మా అమ్మ చెప్పింది ...ముగ్గురమ్మల ప్రతిమలమ్మంగ పొట్టనిండేనని.
మా నాన్న అన్నాడు.. ఈ అమ్మ బొమ్మలే నే ఆడు బొమ్మలని.
నా మనసు నమ్మింది ..ఈ అమ్మకు, నా గోడు తెలుసని.
అణువణువునా నిండున్నది దైవమే అని , తెలియని ఈ జనం..
నే అమ్మే ప్రతిమలలో ,సర్వం ప్రతిష్టింప బడినదని.. పూజిస్తారు అనుదినం...
వారి నమ్మకమే నా అమ్మకాలకు ఇంధనం.
అనుదినం ఆ తల్లి ప్రతిమలకు, ధూళి చేరకుండా చూడటమే.. నా కందిన వరం.
కోవెలలో పూజారి వలె ..నే ఎరుగను మంత్రాలు..
ఈ ఇలలో, నే ఎరుగను జనులెరిగిన విద్యలు.
నాలాంటి ఎందరో పసిపిల్లలు... రేపవలు, రహదారులపై వెలిగేటి ప్రమిదలు.
నా ఈడు పిల్లలెందరో , పుస్తకాలకే పరిమితమైన బానిసలు.
ఈ లోకాన ప్రతి ఒక్కరూ.. ఏదో వంక లేనిదే జన్మించరు..
రూపం దాల్చిన ప్రతి ఒక్కరూ.. చిత్రవిచిత్ర వేషాలకు ప్రాణం పోస్తారు.
ఆ చందాన, రంగురంగుల బొమ్మల మధ్య అమ్మోరికి బొట్టువలె నే నిలిచా..
అంతకన్నా భాగ్యం , మరొకటి లేదని తెలుసా!!
ఈ విధంగా క్లుప్తంగా నా కధ మీకు తెలిపా.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి