సామెత కథలు ==ఎం బిందుమాధవి

 నిదానమే ప్రధానం"

అది ఒక పేరొందిన ప్రభుత్వ బ్యాంక్ కి జిల్లాకేంద్రంలో ఉన్న శాఖ.
జిల్లా కేంద్రం కాబట్టి చుట్టు పక్కల ఉన్న పల్లెటూళ్ళ నించి అనేక మంది....చదువురాని వారు, రైతులు, చేతి వృత్తుల వారు... వారి వారి ఊళ్ళనించి ఉదయం వచ్చి బ్యాంక్ పని చూసుకుని సాయంత్రం వెళ్ళే బస్ లో వెళ్ళే వారు.
ఆ రోజు బస్ మిస్ అయితే వారి పని ఆగిపోయినట్లే. అందువల్ల వచ్చినప్పుడే కాలాతీతమైనా పని అయిపోవాలనే పట్టుదలతో ఉంటారు.
మహిత ఆ బ్రాంచ్ లో అధికారిగా ఉద్యోగం చేస్తున్నది.
********
ఒక శని వారం సిబ్బంది అంతా గబ గబా పని ముగించుకుని బస్ వచ్చే వేళకి వెళ్ళిపోయే హడావుడిలో ఉన్నారు. పక్కన ఏమిజరుగుతున్నదో చూసే ఖాళీ కూడా లేదు.
అప్పుడు ఏటీఎంలు, ఆన్లైన్ బ్యాంకింగులు లేవు. అన్ని రకాల ఆర్ధిక అవసరాలకి బ్యాంకులకి రావలసిందే!
అన్ని శని వారాలు సగం పూట పని చేసే విధానమే ఉండేది.
******
కౌంటర్ లో ఉన్నట్టుండి, పెద్ద గొడవ, అరుపులు వినపడి మహిత ప్యూన్ ని పంపించి విషయం కనుక్కురమ్మన్నది.
అఖిలేష్ కస్టమర్ మీద పెద్దగా అరుస్తున్నాడు. ఆ ఖాతా దారుడు కూడా కౌంటర్ మీదనించి చెయ్యి లోపలికి పెట్టి అఖిలేష్ చేతిలో కాయితం లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడు.
అప్పటికి బిజినెస్ అవర్స్ అయిపోయాయి. ఒక్కొక్కరే బయటికెళ్ళిపోయి బయటి బెంచ్ కూడా ఖాళీ అయింది.
ఇంకా అదే ఉద్వేగంతో ఉన్న అఖిలేష్ ....మహిత ముందుకొచ్చి 'మాకో చేతకాని అధికారిఉన్నారు. అందుకే మాతప్పు లేకపోయినా బయటివాళ్ళు మమ్మల్ని నోటికొచ్చినట్లు మాట్లాడి వెళ్ళగలుగుతున్నారు ' అంటూ అక్కసు వెళ్ళగక్కాడు.
మహిత చిరునవ్వుతో అఖిలేష్ ని కూర్చోమని చెప్పి ప్యూన్ ని మంచినీళ్ళిమ్మని, ఓ కూల్ డ్రింక్ ఆర్డర్ ఇచ్చింది.
తను ఇంత భంగ పడి ఆవేశంతో అరుస్తుంటే, మహిత నవ్వుతూ మాట్లాడటం జీర్ణించుకోలేకపోయాడు, అఖిలేష్.
మహిత అతని చేత కూల్ డ్రింక్ బలవంతంగా తాగించి, స్థిమితపడ్డాక..పక్క సీట్ కుమార్ ని పిల్చి గొడవేమిటి అని అడిగింది. 'నాకు తెలియదు మేడం, నేను బిజీగా ఉన్నాను ' అన్నాడు. క్యాషియర్ ని పిల్చి అడిగింది. నాకు తెలియదన్నాడు. అలాగే ఇంకో ఇద్దరు ముగ్గురిని పిల్చి అడిగితే, ఎవ్వరు మాకు తెలియదు...అఖిలేష్ అరవటమే విన్నాము అని సమాధానం చెప్పారు.
