కోడి పుంజు:---సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,ధర్మపురి.మొబైల్: 9908554535.


  రామయ్య  ఉదయాన్నే లేచి చంకలో కోడిపుంజును పెట్టుకొని ప్రక్క ఊరిలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడ వాళ్ళ ఇంట్లోని కోడి పుంజును చూసిన రామయ్య వారితో " మీ కోడి పుంజు తెల్లవారి కూస్తుందా"? అని ప్రశ్నించాడు. వారు ఔనని జవాబిచ్చారు." మా కోడిపుంజుకు తెల్లవారినది  తెలియదు. రాత్రి అయినది తెలియదు. అందుకే  దీన్ని నేను అమ్ముదామనుకున్నాను. మీ గ్రామంలో దీనిని అమ్మిపెట్టండి "అని అన్నాడు .

          అప్పుడు రామయ్య బంధువు ఒకాయన" మా కోడిపుంజు ప్రొద్దస్తమానం ' కొక్కొరొకో' అని అరుస్తూనే ఉంటుంది. మాకు దీనివల్ల నిద్రా భంగమే  తప్ప కొంచెం కూడా ఉపయోగం లేదు .అందువల్ల నిశ్శబ్దంగా ఉన్న మీకోడి పుంజును మాకు ఇవ్వండి . దాని బదులు మా కోడిపుంజును మీరు తీసుకోండి "అని అన్నాడు. అందుకు రామయ్య సరేనన్నాడు.

          అది విన్న కోడిపుంజు "మేము ప్రొద్దున అరచినా కష్టమే . అరవకున్నా కష్టమే. ఈ మానవులందరూ అవసరం మనుషులు. వారికి అవసరం ఉంటే ఉంచుకుంటారు. లేకపోతే అమ్ముతారు .ఛీ .ఇటువంటి వారి దగ్గర ఉండటం కన్నా అడవిలో ఉండటం నయం" అంటూ సమయం చూసి తప్పించుకొని వెళ్ళిపోయింది.