దొంగతనం స్వేచ్ఛ కాదు (కథ)---- ఎం. వి. ఉమాదేవి నెల్లూరు

 పాఠశాలనుండి వచ్చిన బాలు స్నానంచేసి తల్లిఇచ్చిన చిరుతిండి తిని,వరండాలో చాప వేసుకొని కూర్చొని పుస్తకాలు సంచీనుండి తీసి ఇంటిపని రాసుకుంటూ ఉన్నాడు.తాతయ్య వచ్చి వాలుకుర్చీలో కూర్చుని స్వామి వివేకానంద పుస్తకం చదువుకుంటూ ఉన్నాడు.
  "తాతయ్యా, స్వేచ్ఛ అంటే ఏమిటీ? " అడిగాడు బాలు. 
"మనం ఏదైనా పనిని మన ఇష్ట ప్రకారం చేయడాన్ని స్వేచ్చ అంటారు బాలూ !"చెప్పాడు తాతయ్య.
"అయితే,ఆ పని మంచిదయి ఉండాలి. మనకో,ఇతరులకో మేలు చేసేదయి ఉండాలి!" మళ్ళీ చెప్పాడు తాతయ్య. 
    "బడిలో నాపక్కన కూర్చునే రాజుగాడు నన్ను అడగకుండానే నాసంచీలో రంగుపెన్సిల్ ఆరంజిది తీసేసి వాడుకుంటున్నాడు.టీచర్ కమలాపండు బొమ్మవేయండి అంటే సంచీలో చూస్తే పెన్సిల్ లేదు. వాడేమో త్వరగా బొమ్మ వేసేసానని టీచర్కి చూపించి గొప్పగా.. ఫోజులుకొట్టేడు.! నా పెన్సిల్ అడిగితే అప్పుడు ఇచ్చాడు.ఎందుకు తీసావు అంటే "నాకు స్వేచ్ఛ ఉంది"అన్నాడు తాతయ్యా !"
బాలు చెప్పేది ఆశ్చర్యంగా విన్నాడు తాతయ్య. 
   "రేపు రాజుని తీసుకొనిరా !నేను మాట్లాడుతాను. స్వేచ్ఛ అనేది ఒకరికి ఏమాత్రం కీడు చేయకూడదు.కేవలం మన పనికోసం ఇతరులకి ఇబ్బంది కలిగించడం స్వేచ్ఛ కాదు.అది కూడా నిన్ను అడగకుండా తీసి దాచుకొని వాడుకోవడం చాలా తప్పు.దానివల్ల నీకు బొమ్మ వేయడం ఆలస్యం అయిందిగా? ఇటువంటివి ధైర్యంగా బడిలోనే టీచర్ తో చెప్పాలి.ఈ సారి అలా చేస్తే నేను వచ్చిమాట్లాడుతాను. "
అన్నాడు తాతయ్య. 
  మనసులో కలత తొలిగిన  బాలు గట్టిగా ఊపిరి పీల్చుకొని దృఢంగా అనుకున్నాడు. 
"దొంగతనం స్వేచ్ఛ కాదు !"