ఏడు అంకెను మిగతా అంకెలు ఏడిపిస్తూ ఉన్నాయి.
"అపశకునపు పక్షి" అని చీదరించుకుంటూ
ఉన్నాయి.
చులకనగా చూస్తూ ఉన్నాయి.
తిడుతూ వెక్కిరిస్తున్నాయి.
అవమానిస్తూ ఉన్నాయి.
వీటి ఆగడాలను ఏడు భరించలేకపోయింది.
జీవితంపై విసుగు చెంది చనిపోవాలి అనుకుంది.
తోటి అంకెలను వదిలేసి ఏటి వద్దకు వచ్చింది.
అందులో దూకింది.
ఏటిలో ఈదుతున్న ఏనుగు ఇదంతా చూసింది.
కాపాడాలి అనుకుని ఒడ్డుకు వచ్చింది.
తొండంతో ఏడును బయటకు లాగింది.
చావటానికి కారణం అడిగి తెలుసుకుంది.
ఏడు జాలి కథకు ఏనుగు కరిగి పోయింది.
బ్రతుకు మీద ఆశ కల్పించాలి అనుకుని ఇలా అన్నది “పిచ్చిదానా! ఎవరో ఏదో అన్నారని చావటమేనా? నీవు ఏమిటో, నీ గొప్ప ఏమిటో నీకు
తెలుసా? చెబుతాను విను...” అని ఇలా చెప్పింది.
"వెంకటేశ్వరస్వామి వెలిసింది ఏడుకొండల మీద.
వారంలోని ఏడవ రోజైన శనివారం ప్రార్ధనలు
అంటేనే ఆయనకు ఇష్టం.
సృష్టి నిర్మాణం ఏడు రోజులలో జరిగింది అని బైబిల్ లో రాసి ఉంది.
రోమనులకు ఏడు పవిత్ర అంకె.
రోము నగరాన్ని ఏడు కొండల మీదనే నిర్మించారు.
అందుకే దాన్ని ఏడు కొండల నగరం అంటారు.
ఇంద్ర ధనుస్సులో రంగులు ఏడు.
సంగీతంలో స్వరాలు ఏడు.
సూర్యుని రధానికి గుర్రాలు ఏడు.
సిలువపై యేసు పలికిన మాటలు ఏడు.
రామాయణం కావ్యంలో ఏడు కాండాలు ఉన్నాయి.
జానపద కథల్లో ఏడు సముద్రాలు ఉన్నాయి.
వారానికి రోజులు ఏడు.
ఇలాచెప్పుకుంటూ పోతే నీలో ఇంకా ఎన్నో గొప్పలు దాగి ఉన్నాయి.
వెళ్లు... వెళ్లి... నీవేంటో నిరూపించుకో.
నీ సత్తా ఏమిటో చూపించు” అన్నది ఏనుగు.
ఇంతలో ఏడును వెదుకుతూ మిగిలిన అంకెలు వచ్చాయి.
ఏడు లేకపోయేసరికి గణితశాస్త్రం గజిబిజి అయిన సంగతి చెప్పాయి.
ఏడు గొప్పతనం ఒప్పుకున్నాయి.
ఇంకెప్పుడూ ఏడును ఏడిపించము అని ఒట్టు పెట్టుకున్నాయి.
ఏనుగుకు కృతజ్ఞతలు తెలిపాయి.
నీతి : కలసి ఉంటే కలదు సుఖం, నిర్ణయాలలో నిదానమే ప్రధానము.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి