పుస్తకమనేది....!!:-- యామిజాల జగదీశ్

 ఓ తమిళకవి రాసిన పుస్తకం శీర్షిక. అయిదేళ్ళ క్రితం వేలువడింది. పుస్తకపఠనం అలవాటులేని వారు ఈ పుస్తకం వంక ఒక్కమారు దృష్టిసారిస్తే పూర్తిగా చదివేంతవరకూ పుస్తకాన్ని కిందకు దించరనిపించే చిన్న చిన్న కవితలు వందకుపైనే ఉన్నాయి. ఇందులోని కవితలు ఒట్టి కవితలు కావు. ఒక్కొక్కటీ ఒక్కో ముత్యం. ఎన్నో అంశాలపై ఎన్నో రకాల కవితల పుస్తకాలుండొచ్చు. కానీ ఈ పుస్తకం 
పూర్తిగా పుస్తకాలకు సంబంధించినదే కొవడం విశేషం. కవిత అనేది ఎప్పుడూ వచ్చేది కాదు. ఎప్పుడో అప్పుడు వచ్చేదన్నారొకరు.
ఇది కవితలతో అల్లిన పుస్తకం. ఓ కవిత విజయం సాధించడమంటే రాసినంత మాత్రాన సరిపోదు. చదివేవారినీ అది కట్టిపడెయ్యాలి. భాగస్వామిని చేయాలి. ఈ పుస్తకంలో అటువంటి కవితలు చాలానే ఉన్నాయి.
ఈ పుస్తకంలోని తొలి కవిత....
పది పక్షులతో 
మెలగినంత మాత్రాన
మీరు 
ఓ పక్షి అయిపోరు!
పది నదులతో 
మెలగినంత మాత్రాన 
మీరు 
ఓ నది అయిపోరు!
పది పుస్తకాలతో
మెలగి చూడండి
మీరు పదకొండో పుస్తకమవుతారు
మిమ్మల్ని చదివింపచేస్తారు!
- అనే కవిత ఈ పుస్తకానికొక కిరీటం.
ఈ పుస్తకంలో నించే మరొక కవిత....
పుస్తకం చదివిన వారందరూ
జ్ఞానవంతులైపోరు
కానీ
జ్ఞానవంతులందరూ
పుస్తకం చదివినవారే
అనే తేలిక మాటలతో పుస్తకాన్నంతా నడిపించడం ఎంతో నచ్చింది నాకు.
ఈ కవితా సంపుటి ఈ ఒక్క పుస్తకానికే కాదు
అన్ని మంచి పుస్తకాలకూ సరిపోయే నిజం. మంచి పుస్తకంతో వెచ్చించే సమయం ఖర్చూ ఖర్చే కావు. అవి మన జీవితానికి పెట్టుబడులవుతాయి. 
ఓ తీపి పదార్థాన్ని తిన్న వ్యక్తి చెప్పినంత మాత్రాన తృప్తి పడకేగా మనమూ తిని చూస్తాం అతని మాట నిజమేనా అని తెలుసుకోవడానికి.
ఈ పుస్తకం చదివిన ఆనందం నేను పొందినట్టు మీరూ పొందాలంటే దీనిని చదవాలి అని చెప్పాలనే ఉంది కానీ ఇది తమిళ పుస్తకం కావడం వల్ల తమిళం తెలిసినవారికే ఈ మాట చెప్పగలను. నేనీ మధ్య చదివిన పుస్తకాలలో ఇదొకటి కావడం నా భాగ్యం.