నవోదయం (స్ఫూర్తి కథ )-- కందర్ప మూర్తి , కుకట్ పల్లి , హైదరాబాదు.

 అగ్రహారం బ్రాహ్మణవీధిలో ఇంటి వసారా వాలుకుర్చీలో కూర్చుని
ఊరి పురోహితులు రామనాథ శాస్త్రి పంచాంగం చూస్తున్నారు.
            "  దండాలు బాబయ్యా ! "
        " ఏరా అప్పలస్వామీ , ఇలా వచ్చావు ? "
        " నా బొట్టికి లగ్గం సెయ్యాలనుకుంటున్నాను బాబూ ! దగ్గిరలో 
మూర్తం సూత్తారని  తమ వద్ద కొచ్చినాను. "
          " నీ కూతురు వయసెంతరా ? "
       " మొన్న దీపావలి అమాస్యకి  పదమూడెల్లి పద్దాలుగు వచ్చిందయ్య. మన ఊరి ఇస్కూల్లో తొమ్మిది సదువుతోంది. "
        " అప్పుడే దానికి పెళ్లేమిట్రా ! చదువు కుంటానంటే చదివించు.
పదో తరగతి పాసు కానివ్వు. " 
         " లేదు బాబయ్యా , నా అక్క కొడుక్కిచ్చి లగ్గం సేద్దామను కుంటున్నాను. ఆడు పదకొండు పాసయినాడట. మిలిట్రీకి పోతా
నంటున్నాడు. ఇక్కడే కూలో నాలో సేసకుని బతకరా అంటే ఇనటం
లేదు. మిలిట్రీకి పోయి నౌకరీ సేసుకుంటాడట. నా బొట్టె నిచ్చి లగ్గం
సేసేస్తే ఇక్కడే పడుంటాడు." 
         " ఆడపిల్ల కి పద్దెనిమిది , మగ పిల్లాడికి  ఇరవై సంవత్సరాలు
పూర్తవ్వకుండా పెళ్లి చెయ్య కూడదు. " 
      " అయ్యన్నీ పెద్దోల్లకి  బాబయ్యా !  కూలీ నాలీ సేసుకుని బతికేటి
మా బోటోల్లకి ఎలా సాగుద్ది. దాని లగ్గం  అయిపోతే నిచ్చింతగా ఉంటాది. మా అమ్మ ముసిల్ది లచ్చికి బేగె లగ్గం సెయ్యరా , సూసి
సచ్చి పోతానంటాది. మరేం సెయ్యాల . నా ఆడది కూడ అదే అంటోంది. అర ఎకరం  ముక్క అమ్మి బొట్టికి లగ్గం జరిపేత్తే అత్తారింటికి
పోతాది " ఏకరువు పెడుతున్నాడు సన్నకారు రైతు అప్పల స్వామి
       ఇంటి లోపల్నుంచి ఈ సంభాషణ విన్న రామనాథ శాస్త్రి గారబ్బాయి హైస్కూలు హెడ్మాష్టరు సుబ్రమణ్యం బయటి కొచ్చి
 " అప్పలస్వామీ , నీ మేనల్లుణ్ణి నా దగ్గరకు పంపు. వాడితో నేను మాట్లాడుతా. లక్ష్మి తెలివైన పిల్ల. నీ కూతుర్ని పది పాసవనీ. ఆడపిల్లల్కి
చిన్న వయసులో పెళ్లి చేస్తే చట్టరీత్యా నేరమే కాదు , ఆమె శరీర ఆరోగ్యానికి  పుట్టబోయే పిల్లలకు మంచిది కాదు.
     ఇంట్లో చదువుకున్న ఆడపిల్లుంటే ఇల్లంతా వెలుగు. లోక జ్ఞానం తెలుస్తుంది. ఆరోగ్య విషయాలు తెలిసి ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంటాయి. వారి పిల్లలకు చదువు చెప్పుకో వచ్చు.
    ఒక దీపంతో పది దీపాలు  వెలిగించినట్లు చదువుకున్న తల్లి ఉంటే
ఇంట్లో పిల్లలందరూ విధ్యాబుద్దులతో రాణించవచ్చు. భాద్యతలు తీరి
పోతాయని , ముసలోళ్లు చచ్చిపోక ముందే లగ్గం చేసెయ్యాలని పసిమొగ్గల జీవితాల్ని నాశనం చెయ్యకండి.
