పుష్పాలే దైవం (సీస పద్యాలు):--మమత ఐల-హైదరాబాద్-9247593432
సీ.స
దేవతార్చన జేయ పూవొక భాగమ్ము
        యెచటనైనాగాని యిచట ముఖ్య
పుష్పాలె దైవమై పులకించు నట్లుగా
         బతుకమ్మలను పేర్చు పర్వ మిదియె
ప్రత్యేక మైనిట్టి పర్వాలు తొమ్మిది
           నవరాత్రులుత్సవంబవనిలోన
ఆటపాటలతోడ నతివలంతాగూడి
          గౌరిని కొలిచేరు ఘనము గాను
ఆ.వె
పల్లెపల్లెగాక పట్నాన సైతము
తీరుచుండె కొలువు గౌరి దేవి
యమెరికాన గూడ నందాల బతుకమ్మ
మనసు పెట్టి వినుము మమత మాట

సీ.స
వనములో పెరిగేడి గునుగు పూవును తెచ్చి
           రంగులనద్దేరు రమ్యముగను
తంగేడు పువ్వుతో బంగారు బతుకమ్మ
           గుమ్మడి పూలతో సొమ్ము లలరి
పట్టుకుచ్చులు

పెట్టి చుట్టూత పేర్చేరు
            కట్లపూ గోరింట కలువపూలు
చేమంతి బంతులు చేర్చిపేర్చి మెరుపు
            దారాలు కట్టేరు ధగధగలతొ
ఆ.వె
గౌరి గాను నిలుప ఘనమైన గుమ్మడి
పూల లోని దుద్దు పొందు కూర్చి
పసుపు కుంకుమిచ్చి వందనం చేసేరు
మనసు పెట్టి వినుము మమత మాట