జమ్మిపూల సౌరభాలు:- వాడ్రేవు వీర లక్ష్మీదేవి

 బడిని ఊరి ఉమ్మడి సిరిగా మార్చగల సరితా టీచర్ లాంటి సమ్మెట ఉమాదేవి అంటే.. మా 'ఉమ' చూడ్డానికి బాసర సరస్వతి దేవిలా ఉంటారు. భావించడానికి కూడా ఉమా సరస్వతే.. ఇప్పటికి రెండు కథల సంకలనాలు  అందించిన ఉమ రేలపూల నుంచి జమ్మిపూల దాకా నడిచారు. ఉమకు పువ్వులూ, పిల్లలూ సమానంగా ఇష్టం. ఆమె తన కంప్యూటర్ నిండా వందల రకాల వేలవేల పువ్వులు పోగుచేసి  దాచిపెట్టారు. ఆమె గుండెనిండా..గుండె పట్టనంతమంది పిల్లలు ఉన్నారు. వారంతా ఎన్నో ఏళ్లుగా ఆమె దగ్గర చదువుకున్న చదువుకుంటున్న విద్యార్థినీ విద్యార్థులు. అందుకే ఆమె బాసర సరస్వతిని తలపిస్తారు.
           తత్వవేత్తలు వ్యక్తిత్వ నిర్మాణ నిపుణులు కూడా వర్ధమానంలో జీవించడం గురించి చెప్తుంటారు. ఇది స్థల కాలాల రెండింటికీ చెందుతుంది. మనం ఎక్కడ నివాసిస్తున్నామో ఎక్కడ జీవితానికి అవసరమయిన ఆర్థిక వనరులు పొందుతున్నామో అదే మన నేల. అక్కడే మన అస్తిత్వాన్ని వెతుక్కోవాలి.  అస్తిత్వ మూలాలు ఎక్కడో ఉండవచ్చు. కానీ వాటికోసం వెనక్కి ప్రయాణించి అక్కడే ఉండి పోనవసరం లేదు. ఉమాదేవి జమ్మిపూలు సంకలనం కథలన్నీ చదివినప్పుడు నాకు పై ఆలోచనలు పదే పదే కలిగాయి. ఆమె ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలిగా ఊళ్ళూ మారుతూ వచ్చారు. అవి తెలంగాణ ప్రాంతపు మారుమూల పల్లెలు. ఇంకా చెప్పాలంటే గిరిజన గ్రామాలు, తండాలు. సాధారణంగా చాలా మంది అలాంటి చోటుకి వెళ్లకుండా ఏర్పాటు చేసుకోగలుగుతారు. కొందరు చేసుకోలేరు. కొందరు ఐచ్చికంగా వెళతారు. అలా వెళ్లి ఆ గిరిజన పల్లెల్లో మమేకమయిన ఉపాధ్యాయులను కొద్దిమందినే అయినా సరే నేను అలాంటి వారిని చూసాను. వారిని దైవసమానులుగా భావిస్తాను. గిరిజన గ్రామాలనుంచి వచ్చిన మేము అటువంటి వారి వల్లనే ఇంతదాకా ప్రయాణించగలిగాము.. అందువల్ల  వారు నిరంతర స్మరనీయులు. అటువంటి ఉపాధ్యాయిని  ఉమాదేవి. ఆమె చుట్టూ ఉన్న కథలే ఇవి. 
            ఇందులో ఉన్న పదహారు కథల్లో పన్నెండు కథలు కేవలం గిరిజన తండాల్లోని గ్రామీణ ప్రాంతాల్లోని  జీవితాల కథలు. నిత్యము వారితో కలిసిమెలిసి వారి కష్ట సుఖాలల్లో భాగమై, వారి మనసులోని  మర్మములు ఎరిగిన కథలివి. ఇందులోని ప్రతీ కథ ఒక్కొక్క ఆడకూతురి మనసులోని ఆవేదనను గానీ, ఒక పిల్లవాడు లేదా పిల్లదాని గుండెలలో దాగిన బాధ వెనుక వున్న నిజమయిన జీవితాలగురించి చెప్పిన కథలు.  ప్రతీ కథా మాములు కథల వెనుక ఉన్న అసలు కథను చెప్తుంది. ఆ అసలు కథను పట్టుకోగలడగంలోనే ఉమాదేవి ప్రత్యేక వ్యక్తిగా తనదయిన గమనింపును మన ముందుకు తెచ్చారు.