అప్పుడు మహిత అఖిలేష్ తో బుజ్జగింపుగా.... బ్యాంక్ అంటే,ఎంత సర్వీస్ చేసినా, బయట ఎవ్వరికీ సానుభూతి ఉండదు. పైగా కేంద్ర ప్రభుత్వం మొదలుకుని స్థానిక ప్రభుత్వాల వరకు అందరూ బ్యాంకులు పాటించాల్సిన "కష్టమర్ సర్వీస్" నిబంధనల గురించి, అవి పాటించని సిబ్బందిని ఎలా శిక్షించాలో కాలానుగుణంగా (periodical) పంపించవలసిన రిపోర్టుల గురించి మాట్లాడతాయి కానీ, క్షేత్ర స్థాయి నిజానిజాలతో వారికి పని లేదు.
ఉదాహరణకి ...ఇప్పుడు ఆ ఖాతాదారుడు నీ మీద రిపోర్ట్ వ్రాసి, పక్క కష్టమర్ చేత సాక్షి సంతకం చేయించి పంపిస్తే...నీ మీద అనవసరపు ఎంక్వైరీలు, డిసిప్లినరీ ప్రొసీడింగ్స్... నీ తప్పు లేకుండా నీ సర్వీస్ లో బ్లాక్ మార్క్ వచ్చేది. ఇది జరగకుండా ఉండాలనే నేను బయటికి రాలేదు.
బ్యాంకులు సర్వీస్ సెక్టర్ లో ఉన్నాయి. ఎదుటివాడిది తప్పయినా మనం తలొంచుకు పోవాలి. చూశావు కదా, నీ తోటి ఉద్యోగులే నీ తరఫున మాట్లాడలేదు. నిన్ను కమ్ముకురావటానికి మేమందరం బయటికివస్తే ఇంకా ఎక్కువ గొడవయ్యేది.
ఒక్కోసారి, ఖాతాదారులు గొడవపెట్టుకోవటానికే వస్తారు. బ్యాంక్ లో సేవలు పొందటంలో ఎవడి అసంతృప్తి వాడిది. అది న్యాయమైనది కాకపోవచ్చు. కానీ ఒకడు రెచ్చిపోయి మాట్లాడితే, బయట నలుగురు వాడిని సమర్ధిస్తారు.
మనం కొన్ని విషయాల్లో రూల్ మాట్లాడక తప్పదు. అది వారికి నచ్చదు. డబ్బుతో వ్యవహారం కాబట్టి, "కంచె మీద బట్ట లాగా చిరగకుండా తియ్యాలి" కాబట్టి బ్యాంక్ సర్వీస్ లో చేరినప్పుడే మన ఉద్వేగాలని నియంత్రించుకోవటం నేర్చుకోవాలి.
నీ తప్పు లేదని నాకు తెలుసు. మంచి వర్కర్ వి. ప్రమోషన్లు వచ్చి పై స్థాయికి రావలసిన వాడివి. అనవసరపు గొడవల్లో ఇరుక్కోవద్దు. అని మహిత చెప్పిన మాటలకి అఖిలేష్ ఆలోచనలో పడ్డాడు.
'అందుకే "నిదానం ప్రధానం అన్నారు". ఇంత గొడవ జరుగుతున్నా, మేడం ని నువ్వు అంత పరుషంగా మాట్లాడినా కొంచెం కూడా నొచ్చుకోకుండా, నీ భవిష్యత్తు ఆలోచించి అంత ప్రశాంతంగా మాట్లాడారు ' అని క్యాషియర్ అశోక్, అఖిలేష్ తో 'రా అన్నా టీ తాగొద్దాం అని భుజం మీద చెయ్యేసి బయటికి తీసుకెళ్ళాడు.