స్కూలుకి గిఫ్టు : రచన: డా. శ్రీసత్య గౌతమి, అమెరికా

 తైలసంస్కారంలేని జుట్టులా సున్నంలేని అక్కడక్కడ మసిబారిన పసుపురంగు గోడలు, చెదపట్టిన తలుపులు, కిలుంపట్టిన బోర్డుతో 'పురపాలక సంఘ బాలబాలికల ఉన్నత పాఠశాల, పల్లికొండ, భీంగల్ మండలం, నిజామాబాద్ జిల్లా'.

"స్కూలు మరమ్మత్తులు, సౌకర్యాలకోసం ఆర్ధిక సహాయాన్ని అర్ధిస్తూ యాజమాన్యం ఇప్పటికే ఎన్నోసార్లు గవర్నమెంటుకి కాగితాలు పంపింది. డి.ఇ.ఓ వచ్చిన ప్రతిసారీ విద్యార్ధులు లేరనే వ్రాసుకొని వెళ్తున్నారు. ఇంక ఫండ్సేమి ఇస్తారు? స్కూలేమి బాగుపడుతుంది? ఆఖరుసారిగా వస్తామంటున్నారు అప్పటికైనా 100% విద్యార్ధుల అటెండెన్సు ఉండాలి. అమ్మాలారా, అయ్యలారా...పిల్లల్ని బడిమానిపించకండి. ఇప్పుడు మీరు వాళ్ళకు చేయూతనిస్తే, మీరు వృద్ధులయ్యాక ఆసరాగా నిలబడడానికి వాళ్ళు ఆర్ధికస్తోమతను కలిగివుంటారు. ఊరి పెద్దలకు సహకరించండి" అంటూ ఊరి పెద్దల ఆధ్వర్యంలో జరుగుతున్న మీటింగులో శంకరం టీచర్, గౌతమీ టీచర్ తల్లిదండ్రులను కోరుతున్నారు. 


గౌతమీ టీచర్ "పిల్లలూ, మన స్కూలుని మనమే బాగుపరచుకోవాలి. మీరు బాగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులయితే, కాలేజీ కూడా పెట్టించుకుందాం.  మీ స్నేహితులందరూ విడిపోకుండావుండాలంటే మీకొక స్కూలు కావాలి. కలిసి ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కావాలి. స్కూలు విద్యనే కాదు స్నేహాన్ని కూడా పెంచుతుంది. మనకు హితుల్నీ, స్నేహితుల్నీఇచ్చే స్కూలుకి మీరు కూడా గిఫ్టు ఇవ్వచ్చు. అదే దాన్ని కళ్ళల్లో పెట్టుకొని కాపాడుకోవడం. మీలో ఎంతమంది ముందుకొస్తారు?" అంటూ గద్గద స్వరంతో అడగగానే...


పిల్లలు ఆర్ద్రమైపోయారు. 


"ఈ వేసవి శెలవుల్ని స్కూలు కోసమే కేటాయిస్తాము టీచర్. మేమంతా కలిసేవుంటాము, చదువుకుంటాము టీచర్" అని కళ్ళు తుడుచుకుంటూ ఒకరి చేతులు ఒకరు పట్టుకున్నారు. 

కన్నవాళ్ళు కరిగిపోయి పిల్లలకు చేయూతనిచ్చారు. 

తల్లులు క్లాసురూములు కడిగేసారు. ఊరి పెద్దలు చేసిన కాస్త ఆర్ధిక సహాయంతో తండ్రులు స్కూలంతా రంగులు వేసారు. మగ పిల్లలందరూ తుప్పలు కొట్టేసి స్కూలు ఆవరణనంతా శుభ్రపరిచారు. ఆడపిల్లలు నీతిసూత్రాలు గోడల మీద వ్రాసారు. కలప, కంప తెచ్చి పందిరి వేసి టీచర్లకు వెయిటింగు రూం అని బోర్డు పెట్టారు. కంప్యూటర్లు లేకపోయీనా ఒక క్లాస్ రూం కి కంప్యూటర్ రూం అనీ, ఒక రూము కి స్పోర్ట్సు రూము అనీ, లైబ్రరీ లేకపోయినా లైబ్రరీ అనీ బోర్డులు పెట్టారు. పిల్లలు స్కూల్లోపల దూరంగా గోతులు త్రవ్వి, తడికలు వేసి మూత్రశాలలు ఏర్పాటు చేసుకున్నారు. 

పిల్లలు తెలివిగా సమస్యను అధికారుల దృష్ఠికి తెచ్చారు.

ప్రతిరోజూ క్లాసులకొచ్చి పాఠాలు వింటున్నారు. 

పరీక్షలు వ్రాస్తుండగా సడన్ ఇన్స్పెక్షన్ కి డి.ఇ.ఓ వారి బృందం వచ్చి రిజిస్టర్లలో 100% అటెండెన్సు చూసి సంతృప్తిపడ్డారు. స్కూలంతా తిరిగి, ఖాళీ రూములు చూసి లైబ్రరీ, కంప్యూటర్లు, విద్యుత్తు మరియు ఇంటర్నెట్ కావాలనీ, స్పోర్ట్సు కోసము ఒక పి.యి. టీచర్ ను అప్పాయింటు చెయ్యాలనీ, మూత్రశాలలకోసము వెంటనే ఫండ్సు రిలీజ్ చెయ్యాలని వ్రాసుకొని వెళ్ళారు. అదే వారంలో ఫండ్సు శాంక్షన్ అయిపోయింది. పిల్లలకు యూనిఫాం కోడు కూడా ఇచ్చారు. 

పిల్లల సంతోషానికి అవధులు లేవు. ప్రేమనిండిన కళ్ళతో చేతులు గట్టిగా పట్టుకొని ఎప్పుడూ కలిసివుంటామనే విశ్వాసాన్ని గుండె నింపుకొని స్కూలు బయట నిలబడి బోర్డు చూస్తూ భవిష్యత్తును కలగంటున్నారు.

(సమాప్తం)