          మారు గ్రామాలలో ఇంటింటికీ పాకీ దొడ్లు ఉండవు. ప్రభుత్వం కేవలం దీని కోసం ప్రచారం చేస్తూ సబ్సీడీలు ఇస్తుంది. ముఖ్యంగా ఆడవాళ్లకి అది  ప్రాణాంతకమయిన కష్టం. దీని చుట్టూ కథ రాయదల్చుకున్న వాళ్ళకి  అంతవరకే  ఉంటుంది వస్తువు. స్త్రీలవైపు నుంచి ఈ కథ చెప్పేటప్పుడు దీని వెనుక వారి జీవితాలలో మరెన్ని సమస్యలున్నాయో. వాటిముందు స్వంత పాకీదొడ్డి లేకపోవడమన్నది ఎంత రెండవ స్థానపు అంశమై పోతుందో మైసమ్మత్త కథ చదివి ఆశ్చర్య పోతాం. వరమ్మ చెంబట్కీ పేరు చెప్పి బహిర్భూమికి వెళ్ళి ఊర్లోనే ఉన్న తల్లిని అక్కడ  కలుస్తుంది. వదిన కూడా ఆ పనిమీదే వచ్చి మరదలిని కూతురిని కలుస్తుంది. వాళ్ళు కలుసుకోవడానికి అదొక్కటే వీలు. లేకుంటే అత్త వాళ్ళని కలవనివ్వదు. అదో కష్టం. అందుకని వరాలు ఇలా అంటుంది. “ఇట్లా చెంబట్కీ అని చెప్పి వచ్చి  దినాం ఈడ మిమ్ముల గలుస్తున్న. గా బాత్రూములు గిట్ల గట్టిపిస్తే నా బతుకు నిజంగా జైళ్ల వడ్డట్టే.” ఇంకో ఇంటికోడలు సీతక్క ఇలా అంటుంది. “నీకు దెలియందేముంది వరమ్మా.. మా అత్త చెంబట్కీ పోయిందంటే ఆమె ఎంటబోయినోళ్ళకు మొగని మీద కోడళ్ల మీద చెప్పుకుంట రెండుగంటలగ్గానీ రాదు. మా ఇంటాయన నేను గప్పుడే జర మంచిగా ఏమన్న మాట్లాడుకునేది. లేకుంటే ఆయన నాతోని మంచిగుంటే ఓర్వది లేదీ తల్లి " ఇవీ వారి కష్టాలు.
          "ఈమె, కథ వెనుక ఉన్న కథ చెప్తుంది అంటే ఇదీ చెప్పడం".. అయితే ఇంటివెనుక బాత్రూమ్ కట్టకుండా చేసే ప్రగతి నిరోధకత ఇందులో రానివ్వలేదు ఉమ. ఈ గొడవలన్నింటినీ తన కథలో సద్దు మణిగించుకుంటుంది. 
           ఈ మధ్య ప్రజారచయిత్రుల వేదిక సాంస్కృతిక సవాళ్ల సెమినార్ పెట్టి, "స్త్రీల రచనలలో ప్రతిఫలించిన సాంస్కృతిక వత్తిడుల" గురించి చెప్పమంది నన్ను. వెంటనే ఇందులో ‘బొడ్రాయి’ కథ గుర్తుకు వచ్చింది. అయిదారాళ్లేకోసారి పల్లెటూర్లల్లో ఊరికి  అరిష్టం కలుగకుండా గ్రామదేవత బొడ్రాయిని ప్రతిష్ఠిస్తూంటారు. ఈ బొడ్రాయి చుట్టూ ఉన్న నమ్మకాలు, ఆచారాలు అన్నీ ఈ కథలో చిత్రించింది ఉమ. బొడ్రాయి వేసినపుడు ఊరి ఆడపడుచులు ఆ ఊరికి రాలేకపోతే మూడేళ్లు ఆ ఊరికి రాకూడదన్న ఆచారం కోడలిగా వెళ్ళిన యువతుల పాలిట ముళ్ల కంచెలా ఎలా మారుతుందో చెప్పిన కథ ఇది. ఇలా బొడ్రాయి ప్రతిష్టించిన మూడు రోజులు ఊరినుంచి బయటకు, బయటనుండి ఊర్లోకి రాకపోకలు ఉండరాదు. కానీ సమయానికి సొమ్ములు సమకూరక చివరి నిముషంలో పుట్టింటికి బయలుదేరిన ఆడకూతురికి ఈ బొడ్రాయి దారి కట్టడి నియమం ఎంత పెద్ద కష్టం అవుతుందో ఈ కథలో ఉంటుంది. ఇంకొక నియమం ఏమంటే  ఈ సందర్భమప్పుడు వెళ్లలేకుంటే మూడేళ్ళ పాటు పుట్టింటికి (ఆ ఊరికి) పోరాదు. ఇది గిరిజన, గ్రామీణ ప్రాంత నియమం. రచయిత్రి వారితో కలసి తిరగడం వల్ల ఈ ఆచారాల పట్ల అవగాహనా ఉన్నది. కానీ హేతువాద  దృష్టి గల రచయిత్రిగా ఉమ ఈ సాంస్కృతిక వత్తిడిని సవాల్ చేస్తుంది. ఆ చెయ్యడం కూడా అందరం ఒప్పుకోక తప్పని విధంగా ఆ గిరిజనుల చేతే ఉల్లంఘన చేయిస్తుంది. ఇలాంటి కథలు చెప్తూ.. ఆమె బడిలోనే గాక వారి సమాజానికి కూడా ఉపాధ్యాయురాలిగా మారడం కనిపిస్తుంది.  గ్రామదేవత మీద ప్రజాలకున్న నమ్మకాన్ని గౌరవిస్తూనే మఠాధిపతుల డొల్లతనం బయటపెడుతూ మానవతా దృష్టికి విలువనివ్వడం ఈ కథలోని మేలుదనం.   
            తెల్లవారి  వార్తాపత్రిక చూస్తే అప్పుల బాధలు తట్టుకోలేక చనిపోతున్న కుటుంబాల వార్తా కథనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అసలు పత్రికలో వచ్చిన అలాంటి వార్త మరి కొన్ని కుటుంబాలకు మార్గదర్శకం అవుతూఉంటుంది. అంతేగానీ సమాజంగానీ మీడియాగానీ వారిని ధైర్యంగా బతికే మార్గం చూపదు. అది తనపని కాదు అనుకుంటుంది. ఆ ఆశావాహ దృష్టి ప్రజలకు ఇవ్వడం కవి, రచయితల బాధ్యత. కన్నీళ్ల గురించి రాయడం కన్నా కన్నీళ్లు తుడిచే బాధ్యత తీసుకోవడమే రచయితల కర్తవ్యం. అని వారు నమ్మినప్పుడు ఇదిగో ఉమా రాసిన ‘ఖేల్ షురూ’ లాంటి కథలు వస్తాయి.
