ఏవీ ఆరోజులు:-సత్యవాణి 8639660566

 ఏవీ ఆరోజులు
ఎటెళ్ళిపోయాయి
ఏవీ ఆప్యాయతలు
ఎలా కరిగిపోయాయి
ఒక్క కంచంలో బువ్వతిన్న
ఆరోజులు
పెద్ద ముద్ద వాడిదని
చిన్నముద్దైతేనాకొద్దేవద్దని
చిలిపి తగువులాడుకొన్న ఆరోజులు
మాగాయి టెంకలను చీకిన పీచుతో 
గడ్డంతాతలను చేసి నవ్వుకొన్న ఆరోజులు 
సీతాకాలంలో పందిరి మంచం
పెద్దదౌతుందని నానమ్మచెపితే
నమ్మి 
పదిమంది దానిపైచేరి పకపకలాడుతూ కబుర్లాడి కథలను చెప్పుకొన్న ఆరోజులు
అన్నయ్య చెప్పిన దెయ్యంకథలకి
హడలిపోయి
ఆంజనేయదండకాలు
చదువుకున్న ఆరోజులు
కప్పుకున్న దుప్పట్లు కాళ్ళక్రిందకి జారిపోగా
చలికి ఒకరి డొక్కల్లోఒకరు
ఒదిగిపోయి వెచ్చగా నిద్రించిన ఆరోజులు
ఏవవి  ఎటు మళ్ళిపోయాయి
మళ్ళీ రావాఅవి
మాయమైపోయినట్లేనా 
మరిహ కనిపించవా