అవసరం (నాకిష్టమైన మాట). : - వసుధా రాణి

 కొంతమంది స్నేహితులు బాల్యం నుంచి మనతో వుంటారు పెద్దయ్యేదాకా  కూడా . అలా నాకు గల  స్నేహితులలో  సునీత ఒకటి . పి.రామమూర్తి  రసాయనశాస్త్ర ఉపాధ్యాయులు వాళ్ళ నాన్నగారు.తల్లిదండ్రులకు ఒక్కతే పిల్ల సునీత .అదీ చాలా ఆలస్యంగా పుట్టింది. ఇంక వాళ్ళ అమ్మగారికి ఎంత జాగర్త అంటే మొత్తం బడిలో పిల్లలకంతా సునీత ఓ వింతలా ఉండేది.
  ఒకటో తరగతి నుంచి మేమంతా సిద్ధార్థ విద్యాలయంలో  చదువుకునే వాళ్ళం.ఆ బడి  SSN కాలేజీకి అనుబంధ సంస్థ కనుక మామూలు పిల్లలతో పాటు ఆ కాలేజీ ఉపాధ్యాయుల పిల్లలు కూడా ఎక్కువగానే ఉండేవారు బడిలో.
  ఇప్పుడంటే పిల్లల్ని అతిగా చూసుకునే సూపర్ మామ్స్ కానీ.మా చిన్నప్పుడు అలా కాదు .పొద్దున్నే చద్దన్నం తిని బడికి వెళ్ళేవాళ్ళం.బళ్ళో మా చదువేంటో, మా ఆటలేంటో మావి .ఇంటికి పోయి ఏదో ఒక చిరుతిండి తినేసి మళ్లీ చీకటి పడేదాకా ఆటలు. మా హోంవర్క్ మేమే చేసేసుకుని,అన్నాలు తిని అమ్మమ్మ చెప్పే కథలో,పాడే కీర్తనలో వింటూ నిద్రపోవడం.మా యూనిట్ పరీక్ష లెప్పుడో,మా క్వార్టర్లీ ,ఆఫ్యర్లీ ఎప్పుడో ఇంట్లో వాళ్ళకి ఏమీ పట్టేది కాదు.మాకు మేమే చదువుకోవడం ,నోట్సులో, పెన్సిళ్ళో కావాలంటే అడగటం అంతే.
  దాదాపు అందరు పిల్లల నేపధ్యం అదే ఆ కాలంలో  కానీ మా పి.సునీత అలా కాదు అందుకే మా పిల్లలందరికీ ఆ పిల్ల వింతగా ఉండేది.
  మగపిల్లలు ఐతే చొక్కా,లూజుగా వుండే లాగూ ,నీలంవో, తెల్లవో స్లిప్పర్లూ,తెల్ల గోతంతో సంచీ కానీ,హిండాలియం బాక్స్ కానీ పుస్తకాలకి. ఆడపిల్లలం అయితే స్కర్ట్ ,జాకెట్టు ,రెండు జడలు,కుచ్చు రిబ్బన్లు,స్పిప్పర్లు ,పుస్తకాల సంచులు లేదా బాక్స్ లు ఇదే అలంకారం.
  మా పి.సునీత మాత్రం ఫ్రాక్ వేసుకునేది.రెండు జడలు వేసుకునేది రిబ్బన్లు మేము కట్టుకునే లాంటివి కాక ఇంకొంచెం వెడల్పుగా వుండే బాబీ రిబ్బన్లు కట్టుకునేది .మోకాళ్లదాకా మేజోళ్లు తొడుక్కుని,కట్ బూట్స్ వేసుకునేది. చేతిలో  చేతిరుమాలు,అందరి సంచుల్లాంటి పుస్తకాల సంచీ కాకుండా కలర్ ఫుల్గా వుండే సంచీ ,ఓ ప్లాస్టిక్ వెడల్పాటి బుట్టలో మంచినీళ్ల సీసా, స్నాక్స్ కోసం బొమ్మలు బొమ్మలుండే డబ్బా.సంచీనీ ,బుట్టనీ పనిమనిషి పట్టుకుని వెంట రాగా బడికి వచ్చేది.
