ఈ పత్రిక 1913 నాటికి తొమ్మిదేళ్ళు పూర్తి చేసుకుంది.ఆ ఏడాది సెప్టెంబరులో వినాయక మూషిక వాహనం గురించి మొదటి పేజీలో ఇచ్చిన సంచికను ఇటీవల చూసే అదృష్టం కలిగింది.ఇక రెండవ పేజీలో "ఆంధ్ర దేశంలో స్త్రీ విద్య " అనే వ్యాసం చదువుతుంటే అనేక ముఖ్యాంశాలు తెలిసొచ్చాయి.1875కు పూర్వమే చదువుకున్న స్త్రీలు అనేకమంది ఉన్నట్లు వీరేశలింగం పంతులుగారు చెప్పినట్లు ఈ వ్యాసంలో పేర్కొన్నారు.నాటి స్త్రీలు చదువుకోవటమే కాకుండా పత్రికలకు మంచి మంచి వ్యాసాలు రాసేవారట.వీరేశలింగంగారు తమ మహిమను ప్రదర్శించటానికి ముందే పోతం జానక్మమ అనే విదుషీమణి 1874 లో రాసిన వ్యాసం శ్రీ మదాంధ్ర భాషా సంజీవినిలో అచ్చయిందట.ఆ వ్యాసంలోని శైలి ఎంతో గొప్పగా ఉండేదట.ఆమె తన భర్తతో ఇంగ్లండు వెళ్ళి వచ్చిన తర్వాత ఈ వ్యాసం రాసారట.ఆంధ్ర భాషా సంజీవిని పత్రికను నాటి స్త్రీలెందరో చదువుతుండేవారట.అప్పట్లో స్త్రీలకోసమే ప్రత్యేకించి కొన్ని గ్రంథాలు వెలువడ్డాయి.873లో బాలికా హిత బోధిని అనే వచన కావ్యం, స్త్రీ నీతి సంగ్రహమనే పద్యకావ్యం అచ్చయ్యాయట.ఇలాంటి ఎన్నో విషయాలిచ్చిన ఈ వ్యాసంతో ఇప్పటి కంటే అప్పుడే స్త్రీ విద్య సారవంతంగా ఉండేదని తెలుస్తోంది.పైగా వీరేశలింగంగారు ఓ చోట తమ స్త్రీలకు పరీక్ష అక్కరలేదని, వేంకటసుబ్బమ్మ గారు పరీక్ష ఇచ్చినా ఇవ్వవచ్చునని తప్పించుకునే ధోరణి బాట పట్టారని ఈ వ్యాసం చెప్తోంది.1873కు పూర్వమే ఆంధ్రదేశంలో స్త్రీ విద్య వ్యాపించి ఉన్నట్లు బాలికా పాఠశాలల వల్ల తెలుస్తోంది. ఆ సమయంలోనే విజయనగరం మహారాజుగారూ, పిఠాపుర రాజుగారు వేల కొలది ధనాన్ని ఖర్చుపెట్టి ఆంధ్రదేశంలో బాలికా పాఠశాలలు స్థాపించారట. అప్పటికింకా వీరేశలింగంగారు బయటకు రాలేదు.ఇక రెండవ వ్యాసం "కూతురు పెండ్లి కూతురగుట".కాకినాడలో జరిగిన హిందూ మత మహాసభలో కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రులవారు చేసిన ఉపన్యాసాన్ని మతసభల ఆవశ్యకత అనే శీర్షికతో ఇచ్చారు.మానువుడు మతప్రధానుడై ఉన్నాడన్న విషయాన్ని నాగరికులందరూ అంగీకరించిన విషయమేనని కాశీభట్టగారు తమ ఉపన్యాసంలో పేర్కొన్నారు.మొత్తంమీద ఈ పత్రిక ఆసక్తికరంగానే అనిపించింది చదువుతుంటే. ఈ పత్రిక ఎప్పుడు ఎలా ప్రారంభమైనదీ ఎంత కాలం వచ్చిందీ వివరాలకోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
ఆర్యమత బోధిని: -- యామిజాల జగదీశ్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి