పురుగు, బూచి ఇక్కడ అసలే ఉండవు. దోమలు మచ్చుకైనా కనిపించవు. మీకో విషయం తెలుసా ? ప్రపంచం లో పాములు లేని దేశం ఏది అంటే న్యూజిలాండ్. . కానీ ఆస్ట్రేలియా లో విపరీతంగా పాములు ఉంటాయట. 
ఈ ఎండ  మరో నెల రోజుల పాటు ఉండొచ్చు అని వాసు చెప్పింది. ఇక్కడ చలి మాత్రమే కాదు ఎండ తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటుందన్న మాట. 
(మరిన్ని ముచ్చట్లు రేపు )