దైవ ధ్యానం:--సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, ధర్మపురి--మొబైల్: 9908554535.

 ధర్మయ్య పొరుగూరికి పోదలచి అడవిగుండా ప్రయాణం అయ్యాడు .అప్పుడు ప్రయాణ సాధనాలు లేవు. త్రోవలో కనకయ్య కనబడగానే" అయ్యా! మీరు నా చెయ్యి పట్టుకోండి. నేను మీ వెంబడి వస్తాను" అని అన్నాడు.అప్పుడు కనకయ్య "అదేం .నీవు గుడ్డివాడివా!కుంటివాడివా! నీ చెయ్యి నేను ఎందుకు పెట్టుకోవాలి" అని ప్రశ్నించాడు? " అదేం కాదు. నేను దైవధ్యానంలో ఉంటాను. కనుక నాకు ఆటంకం కలిగించకండి" అని అన్నాడు ధర్మయ్య.  కనకయ్య సరేనన్నాడు.
           కొద్ది దూరం వెళ్లేసరికి కనకయ్యకు ఒక పెద్ద పాము కనిపించింది. "పాము!పాము" అని అరిచాడు కనకయ్య .ధర్మయ్య చెక్కు చెదరకుండా ఉన్నాడు. చివరకు కనకయ్య ఒక కర్రతో దానిని కొట్టి చంపాడు. అయినా ధర్మయ్య చేతిని వదిలిపెట్టలేదు.
             మరి కొద్ది దూరం వెళ్లేసరికి కారు చీకట్లు కమ్ముకున్నాయి. అకస్మాత్తుగా గాలి వాన మొదలైంది. ఒక్కసారిగా ఆకాశంలో మెరుపు మెరిసి వారి దగ్గరి లోని ఒక చెట్టు పై పిడుగు పడింది. కనకయ్య 'పిడుగు! పిడుగు 'అని అరిచాడు .అయినా ధర్మయ్య చెక్కుచెదర లేదు. కనకయ్య అతని చేతిని వదలలేదు. కొద్దిసేపటికే వర్షం ఆగింది. ఇద్దరూ గ్రామ సరిహద్దుల వరకు చేరుకున్నారు.
          అప్పుడు కనకయ్య" మీరు చాలా దైవభక్తిపరులు. అందుకే ఇంత సేపు దైవ ధ్యానం లో ఉన్నారు. మీరు ఎంతో ధైర్యవంతులు కూడా. నేను            'పాము ,పాము 'అనీ, 'పిడుగు, పిడుగు' అని ఎంత అరచినా మీరు భయపడలేదు" అని అన్నాడు.
         అప్పుడు ధర్మయ్య "అదేం కాదు! నేను చాలా పిరికి వాడిని. అందువల్లనే కళ్ళు మూసుకున్నాను. కనుక ఏమీ కనబడలేదు. చెవులలో  దూదిని పెట్టుకున్నాను. అందువల్ల మీరు అరచినా నాకు ఏమీ  వినబడలేదు. మీతో దైవధ్యానం అని నేను అబద్ధం చెప్పాను. అలా చెప్పకుంటే మీరు నా చేయి పట్టుకోరు. నా చేయి పట్టుకోకుండా ఉంటే నేను భయంతో ఇక్కడి వరకు వచ్చే వాడిని కాను. నేను అత్యవసరంగా ఒక మంచి పనికి  అనగా పేద విద్యార్థులకు అన్నదానం చేయడానికి పొరుగూరికి వెళ్ళవలసి వచ్చింది. నాకు భయం ఎక్కువ. కనుకనే మీకు నేను పిరికివాడినన్న సంగతి చెప్పక  అబద్దం ఆడవలసి వచ్చింది. కనుక నన్ను క్షమించండి" అని అన్నాడు.