బాలగేయం :- సత్యవాణి

 బాటసారి  ఒక్కనాడు
బాటలోన సాగుచుండె
ఎండవేడి తాళలేక
విశ్రమించె మర్రిక్రింద
చెట్టుపైకి చూచెనతడు
చిన్న పళ్ళు కనిపించెను
కంపపైన గుమ్మడితీగ
కాయలేమొ అతిపెద్దవి
బాటసారి తలపోసెను
బుధ్ధిహీనుడని దేవుడు
ఇంత పెద్ద వృక్షానికి 
ఇంతలేసి చిన్నపండ్లా
బలహీనపు తీగకేమొ
బాజాఅంత కాయలా
చిత్రగాడు ఆదేవుడు
చేయునెన్నొ చిలిపిపనులు
అనుకొనుచు ఆబాపడు
ఆదమరచి నిద్రించెను
నిద్రలేచి చూచుసరికి
నెత్తిమీద పడ్లుండెను
వంటినిండ రాలిపడెను
వటవృక్షపు పడ్లెన్నో
విస్తుపోయె బాటసారి
వివేకాన యోచించెను
పాదుకుండు కాయగనుక
వటవృక్షముకున్నయెడల
పడినట్లయితే అదినాపై
పగిలియుండె నాశిరస్సు
దేవుడెంతో తెలివిపరుడు
దీర్ఘంగా యోచించును
ఎవరికేమి ఇవ్వాలో
అంతయు అతడికి ఎరుకే 
అడగవలసిననవసరమే
అసలింతయు మనకులేదు
మనసారా తలచినంత
మనక్షేమము అతడె జూచు
భారము దేవునిపై వేసి
భగవంతుని స్మరించుడి