ధర్మబుద్ధి-సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,ధర్మపురి.మొబైల్: 9908554535.

 సోమయ్య అనే రైతు ఒక ఆవును కొనదలచి సంతకు బయలుదేరాడు .ధర్మయ్య అను ఒక ఆసామి దగ్గర ఆవును కొని ,తిరిగి వస్తుండగా అతనికి విపరీతమైన దాహం అయింది .ఊరి పొలిమేర లోని ఒక ఇంట్లో మంచినీరు తాగి బయటకు వచ్చేసరికి ఆ ఆవు కనబడలేదు. అప్పుడే చీకటి పడుతుండటంతో ఆ ఆవు జాడ తెలియలేదు .ఎవరిని అడిగినా లాభం లేకపోయింది. " అయ్యో! ఇంత డబ్బు పెట్టి కొన్న ఆ ఆవు  తప్పిపోయిందే! డబ్బు అంతా వృథా అయ్యిందే " అని బాధపడుతూ ఇంటికి చేరాడు సోమయ్య.
         ఆ అవును ఎత్తుకెళ్లిన దొంగ వీరన్న. వీరన్న ఆ అవును తస్కరించి పొరుగు గ్రామంలోని తన సోదరి ఇంట్లో కట్టి వేశాడు. దానిని వచ్చేవారం సంతలో అమ్ముతానని , అంతవరకు మీ ఇంట్లోనే ఉండనిమ్మని  సోదరిని వేడుకున్నాడు .ఆమె సమ్మతించింది. ఈ సంగతి తెలియని అతని బావ పొరుగూరు నుండి వచ్చి ఎవరిదో ఆవు ఉన్నదని గమనించి కోపంతో దాని కట్లు విప్పి వెళ్ళగొట్టాడు. ఆ ఆవు ప్రక్క గ్రామానికి పరుగెత్తింది .
       ఒకసారి పొరుగు గ్రామంలోని పూజారికి అవసరానికి ఒక ఆవు కావలసి వచ్చింది. ఆ వూరి ధనవంతుడు సుబ్బిశెట్టి తండ్రి మరణించడంతో ఒక  ఆవును దానంగా ఇవ్వాలని అనుకున్నాడు. అందుకు పూజారినే  ఆవును తీసుకొని రమ్మన్నాడు .పిల్లికి కూడా బిచ్చం పెట్టని  సుబ్బిశెట్టి ఏకంగా ఆవును దానంగా ఇస్తానని  అనేసరికి ఆ పూజారి ఎగిరి గంతు వేశాడు. మళ్ళీ అతని మనస్సు మారుతుందేమోనని  వెంటనే ఆవు కొరకై ఊరంతా గాలించాడు .ఆ గ్రామంలోని వారందరూ తమతమ ఆవులు మేతకు వెళ్లాయని బదులిచ్చారు. పూజారికి ఎక్కడా ఆవు దొరకలేదు. ఇంతలో అటువైపు వస్తున్న సోమయ్య యొక్క అవును చూసి సమయానికి వచ్చిందని, దానిని తోలుకొనిపోయి  గోదానంగా  ఇప్పించుకున్నాడు. సుబ్బిశెట్టి దగ్గర ఆవు ఖరీదు పుచ్చుకుని పూజారి దానం అయిపోగానే ఆ ఆవును విడిచిపెట్టాడు.
           ఆ ఆవు తిరిగి తిరిగి తన పాత ఆసామి ధర్మయ్య ఇంటికి వచ్చింది .వాస్తవంగా ఆ అవునే ధర్మయ్య సోమయ్యకు అమ్మాడు.వెంటనే తన ఇంటికి ఆవు రావడం చూసిన ధర్మయ్య దానిని తిరిగి సోమయ్యకు అప్పగించాడు .తన ఆవు దొరికినందుకు సోమయ్య మనసులోనే దేవుడికి దండం పెట్టుకుని ధర్మయ్య  ధర్మబుద్ధిని ప్రశంసించాడు. న్యాయంగా చెందాల్సిన  సోమయ్యకే  ఆ ఆవు దక్కింది. అందుకే  ధర్మంగా, న్యాయంగా ఉన్నవారికి దేవుడు కూడా సహాయపడతాడు.