ఇందుకొచ్చారా: - యామిజాల జగదీశ్
 ఓ డ్రై ఫ్రూట్స్ విక్రయశాలలో పని చేస్తున్నాను. కాలక్షేపంకోసమే కావచ్చు. 
రోజు మొత్తం మీద ఓ అరడజన్ మంది వినియోగదారులొస్తే ఎక్కువ.  కనుక ఎవరైనా తెలిసిన వాళ్ళొస్తే బాగుంటుందనుకుంటూ ఉంటాను కబుర్లు చెప్పడానికి. 
అనుకున్నట్టే కాకపోయినా అనుకున్న గంటకో పెద్దాయన వచ్చారు. పరిచితులే. 
అమ్మయ్య, వచ్చారనుకుని గుమ్మంలోనే ఉన్న కుర్చీలో కూర్చోమన్నాను. 
మాటలు మొదలుపెట్టారు. 
ఓ నిజం చెప్పమంటారా? అది చెప్పడానికి ఏమీ అనిపించకపోయినా వినడానికి కొంచెం చేదుగానే ఉంటుంది. కానీ చాలా కాలంగా చెప్పాలనుంది. చెప్తున్నాను. కొంచెం గట్టి చేసుకోండి మనసునీ అంటూ విషయంలోకెళ్ళారాయన.
పెద్దవాళ్ళు చేసే పాపపు పనులు దుష్టకార్యాలూ కన్న పిల్లల్ని  దెబ్బతీస్తాయండి. పెద్దవాళ్ళు చెయ్యాలని చెయ్యకపోయినా పూర్వజన్మలో చేసిన వాటిని ఈ జన్మలో అనుభవించకతప్పదు. సుఖం చెప్పలేనుగానీ కష్టమైతే మాత్రం తప్పక అనుభవించాల్సిందే. శ్రీరాముడంతటివాడే ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసుకదండీ....మీకు నేను చెప్పక్కర్లేదు.ఇక మీ విషయమే తీసుకోండి....మీ అబ్బాయి విషయానికే వస్తాను. వాడి సఫరవుతున్నాడంటే అందుకు మీరు బహుశా ఏదో ఒక పాపం చేసే ఉంటారు. మీరు చెయ్యాలని చేసుండరు. కానీ గత జన్మలో చేసిన వాటిని అనుభవించడానికే మళ్ళీ మనమందరం పుడతుంటాం. మీరు కావాలనే ఏదో  పాపం చేసారనడం లేదండి. మీకు తెలియకుండానే చేసుండొచ్చు. మీ అబ్బాయి కష్టాలెదుర్కొంటున్నాడంటే వాటిని చూసి మీరు బాధ పడతారంతే. అంతకంటే ఇంకేమీ కాదు. మన చేతుల్లో ఏమీ లేదండి. మనం నిమిత్తమాత్రులం. మీరు ధైర్యంగానే ఉండండి. మంచైనా చెడైనా మీరైనా నేనైనా ఆ మాటకొస్తే ఎవరైనాసరే అనుభవించకతప్పదండి....గట్టిగా ఉండండి...అంతా కర్మ సిద్ధాంతమండీ" అంటూ వెళ్ళిపోయారు. 
ఆయన వెళ్ళిపోయిన తర్వాత అనుకున్నాను...."ఇందుకా ఈయనొచ్చాడని"