      ప్రభుత్వాలు ఆడపిల్లల చదువుల కోసం స్కావర్ షిప్పులు , సైకిళ్లు
మరెన్నో  సౌకర్యాలు కలగచేస్తున్నాయి. మీలాంటి వెనుక బడిన వర్గాల
వారికి ఎన్నో ఉధ్యోగావకాశాలు కలగ చేస్తోంది. వాటిని ఉపయోగించు
కోండి." వివరించి నచ్చచెప్పేడు
        " అలాగే చినబాబూ, సదువు లేనోల్లం. ఇయన్నీ మాకెలా తెలుత్తాయి. మా తాత ముత్తాతల కాడనుంచి ఇట్టాగే దినాలు గడిచిపోనాయి. దరమ పెబువులు , ఇన్ని ఇసయాలు తెలియ సెప్పినారు. నా మేనల్లుడిని తమ కాడికి పంపుతా. ఆడికో దారి సూపండి బాబూ, సిత్తం. సెలవిప్పించండి." నమస్కరించి వెళిపోయాడు అప్పలస్వామి.
                       *                   *                   *
        " నమస్కారం మేస్టారూ! మీరు పిలిచారని మా మావయ్య
అప్పలస్వామి చెప్పినాడు "
       " అవునోయ్ చంద్రం ! మిలిటరీ కెళతావట. నీలాంటి యువకులు
మిలిటరీలో చేరి దేశరక్షణకు  ముందుకు రావడం మంచిదే . కాని వెనుక బడిన పల్లెల్లో నిరక్షరాస్యత , మూఢ నమ్మకాలు, అనారోగ్యాల
కారణంగా అమాయక ప్రజలు ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.  ప్రభుత్వాలు డబ్బు ఖర్చుచేసి  అనేక పథకాలు
అమలు పరుస్తున్నప్పటికీ నిరక్షరాస్యత వల్ల అవి సఫలం కావటం లేదు.
నీలాంటి  చదువుకున్న యువకులు ప్రభుత్వ పథకాలు సద్వినియోగం
చేసుకోసుకుని  ఉపకార వేతనాలు పొంది ఉన్నత చదువులు పూర్తి చేసి
గ్రామాల అభివృద్ధికి కృషి చెయ్యాలి.
      నిరక్షరాస్యత కారణంగా నీ మావ అప్పలస్వామి పసిపిల్ల లక్ష్మిని
 నీకిచ్చి పెళ్లి చేసి భాద్యత  తీర్చు కుందామనుకుంటున్నాడు. మైనర్లకి
పెళ్లి జరిపిస్తే చట్టరీత్యా నేరం. ఇటువంటి సాంఘిక దురాచారాలు నీలాంటి చదవుకున్న వారు ఊరి జనాలకు తెలియ చెప్పాలి.
    నువ్వు పట్నమెళ్లి డిగ్రీ కాలేజీ అడ్మిషన్ ఫారం తీసుకురా. నీకు
స్కాలర్ షిప్ వస్తుంది. డిగ్రీ కాలేజీలో చేరి నా దగ్గరికొస్తే ట్యూషన్ చెబుతాను. డిగ్రీ పూర్తయితే భవిష్యత్తులో ఏం చెయ్యాలో నే చెబుతా" 
అన్నారు.
       సుబ్రమణ్యం మాస్టారి పర్యవేక్షణలో చంద్రం స్కాలర్ షిప్ పొంది
డిగ్రీ పూర్తి చేసి బి.ఎడ్. ట్రైనింగై  ప్రభుత్వ ఉపాధ్యాయుడయాడు.
   అగ్రహారం  దాని చుట్టు గ్రామాల్లో యువతను అబ్యుదయ పరిచి
చదువు , ఆరోగ్యం , రక్షిత త్రాగునీరు , పరిసరాల శుభ్రత , మూఢ
నమ్మకాల నిర్మూలన , ప్రభుత్వ పథకాల సద్వినియోగం, పర్యావరణ
పరిరక్షణకి ఎంతో కృషి చేసాడు.
       మేనకోడలు లక్ష్మిని ఇంటర్ వరకు చదువు పూర్తి చేయించి
గ్రామ ఆరోగ్య సేవిక ( ఎ.ఎన్.ఎమ్.) గా ట్రైనింగ్  అయిన తర్వాత 
గ్రామంలో పారిశుద్యం , శిసు మరణాల నివారణ , స్త్రీల ఆరోగ్య రక్షణకు
ఎంతో సహాయ పడ్డాడు.
     చంద్రం సామాజిక సేవకు గుర్తింపుగా ఉత్తమ ఉపాధ్యాయుడిగా
ప్రశంసా పత్రం జిల్లా కలెక్టరు గారి చేతుల మీదుగా పొందాడు.
       ఊరి పెద్దల సమక్షంలో సుబ్రమణ్యం మాస్టారి పర్యవేక్షణలో ఊరి
పురోహితులు రామనాథశాస్త్రి గారి చేతుల మీదుగా అగ్రహార గ్రామ
అబ్యున్నతకి పాటుపడిన యువజంట లక్ష్మి - చంద్రం ల  పెళ్ళి అట్టహాసంగా జరిగింది.
                  *                  *                 *