మూర్ఖపు నెమలి (బుజ్జిపిల్లలకు బుజ్జికథ): ౼ దార్ల బుజ్జిబాబు

        ఒక నెమలి ఉండేది. 
       దానికి దైవభక్తి ఎక్కువ.
       ప్రతిదానికి దేవుని మీదనే ఆధారపడేది. 
       "నారు పోసినవాడు నీరు పోయక పోతాడా?" అనుకునేది. 
       ఏ పని చేసేది కాదు. 
       సోమరిలా తిరిగేది. 
       పనీ పాటా లేకపోయేసరికి దానికి వింత
రోగం వచ్చింది. 
       ఈ సంగతి పొరుగూరులో ఉన్న తల్లికి తెలిసింది. 
       వచ్చి ఇలా అన్నది. “నాయనా! వెంటనే వైద్యుని కలువు, సలహాలు పాటించు" అన్నది. 
       నెమలి నవ్వింది. "పిచ్చి అమ్మా! దేవుడు అప్పుడప్పుడు పరీక్షలు పెడతాడు. ఇవన్నీ ఆయన
లీలలు, మనమంతా నిమిత్తమాత్రులం. వైద్యులు దైవాలు కాదు. డబ్బులు గుంజే యంత్రాలు, పట్టి
పీడించే దయ్యాలు. ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది" అన్నది నెమలి. 
       కొన్నాళ్లు గడిచాయి.
       నెమలి బాగా క్షీణించింది.
       తల్లికి కంటి మీద కునుకు లేదు. 
       కంటికి రెప్పలా చూసుకుంటూ సేవలు చేస్తుంది. 
       ఒకరోజు ఇలా అన్నది. 
       “నాయనా! ఇప్పటికయినా మించింది లేదు. వైద్య పరీక్షలు చేయించుకో, మంత్రగానితో
అంత్రం వేయించుకో. ఆకు పసరల మందు తాగు, బ్రతుకుతావు” అన్నది.
        “అమ్మా! అంతా నీ భ్రమ. మంత్రాలకు  చింతకాయలు రాలతాయా? తాయత్తులో మహత్తు అంతా ఒక గమ్మత్తయిన మాయ. మందులతో మరణాన్ని ఆపలేము. పరమాత్ముని అనుమతి లేనిదే చీమ అయినా చావదు" అన్నది నెమలి. 
       కొన్ని రోజులకు నెమలి చనిపోయింది. 
దేవుని దగ్గరకు చేరింది. 
        "నమ్మినందుకు నన్నే మోసం చేశావు. ఎందుకు బ్రతికించలేదు?" అని అడిగింది దేవుడిని.
       దేవుడు నవ్వాడు. “మూర్కాపు భక్తుడా! నిన్ను
బ్రతికించటానికి అనుక్షణం నీ సమక్షంలోనే ఉన్నాను.  రెండుసార్లు ప్రయత్నించాను కూడా. నీవే మొండిగా ప్రవర్తించావు. 'గాలిలో దీపం పెట్టి దేవునిదే భారం' అంటే ఎలా?  నీ ప్రయత్నం నీవు చేయవా?  దైవం అంటే ఎవరోకాదు. అమ్మే. అంతటా నేను ఉండటం సాధ్యం కాకనే  భూమి మీద అమ్మను సృష్టించాను" అన్నాడు దేవుడు.
       నీతి : మొండిగా ఉంటే మీకే నష్టం.