డబ్బుకే నమస్కారం! మర్యాదా!:-- యామిజాల జగదీశ్

 అనగనగా ఓ ఊరు. ఆ ఊరి పేరు జగ్గాపురం. ఆ జగ్గాపురంలో సత్యన్న అని ఒకడున్నాడు. అతనికి పెళ్ళయింది. భార్యపేరు కోమల. సత్యన్న పేదవాడు. అతనిని ఎవరూ పట్టించుకునేవారు కాదు. అతను దగ్గరకొచ్చి పలకరించలనుకున్నా ఛీ ఛీ నీ నీడ కూడా మామీద పడకూడదు పోపో అని చీదరించుకునేవారు. 
కాలం గడుస్తోంది. 
ఉన్నట్లుండి అతనికి ఊహకందనంత డబ్బు వచ్చింది. ధనవంతుడయ్యాడు. అతనికి ఎలా అంత డబ్బు వచ్చిందో చెవులు కొరుక్కుంటున్న వారొకవైపు ఉన్నా అతనికి ఎదురెళ్ళి నమస్కారమని‌, బాగున్నారాని పలకరించేవారు. తెగ మర్యాద ఇవ్వడం మొదలుపెట్టారు. కానీ అతను మాత్రం ఎవరు నమస్కారం చెప్పినా, బాగున్నారా అని అడిగితే "ఇంటికి వెళ్ళి చెప్తానండి" అని జవాబిచ్చేవాడు తప్ప ప్రతినమస్కారం చేసేవాడు కాదు. 
అందరికీ అతని మాట విచిత్రంగా అనిపించింది. 
బయటివారికేకాక ఇంట్లో భార్యకూ విచిత్రంగా ఉండేది అతని వైఖరి. 
ఎందుకంటే ఇంటికి రావడుతోనే కాళ్ళు కడుక్కుని పూజగదిలోకి వెళ్ళి దేవుడికి  నమస్కారం పెట్టడానికి బదులు పడగ్గదిలో ఉన్న ఓ పెట్టె తెరచి అందులో ఉన్న డబ్బుని చూసి ఏదో గొణిగేవాడు. 
భర్త వాలకం భార్యకు అర్థం కాలేదు. 
రోజూ అతనట్లానే చేయడంతో ఓరోజు ఆమె అడిగేసింది....
"మీ గురించి ఊళ్ళో వాళ్ళందరూ ఏంటేంటో  అనుకుంటున్నారండి. మీకు డబ్బొచ్చేసరికి తలపొగరొచ్చింది. మీరు.తలతిక్కగా జవాబులిస్తున్నారు అని అంటున్నారండి. వారికేమిటండీ నాకూ మీ వైఖరి బోధపడటం లేదండి" అంది ఆమె.
అప్పుడతను "అవును నా ప్రవర్తన వింతగానూ పిచ్చితనంగానూ అన్పించడం సహజమే. కానీ ఏం చేయను. నేను పేదవాడిగా ఉన్నప్పుడు నన్ను చూడటానికో నాతో మాట్లాడటానికో నేను నమస్కారం పెట్టినా అసహ్యించుకునేవారు. నన్నసలు మనిషిగా కూడా చూడలేదు. కానీ నాకు డబ్బొచ్చి ధనవంతుడయ్యేసరికి అందరూ నాకు మర్యాద ఇస్తున్నారు. అంటే ఏమిటీ? వాళ్ళు నా డబ్బుని చూస్తున్నారు తప్ప నన్ను నన్నుగా చూడటం లేదు. అందుకే నాకెవరైనా నమస్కారం పెడుతున్నా బాగున్నారా అని అడిగితే ఇంటికెళ్ళి చెప్తాను అని అంటున్నాను. అందుకే ఇంటికొచ్చీరావడంతో డబ్బుతో చెప్తున్నా ఫలానా వాళ్ళందరూ నీకు నమస్కారం పెట్టారు. నువ్వు బాగున్నావా అని అడుగుతున్నారని అడిగిన వాళ్ళందరి పేర్లూ ఆ డబ్బుకి వినిపిస్తున్నాను. అంతకన్నా మరేమీ లేదు. నీకు విషయం అర్థమైందిగా? ఇప్పుడు చెప్పు, నా ప్రవర్తన పిచ్చో కాదో..." అన్నాడు. 
ఆమెకు అంతా అర్థమై "అవునండీ ! మీరు చెప్పిందాంట్లో ఏ తప్పూ లేదు" అని చెప్పింది.