చదువు – స్పీడు – స్లో --డా.. కందేపి రాణీప్రసాద్.


 


ఒకటో తరగతి నుండి 5వ తరగతి దాకా అంటే 5 సంవత్సరాల చదువు కేవలం ఒక్క సంవత్సరంలోనే చదివించారు నాచేత మా నాన్నగారు. నాకు ఐదవ సంవత్సరం వచ్చాక మాత్రమే అక్షరాభ్యాసం చేయించారు. అప్పటి దాకా బలపం పట్టుకోకూడదు కాబట్టి అక్షరాలు దిద్దలేదు. నోటితో చదివేవన్ని చదివించేశారు. నాకు ఏడాదికల్లా మాటలు బాగా వచ్చాయట. అందువల్ల ఏడాదిన్నరలోపే జనవరి ఫిబ్రవరి వంటి ఇంగ్లీషు నెలల పేర్లు, నక్షత్రాల పేర్లు, అంకెలు వంద దాకా చెప్పటం, ఎ బి సి డి లు మొత్తం, అ ఆ లు అక్షరాలు అన్నీ నేర్పించింది మా అమ్మ. ఒక ఇంగ్లీషు పుస్తకం కొని యాపిల్, బ్యాట్ అంటూ బొమ్మలు చూసి పేర్లు చెప్పటం కూడా నేర్పిందట అమ్మ. అమ్మ ఏది చెపితే అలానే పలికేదాన్నట నేను. ఆ సంతోషంతో అమ్మ అన్నీ నేర్పించింది. అప్పట్లో ఇంటికి ఎవరు వచ్చిన ఇవన్నీ నా చేత చెప్పించటం, అబ్బో ఈ అమ్మాయి చాలా తెలివి కలది అని వాళ్ళు పొగడటము బాగా అలవాటైపోయింది. సంవత్సరమున్నర వయసు లేదు పిల్లకు ఎన్ని చదివేస్తుంది అని అందరూ ఆశ్చర్యపోవటం సాధారణ విషయంగా మారిపోయింది. ఇంకా కొంతమంది “మా పిల్లలు ఇదే ఈడు వాళ్ళు ఇంకా మాటలే రాలేదు” అని విచిత్రంగా చూసేవాళ్ళట. ఈ మాటలు మా అమ్మ చెప్తుంటే మా పిల్లలు “అమ్మా అప్పుడు టీవీలు లేవుకదా లేదంటే నువ్వు సూపర్ కిడ్ లా టీవి లో వచ్చేదానివి” అంటుంటారు.

ఊరి వారందరి దగ్గర్నుంచి ఇలాంటి పొగడ్తలు విన్న మా నాన్నగారు “ఇంకేం! మా అమ్మాయి డాక్టరై పోతుంది” అని కలగనేశారు. అప్పటికే మా మామయ్య పిల్లలు, మా పెద్దనాన్న కూతురు చాలా మండి డాక్టరు చదివారు. వారిలో ఆడపిల్లలు డాక్టరు చదువుతున్నపుడు వయసు దాటి పోతుందని మూడవ సంవత్సరంలోనే పెళ్లి చేసినపుడు ఆ తరువాతి చదువు దెబ్బతిన్నదట. ఇది చూసి మరొక అమ్మాయికి పూర్తిగా చదువైపోయాక పెళ్లి చేశారు కానీ వయసు ఎక్కువైపోయిందని బాధపడ్డారట. ఈ రెండు సంఘటనలు చూసిన మా నాన్నగారు ఒక అధ్బుతమైన పథకం రచించుకున్నారు. మా అమ్మాయి డాక్టరు చదవాలని ఈస్ట్ మన్ కలర్ లో కల కనేశారు కాబట్టి అమ్మాయికి డాక్టరు చదువు మధ్యలో పెళ్ళి చేయకూడదు, అదే సమయంలో అమ్మాయికి పద్దెనిమిదేళ్ళు దాటిపోకూడదు అనుకున్నారు.

ఈ ప్లాన్ లో భాగంగా నాకు అక్షరాభ్యాసం చేయగానే ఒక్క సంవత్సరంలో ఐదు తరగతులు పూర్తి చేయించారు. నాకు ఆరవ సంవత్సరం వచ్చేసరికి ఆరవ తరగతిలో చేర్చాలని హైస్కూలుకు తీసుకెళ్లారు. ప్రైమరీ స్కూలులో చదివినట్లు సర్టిఫికేట్ లేదు కాబట్టి ఎంట్రెన్స్ రాయాలని చెప్పారు. నాచేత ఆరవ తరగతి ఎంట్రెన్స్ రాయించారు. ఆ ఎంట్రెన్స్ లో కేవలం ప్రశ్నలు మాత్రమే రాసి సమాధానాలు రాయలేదట నేను. “ఎంటమ్మా ఎందుకు రాయలేదు అని అడిగితే “బోర్డు మీది ప్రశ్నలు రాసుకోండి అన్నారు కానీ సమాధానాలు రాయమని చెప్పలేదు” అని చెప్పానట. అక్కడున్న మాస్టర్లందరూ విరగబడి నవ్వరాట. అప్పుడు హెడ్మాస్టర్ సూచనతో మరుసటి సంవత్సరం ఎంట్రెన్స్ రాశి పాసయ్యాను. 7వ సంవత్సరంలో ఆరవ తరగతిలో చేరాను. అలా పదహారు సంవత్సరాలకు డిగ్రీ పూర్తయింది. ఇది నా చదువు నేపథ్యం.

నేను బియస్సీ పూర్తి చేశాక ఎమ్మెస్సీ చదవాలనుకున్నాను. కానీ నాకు 67% మార్కులే వచ్చాయి. 70% మార్కులున్న వాళ్ళకి మాత్రమే నాగార్జున యూనివేర్సిటీ లో సీట్లు ఇచ్చారు. అలా ఎమ్మెస్సీ చదవలేకపోయాను. అందుకే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో M.A ఇంగ్లీషు చదవమని సలహా ఇచ్చారు. అలా ఏం.ఎ ఇంగ్లీషు కు నాగార్జున యూనివర్సిటీ లో అప్లై చేశాను. పుస్తకాలు వచ్చాయి. ప్రిపేర్ అవుతున్నాను. ఇంతలో మానాన్న నాకు పెళ్ళి కుదిరించేశారు. నేను మా అమ్మాయిని డాక్టరు చదివిద్దామనుకున్న కానీ చదవలేదు. కాబట్టి కనీసం అల్లునైనా డాక్టర్ను తెచ్చుకుందామనుకున్నాడు. ఇంతకీ మధ్యలో ట్విస్ట్ చెప్పనేలేదు కదా! ఇంత హంగామా చేసి డాక్టర్ని చేద్దామనుకున్నారు కదా! ఏమైంది అని అర్థం కాలేదు కదా! బైపీసీ గ్రూపు తీసుకొని ఇంటర్ చదువుతున్నాను సీనియర్ ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి ఇంకో రెండు పరీక్షలున్నాయనగా ఆడపిల్లల పండుగ వచ్చింది. ఆ పండుగను అంగరంగ వైభవంగా జరపడంలో అమ్మానాన్నలు డాక్టరు చదువును వదిలేశారు అలా ఇంటర్ పరీక్షలు పూర్తిగా రాయలేక పోవడం వలన డాక్టరు చదవలేకపోయాను. అలా వంక కుదిరింది గాని ఎంట్రెన్స్ రాశాక కచ్చితంగా సీటు వచ్చేదాని గ్యారంటీ ఏమి లేదు కదా!

నన్ను డాక్టరు కిచ్చి పెళ్ళి చేసి ఘనంగా అత్తరింటికి సాగనంపి మా నాన్న ఎంతో ఆనందపడ్డాడు. అలా నా ఎం.ఎ  ఇంగ్లీషు అట్టడుగున పడిపోయింది. ఆ తర్వాత వెంటనే ఇద్దరు పిల్లలు. కుటుంభ బాధ్యతలతో పాటుగా మావారి ఆసుపత్రిని చూసుకోవడంలోనూ మునిగిపోయాను. పెళ్ళయిన తర్వాత ఎం.ఎ తెలుగు, ఎమ్మెస్సీ జువాలజీ, తెలుగు సాహిత్యంలో పి హెచ్ డి వంటి మూడు డిగ్రీలు సాదించాను. కానీ ఈ మూడు డిగ్రీలు సాధించడానికి ముప్పైయేళ్లు పట్టింది. అది ఆడపిల్లలు పెళ్లయ్యాక చదువుకోవమంటే పట్టే ఆలస్యం.

ఇంతకీ చిత్రమైన విషయమేమిటంటే చిన్నప్పుడు అన్నీ ముందు ముందుగా చదివేసి అందరి చేత పొగిడించుకొని వాళ్ళు ఆశ్చర్యపోయి నోరెళ్ళబెట్టేలా చేశానని తెగ శంబర పడ్డారు మా అమ్మానాన్నలు. అదే పెళ్లయ్యాక పిల్లలతో, కుటుంబ బాధ్యతల్తో, ఆసుపత్రి నిర్వహణలో మా వారికి సహాయం చేస్తూ మూడు డిగ్రీలకు ముప్పైయేళ్ళ కలామ్ పట్టింది. అప్పుడేమో అంత స్పీడు ఇప్పుడేమో ఇంతస్లో ఎంతో ఎప్పుడు ఎలా జరుగుతుందో మనకేమి తెలీదు. కాలంతో పాటు వెళ్లిపోవడమే మన పని