కూతురు: - పద్మ త్రిపురారి.


  కూతురంటే మహాలక్ష్మి.మమతానురాగాలకు మరో పేరు.కానీ అందరు కూతుళ్లు ఒకేలా ఉండకపోవచ్చు.కొందరు కూతుళ్లు తల్లిదండ్రులే తమ దైవంగా భావించవచ్చు.ఆ కోవకు చెందినదే  మా పాఠశాల తొమ్మిదోతరగతి  విద్యార్థిని నాయిని దీప్తి.
    నీర్మాల గ్రామంలోని నాయిని రాంరెడ్డి, రాణి ల ద్వితీయ సంతానమైన దీప్తికి తన తండ్రంటే పంచ ప్రాణాలు.మొన్నామధ్యన తన తండ్రి కాలు నొప్పితో బాధపడుతుంటే కూతురిగా తను ఎంత తల్లడిల్లిపోయిందో,పాఠశాల పరిసరాలలో తనను దగ్గరగా చూసినప్పుడు నేను బాగా గమనించాను.
    ఇద్దరు కూతుళ్ళే అన్న భావన తన తండ్రికి ఎప్పుడూ కలుగనీయకుండా,ప్రతి పనిలోనూ చేదోడువాడుగా ఉంటుంది. అన్ని రకాల వ్యవసాయం పనులు చేయడమే కాదు,కొడుకు లేడనే లోటు వారికి రానీయకుండా బయటి పనులన్నీ చేసుకువస్తుంది.మొన్నటి లాక్ డౌన్ సమయంలోనైతే,కాలు నొప్పితో బాధపడుతున్న తండ్రిని కూర్చోబెట్టి మరీ తన అక్క దివ్య తో కలిసి వ్యవసాయ మంతా చేసుకు వచ్చింది.డబ్బుల లెక్కలన్నీ తనే చూసుకుంటుందట.ప్రతి రోజూ పాలు పిండి,పాల కేంద్రం లో పోసి వస్తుందట.తండ్రే తనకు పెద్ద హీరో అని చెప్పే ఈ అమ్మాయి చదువులోనూ ముందంజలోనే ఉన్నది.గత సంవత్సరం జాతీయ మెరిట్ పరీక్షలో ఉత్తీర్ణురాలయి మెరిట్ స్కాలర్ షిప్ కూడా అందుకుంటున్నది.తండ్రి నడిపే పెద్దబండిని అవలీలగా నడుపగలదు.అంతేనా చక్కగా బొమ్మలు గీయగలదు.ఇక్కడ తెలుగు కృత్యము(హోమ్ వర్క్) రాసి,దానిని నెమలి బొమ్మతో ఎంత అందంగా తీర్చిదిద్దిందో చూడండి.ఇవే కాదు డాన్స్ కూడా బాగా చేయగలదు.
        ఇన్ని ప్రత్యేకతలున్న మా విద్యార్థిని దీప్తిని ఆభినందించడం,మీ అందరి ఆశీస్సులు తనకు అందేలా చేయడం నా కర్తవ్యమే కదా.
    అభినందనలు దీప్తి.నీ ఉత్సాహం, తల్లిదండ్రుల పట్ల నీకున్న మమకారం,పలు విధ ప్రతిభను కలిగిన నీ నైపుణ్యం, మరింత వెలుగొంది,సమాజానికి ఉపయోగపడే ఉన్నత వ్యక్తిగా ఎదగాలని ఆశిస్తున్నాను.