మాతృభాష సేతువు మాతృభాష ధాతువు
మాతృభాష లేకుంటేమూగ చూపు చూతువు!
అమ్మ పలుకులే కృతి అమ్మ పాటలే శ్రుతి
అమ్మ భాష లేకుంటే అమ్మ సంతతే మృతి!
తేనె వంటి పిలుపులు తెగువ పెంచు తలపులు
అంగడిలో దొరకవులే అమ్మ పలుకు మహిమలు!
మనసు పలుకు బాసలు పనసతొనల ఊసులు
తెనుగు పలుకు పెదవులు అజంతాల తళుకులు!
వీరోచిత తనువులు విజయోత్సవ ధనువులు
తెలుగువారి సంస్కృతి తెలుపు గొప్ప జాగృతి!
కాకతీయ పౌరుషం ఖండాంతర ప్రయాణం
కృష్ణరాయ పాలనం కృతులు స్మృతుల వాచకం
కవిత్రయం తెనిగించిన ఆంధ్రమహా భారతం!
పోతనకవి విరచితమౌఆంధ్రమహా భాగవతం!
అన్నమయ్య కీర్తన కూచిపూడి నర్తన
ద్విపద కావ్య సోయగం జానపదుల జీవనం
కావ్యహేల కార్యాశాల ఆంధ్రభాష జ్వాల!
సహస్రాబ్ధిచరితగల్గి ప్రకాశించె తెలుగు నేల!
కాపాడుట కర్తవ్యం తెలుగు చరిత సువర్ణం!
భాష అంతరించిందా సంస్కృతియే వివర్ణం!
-------------------------------------------
-కృష్ణతేజం సాహితీ సమూహం వారి పోటీలో
*ప్రధమ బహుమతి పొందిన కవిత*
మాతృభాష సేతువు:---కిలపర్తి దాలినాయుడు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి