మా ఇంటి నందనవనం: -వసుధారాణి.

 ఇవాళ మనసు మళ్ళీ అమ్మమీదకు, ఇవాళ ఏమిటి పుట్టినాక ఊహ వచ్చినప్పటి నుంచి అమ్మ ఒక అద్భుతం నాకు. గంభీరంగా కనపడేది కానీ చాలా చిన్న చిన్న సరదాలు ఉన్న మనిషి.
మాకు ఉన్న పెరట్లో రకరకాల పూల మొక్కలు పెంచేది.చిట్టి చామంతులు, నాలుగైదు రంగుల కనకాంబరాలు ,గులాబీలు,మరువం, దవనం,జాజి,మూడు రకాల విరజాజులు,బొండు మల్లెలు,సన్నని నాటు మల్లెలు ఎంత గుబాళింపో,లిల్లీ లు,ఇంటి ముందు ఉన్న పెద్ద వాకిలిని పొడవాటి మాచర్ల  నాపరాళ్లు వరసగా బాటలా పరిచి వాటి పక్కన పూలదారిలా అటు ఇటు బంతి చెట్లు రంగురంగుల గుత్తులతో మిగిలిన స్థలంలో రెండు వైపులా పూల మొక్కలు .మా వాకిలి ఓ నందన వనంలా ఉండేది.
నాకు పూలు తలలో పెట్టుకునే  సరదా లేదు కానీ అమ్మ  సున్నితంగా  పూవుని పట్టుకుని మరువం దవనం కలిపి అల్లే కదంబ మాలని ఆమె మీద గౌరవంతో పెట్టించుకొనే దాన్ని.నాకు పెళ్లి అయ్యేవరకూ మా అమ్మే జడలు వేసేది.నాకే కాదు అక్కయ్యలందరికీ ఎంత ఓపిక ,ఎంత సరదా. పెళ్లి అయ్యాక నా పెద్ద జుట్టు చూసి మా అత్తగారు కూడా సరదా పడి నాకు జడ వేస్తుండే వారు.కొన్నాళ్ళకి ఎలాగో నేర్చుకున్నా.ఇప్పటికీ సరిగ్గా రాదను కోండి.
మా వాకిలి అనగానే గుర్తుకువచ్చేది గుబురుగా  గుండ్రంగా అందంగా ఉండే దబ్బచెట్టు పూల మొక్కల మధ్య నీడని ఇచ్చే చెట్టు .ఆ చెట్టుపళ్ళతో దాదాపు అందరమూ పదహారు ఫలాలు నోము తీర్చుకున్నాము. చెట్టునీడలో నులక మంచాలు వేసుకుని అక్కచెల్లెళ్లమ్ ఎన్ని కబుర్లు చెప్పుకున్నామో..ఇంట్లో ఎవరి స్నేహితులు వచ్చినా ముచ్చట్లు ఆ చెట్టుకిందకి చేరేవి.అందుకే నేమో కన్నెపిల్లల గుస గుస ఊసులు విన్న ఆ చెట్టు అదో వయ్యారంతో అందంగా  మిల మిలలాడే ఆకులతో  నవ యవ్వనవతిలా ఉండేది.కొత్తగా పెళ్లయిన జంట ఇంట్లో ఎవరు ఉంటే వాళ్ళ ఏకాంత ప్రకృతి ఆరాధన కూడా అక్కడే మధ్య మధ్యలో కొత్తల్లుడికి పలహారాలు ,కాఫీలు వెళుతుండేవి. అలా మా దబ్బచెట్టు అందరి మధుర జ్ఞాపకాల నిక్షేపనిధి.
మా అమ్మ అత్యంత శ్రద్దగా పెంచిన చెట్టు ఇంకోటి ఉంది అది పుల్లదానిమ్మ .వేవిళ్లు వచ్చిన ఇంట్లోని ప్రతి ఆడపిల్ల అబ్బురంగా నునుసిగ్గుతో ఆ పుల్లదానిమ్మని ఇష్టంగా తిన్న వాళ్ళమే. కాయలు కొంచెం పెద్దవి కాగానే మా అమ్మ కొన్ని కాయలకి గుడ్డముక్కలు కట్టేది చిలుకలు కొట్టకుండా ,కొన్నిటిని వాటికి వదిలేసేది .నేనయితే మొత్తం వదిలేసి ఉందును. మా అమ్మకి రామచిలకల్లాంటి కూతుళ్లు వున్నారు కదా అందుకు మాకూ కొన్ని పంచేది అనుకుంటా చిలుకలతో పాటు.
పండకముందు దోరగా పుల్లగా ఉండే పుల్లదానిమ్మ కాయతో చేసిన కారం ఎంత రుచో చెప్పనలవికాదు.ఇప్పుడు పళ్ళు పులుపు పట్టవు కానీ నేనూ ,మా పద్మక్కా పుల్లదానిమ్మ గింజల్ని,దబ్బతొనల్ని ఉప్పుకారం కలుపుని నంచుకుని తినేవాళ్ళం. దానిమ్మ పండుగా మారినాక అమ్మ ఆ గింజల్ని వలిచి రసం పిండి వడకట్టి చెక్కర కలిపి పాకం పట్టి దానిమ్మరసాయనం చేసేది.మేము పెళ్లిళ్లయి వెళ్లిపోయినా,దానిమ్మ సీజన్ మిస్ అయినా అమ్మ మాకు ఆ రుచికరమైన రసాయనం దాచి ఉంచేది.
ఇంక మాఇంటికి ఒక వైపుగా బావి ,దానిపక్క దాదాపు 20×20 పెద్ద ఓపెన్ టాప్ బాత్రూమ్ ఉండేది .బాత్రూమ్ లోపల సగ భాగం బండలు పరిచి, సగం నల్లమట్టి నేల వదిలేసి ఉండేది.మొత్తం బాత్రూమ్ పైన కప్పు అంతా వెదురు బద్దల పందిరి చిక్కుడు,కాకర ,దొండ తీగలు అల్లించి అల్లిబిల్లిగా అల్లుకున్న ఆకుల మధ్య నుంచి ఆకాశం .
బావి ,బాత్రూమ్ తరవాత బోలెడు చోటు ఆ స్థలం మొత్తం కూరలకే, వంకాయలు,బెండకాయలు,గోరుచిక్కుడు, గుమ్మడి,సొర ,ఆకుకూరలు,అన్నీ పండించేది .ఆవిడ చేతులో ఏముండేదో మొక్క నాటితే చాలు పుష్పించి,ఫలించేది. అందరం మొక్కలకి బావిలో నీళ్లు తోడి పోసేవాళ్ళం.  ప్రతి సాయంత్రం అదొక అందమైన పని.ఒకళ్ళు తోడితే ఒకళ్ళకి ఒకళ్ళు బిందెలు అందుకుని వన కన్యల్లా పూల చెట్లకి చెయ్యి అడ్డుపెట్టి సుతారంగా నీటిని చిలుకుతూ ఉండే వాళ్ళం.
అలా పిల్లల్ని,తోటని అందంగా ,ఆహ్లాదంగా ,ఆనందంగా పెంచుకుంది మా అమ్మ. లోకాన్ని పుస్తకాల్లో చదివేసింది.రేడియోలో ఆమె సినిమా పాటలు వినేది కాదు కానీ లలిత సంగీతం ,నేషనల్ ప్రోగ్రాంలో రాత్రి 10 గంటలకి వచ్చే శాస్త్రీయ సంగీతం వినేది.ఆవిడ పేరు రాధ అవ్వటం వల్లనేమో వేణునాదం ఇష్టపడేది.
నా చిన్నతనంలో ఆవిడ గంభీరంగా అనిపించి నాకు కొంచెం చేరిక తక్కువగా ఉన్నా పెద్దతనం వచ్చాక .బోలెడు సరదా కబుర్లు చెప్పేది ఆవిడ చిన్నప్పటి కబుర్లు.ఇసుకలో అక్షరాలు దిద్దుకున్న ఆవిడ బడి కబుర్ల నుంచి.విజయవాడలో సత్యనారాయణపురంకి ఆవిడ కాపురానికి వెళ్లిన కబుర్లు,మా పెద్ద అక్క దగ్గరి నుంచి నాదాకా మా అందరి  చిన్నప్పటి విషయాలు అన్ని తమాషా హాస్యం నింపి చెప్పేది.మొత్తం మీద తెలియని వయసులో ఆమెని బాగా ఏడిపించిన,కొంచెం పెరిగి పెద్దయ్యాక ఆమెకి బాగా సంతోషం ఇచ్చిన కూతుర్ని నేనే.అందుకే అమ్మ అంటే కొంచెం బాధ,బోలెడు ప్రేమ నాకు.