సామెత కథ : ఎం.. బిందు మాధవి


 పళ్ళున్న చెట్టుకే రాతి దెబ్బలు!


శ్రీరాంకి బంధు ప్రీతి ఎక్కువ. సున్నిత మనస్కుడు. ఎవరికైనా కష్టం వచ్చిందంటే ఏంత స్థాయికెళ్ళి అయినా సహాయం చెయ్యాలనుకునేవాడు. ఇది అవకాశం గా తీసుకుని కొంత మంది బంధువులు అతన్ని మోసం చెయ్యటానికి కూడా వెనకాడే వాళ్ళు కారు. ఇంట్లో భార్య గోల పెట్టేది, ‘సహాయం చెయ్యటం తప్పు కాదు కానీ, కాస్త ముందూ వెనకా చూసుకోవాలి’ అని.

శ్రీరాంకి సంపాదన బాగానే ఉండేది. ఖర్చులు అవి పెద్దగా లేవు. అతను నిర్వర్తించవలసిన కుటుంబ బాధ్యతలు కూడా లేక పోవటం వల్ల "తెప్పలుగ చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు"అన్నట్లు బంధువులు

‘ఇతని దగ్గర డబ్బు బాగానే ఉంది, పెద్ద ఉద్యోగమే కద, ఆ మాత్రం సాయం చెయ్యలేడా’ అని ఏదో ఒక సాకు చెప్పి చిన్న చిన్న మొత్తాలే అయినా అడిగి తీసుకెళ్ళి మళ్ళీ మొహాలు చూపించే వాళ్ళు కాదు. ఒక్కోసారి చేబదుళ్ళు తెచ్చి కూడా సర్దుబాటు చేసే వాడు.

శ్రీరాం చిన్ననాటి స్నేహితుడు ఒకరు వచ్చి ‘నేను ఒక చిట్ ఫండ్ కంపెనీ లో భాగస్వామ్యం తీసుకున్నాను, కొంత మంది మెంబర్లని చేరుస్తానని మాట ఇచ్చాను, నువ్వు కూడా అందులో పెట్టుబడి పెట్టమని’ బలవంత పెట్టి పెద్ద మొత్తమే పెట్టుబడి పెట్టించాడు. ఫ్రెండ్ కనుక కష్ట నష్టాలని అంచనా వేసి నిర్ణయం వాయిదా వేసే అవకాశం లేక పోయింది. ‘కాదంటే ఏమను కుంటాడొ’ అని భార్య కి నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు.

ఇంక మనకి తెలియంది ఏముంది, ఆ ఫ్రెండ్ కావాలని మోసం చేసినా, మార్కెట్ పరిస్థితుల వల్ల నష్ట పోయినా భారీగా శ్రీరాం తన డబ్బు పోగొట్టుకోవలసి వచ్చింది.

శ్రీరాం కి అనుకోకుండా ఉద్యోగం మారవలసిన అవసరం వచ్చింది. అదే సమయంలో, వ్యాపారం మొదలుపెట్టుకోవటానికి కొంత సర్దుబాటు చెయ్యమని దగ్గర బంధువు వచ్చి బుడి బుడి దీర్ఘాలు తియ్యటం మొదలుపెడితే, భార్య దగ్గర డబ్బు ఏమైనా ఉన్నదేమో అడుగుదామని భార్యని పిల్చాడు.

వాళ్ళముందు ఏమి చెప్పలేక శ్రీరాం ని లోపలికి పిల్చి, ‘మీకు తెలియదు, ఇతను మొన్నే ఒక ఫ్లాట్ కొన్నాడు. అంత వ్యాపారం చేసుకునే ఉద్దేశ్యం ఉంటే నిన్న కాక మొన్న ఫ్లాట్ ఎవరైనా కొనుక్కుంటారా, మిమ్మల్ని చూస్తే అందరికి అన్నీ గుర్తొస్తాయి’ అని మూతి తిప్పింది.

శ్రీరాం ‘పోనీలేవే, “పళ్ళు ఉన్న చెట్టుకే రాతి దెబ్బలు”, అసలు కాపే లేని చెట్టు దగ్గరకి ఎవ్వరూ రారు’ అంటు తేలికగా నవ్వేశాడు.


కామెంట్‌లు