  పనమ్మాయి సంచీ,బుట్టా లోపల పెట్టి క్లాసు బయట చెట్టుకింద కూర్చుని ఉండేది ఇంటర్వెల్  వరకూ. సునీత  డబ్బాలో స్నాక్స్ తినేసి ,మంచినీళ్లు తాగినాక బుట్ట తీసుకుని ఆ అమ్మాయి వెళ్లిపోయేది.మళ్లీ లంచ్ బ్రేక్ సమయానికి ముందు వచ్చి చెట్టుకింద నిలుచునేది.
 ఆ అమ్మాయి వచ్చిన అయిదు నిమిషాలకి బెల్లు కొడతారు కనుక మేము ఆ అమ్మాయి కోసం ఎదురు చూస్తుండే వాళ్ళం.మళ్లీ సంచి మోసుకుని మధ్యాన్నం ,సాయంత్రం ఇంటికీ రోజూ ఇదీ సునీత ప్రహసనం.
  మేమేమో హాయిగా ఇంటర్వెల్ లో  బడి దగ్గర రేగుపళ్ళు,జామకాయలు,చిలకడదుంపలు,జీడీలు,గొట్టాలు,ఉసిరికాయలు ఇలా ఒకటేమిటి సీజనల్ తిండ్లు అన్నీ కొనుక్కు తినే వాళ్ళం.రకరకాల ఫ్లేవర్లలో పాల ఐసులతో సహా.
  క్లాసులో ఎవరితో మాట్లాడేది కాదు.చదువుకోవడం బాగా చదువుకునేది.ఆ పిల్లతో  ఏ పిల్లలైనా ఒకవేళ మాట్లాడాలని చూసినా పనిమనిషి వారించేది బయట వున్నప్పుడు.అందుకని ఇంక క్లాసులో ఎవ్వరూ మాట్లాడేవారు కాదు.నన్ను చూసి మాత్రం స్నేహ భావంతో నవ్వుతుండేది. మనకు గల సవాలక్షా వ్యవహారాల్లో ఆ పిల్లని పట్టించుకునే తీరిక లేకుండా గడుపుతుండేదాన్ని.
 చాలా కేర్ గా చూసుకునే వారు కనుక తుమ్మినా , దగ్గినా వాళ్ల  అమ్మగారు ఊరూ వాడా ఏకం చేసి కంగారు పెట్టేసేవాళ్ళు పాపం ఆ కూతురిని. జలుబు చేస్తే డాక్టర్ దగ్గరికి పోతున్నాం అని సెలవు చీటీ రాసి బడి మానేసేది.టీచర్ ఏదయినా అడిగితే కంగారు పడుతూ లేచి సమాధానం చెప్పేలోపు చేతిలో కర్చీఫ్ నాలుగు సార్లు కింద పడేసేది.మాట్లాడటానికి ముందు మొదటి అక్షరం మూడు సార్లు పలికేది పిల్లలు అందరూ నవ్వేవాళ్ళు. చాలా భయం భయంగా , నెమ్మదిగా ఉండేది.
 ఒకసారి క్లాసులో ఏదో పద్యం చెపుతూ ఉండగా ఒక పదాన్ని పదే పదే తప్పు పలుకుతూ ఉంటే టీచర్ గట్టిగా చెప్పే సరికి ఇంటికి వెళ్లి వాళ్ళ  అమ్మని పిలుచుకు వచ్చింది.
 అప్పుడు నేను వాళ్ళ అమ్మగారితో మాటలు కలిపి నేను చూసుకుంటాలే అని అభయ హస్తం ఇచ్చేసి.ఆ రోజునుండి ఏడవ తరగతి అయ్యేవరకూ సునీతకు గల ఏకైక ఫ్రెండు గా వున్నా కొన్నేళ్ళు.
  ఆ పిల్ల ధోరణిలో యే మార్పు లేకుండా అలాగే ఉండేది.నాతో మాత్రం కొంచెం మాట్లాడేది.ఎనిమిదో తరగతి నుంచి బడులు మారి హైస్కూల్లో చేరినప్పుడు.మేము మున్సిపల్ గర్ల్స్ స్కూల్,సునీత హర్డ్ హైస్కూల్ లోనూ చేరిపోయాం.మనం ఊరి మీద చాంద్రాయణం తిరిగేటప్పుడు కనపడితే పలకరించేది. అదే బెరుకు,భయం నేను చూసినంత వరకూ కూడా.
  కొన్ని ఏళ్ళకి మా బ్యాచ్లో నాకు అందరి కన్నా ముందు పెళ్లి అయిపోవడం , నేను మంచి  గృహిణిగా అతి బుద్ధిగా నా పాత్రలోకి  ఒదిగి పోవటం జరిగాక.మా అత్తగారి బంధువుల ఇంటికి నెల్లూరు వెళ్ళాము . పక్కన ఇంట్లో మీ  నరసరావుపేట వాళ్లే వున్నారు అంటూ చెప్పి ,పక్కింట్లోని సునీతని పిలుచుకు వచ్చింది మా బంధువుల ఆవిడ. రాణీ అంటూ వచ్చి నన్ను కౌగిలించుకుని రా మా ఇంటికి అంటూ చెయ్యి పట్టుకుని వదలకుండా వాళ్ళింట్లోకి తీసుకు వెళ్ళింది.
  ఆరోజు నేను చూసిన సునీత నన్ను ఇప్పటకీ ప్రభావితం చేస్తూనే ఉంది. పెద్దతనం వచ్చేసిన తల్లిదండ్రులను అన్నీ తానే అయిచూసుకుంటూ,రోడ్లో నడవటానికి కంగారుగా వంకరటింకరగా నడిచే అమ్మాయి స్కూటీ నడుపుతూ బజారు పనులన్నీ చేసేసుకుంటూ,PG చదువుకుంటూ,ఫైనాన్స్ మానేజ్ చేస్తూ ఒకటేమిటి కుటుంబం లోని సకల పనులూ తనే చూసుకుంటూ ఉన్నానని చెప్పింది. 
 నేను ఆశ్చర్యంతో ఎలా సునీతా ఇలా మారిపోయావు అంటే .ఒక్క మాట చెప్పింది అవసరం అన్నీ నేర్పిస్తుంది రాణీ అని.పైగా నువ్వే నా ఇస్పిరేషన్ అని కూడా అంది.
  పెళ్లి చేసుకుని హాయిగా ఇంకొకరి మీద ఆధార పడటానికి అలవాటు పడిన నేను ఒక్క సారిగా ఉలిక్కి పడ్డాను సునీత మాటతో.నిజమే నా చిన్నప్పటి పరిస్థితుల వల్ల ఆ రోజుల్లో నేను అలా వున్నాను.తన పరిస్థితుల వల్ల ఈ రోజు సునీత ఇలా మారింది. ఐతే నేను కొత్తగా చేసుకున్న  ఆధారపడే అలవాటును మానుకోవాలని ఆ రోజు కొత్తగా మారిన సునీత వల్ల తెలుసుకున్నాను.
  తర్వాత తను చదువు ముగించుకుని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిందని .వల్ల అమ్మానాన్నని కూడా అక్కడికి తీసుకెళ్ళి చక్కగా చూసుకుందని మా బంధువుల ద్వారా విని చాలా ఆనంద పడ్డాను.భయంతో ,బెరుకుతో వుండే సునీత, బాధ్యతగా, తెలివిగా,ధైర్యంగా ఉన్న సునీత ఇలా రెండు విభిన్నమైన  రూపాల్లో నాకు గుర్తుండి పోయింది.
కామెంట్‌లు