   ఈ కథలో ఉమా రెండు కోణాలు కలిపారు. అప్పుల పాలై ఆత్మహత్య చేసుకోబోయి విఫలమైన కుటుంబానికి ధైర్యం చెప్పడానికి నగరంనుంచి బంధువు సత్తెక్క వస్తుంది. ఆమె వారిని నగరంలో చెయ్యాలేగానీ కుటుంబానికంతటికీ కూడా  జీవనాధారాలెన్ని  ఉన్నాయో చెప్తుంది. ఆ మాటల్లోనే కొందరు అధిక  ధన సంపదతో  ఎన్ని మిషన్లు కొన్నుకున్నావారికి ప్రతి చిన్నపనికి పనివాళ్ళ అవసరం, కొరత గురించి చెప్పడంలో మార్కెట్ కల్చర్, మధ్యతరగతి కుటుంబాలను వ్యక్తులను ఎంత సోమరులుగా చేస్తుందో చెప్తుంది. వారు డబ్బుకోసం, చదువులు చదవడం కోసం  పరుగులు.. తీరా ఉద్యోగమొచ్చాక మళ్లీ పరుగులు. ఆ పరుగుల మధ్య దిక్కులేని ముసలివాళ్ళు. వీళ్ళందరికీ పనిచేసే మనుష్యులు కావాలి. అంటూ మేన్ పవర్ అవసరాన్ని చెబుతుంది. మనముందు మనకి ఇన్ని అవకాశాలు ఉండగా ఈ ఆత్మ హత్యలు చేసుకోవాల్సిన అవసరమేంటి అంటుంది. విపణీ సంస్కృతి మధ్యతరగతికి లేబర్ కి మధ్య పనిచేసే ఆఫీస్ ల గురించి కూడా సత్తెమ్మకి తెలుసు. సమాజంలోని రెండు దూరదూరంగా ఉన్న ప్రదేశాలను కలిపిన కథ ఇది. ఇది ఖేల్ కథం కాదు ఖేల్ ను షురూ చేసిన కథ. అపార్ట్ మెంట్ కల్చర్, మార్కెట్ కల్చర్ కి ఎలా తలవొగ్గి ఎలా పరుగెడుతుందో సవివరంగా చెప్పిన కథ.
          రెడపంగి  కావేరి  ఇందులో ప్రత్యేకమయిన కథ ఇది. కావేరి అనే బాలిక ఇంటిపేరు ‘రెడపంగి.’  ఈ కథ చదవగానే దమయంతి కూతురు కథ గుర్తుకు వచ్చింది. దాని మీద ఎంతో చర్చ జరిగింది. కథ దమయంతిదని కొందరు, దమయంతి కూతురిది అని కొందరు మాట్లాడారు. అదే కథ మరోకోణంలో ఉమా మరెంతో మానవీయంగా రాసారు. సామాజిక వర్గాలను బట్టి సంస్కారాలేలా ఉంటాయో తులనాత్మకంగా తెలుస్తుంది. దమయంతి కూతురు మిధ్యా గౌరవాలకు విలువలిచ్చే మధ్యతరగతిలో పుట్టింది. కాబట్టి అలాగే ఆలోచిస్తుంది. కానీ కావేరి అవేవి లేని మట్టికి చెందిన బిడ్డ. ఆ మాయ గౌరవాల బాధ లేదు. అందుకే ఆ తల్లి బిడ్డ కోసం వచ్చి వెడుతూ వుంటుంది. బిడ్డ తల్లి బాధను సంతోషాన్ని కూడా అర్ధం చేసుకోగలుగుతుంది. గుండె ద్రవించి కళ్ళ వెంట నీరు కార్చగల మానవీయ కథ కావేరి కథ. బహుశా కావేరి ఉమాదేవి ఎదురుగా తరగతి గదిలో బల్ల మీద కూర్చునే బిడ్డే కావొచ్చు. 
       ఇక మిగిలిన కథలల్లో అభివృద్ధి పధంలోకి వస్తున్నాయని మనం భావిస్తున్న యువత వున్నారు. అక్కడి పిల్లలకు చదువులో ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇస్తోంది. కానీ బతుకులు వెళ్లదీసే ఆర్ధిక స్తోమత లేదు. బీటెక్ చదువుకుంటున్న పిల్లలు సైతం మిగిలిన అవసరాలకోసం ఏవేవో పనులకు పోతారు. కానీ ఆ పనుల్లో భద్రత లేదు. కళ్ళముందే ప్రాణాలు కోల్పోతుంటారు. అయినా వేరే దారి లేదు. ఇవ్వన్నీ చాలా కొద్ది మందికే తెలిసిన విషయాలను ఉమా ఇందులో పొందు పరిచారు. 
       వాస్తవంగా గిరి పుత్రులు నిర్మల హృదయులు. అభివృద్ది పేరుతో వారు నాగారీకులకవడం అంటే ఎంతో కాలుష్యం బారిన పడడమే. వారని అక్కడే ఉంచి వారికి కావాల్సిన అభివృద్ధి ఏర్పాటు చేయడమే నిజమయిన కర్తవ్యం అని విజ్ఞులు అంటారు ఇది పెద్ద చర్చనీయాంశం 
            అస్సామీ రచయిత దీరేంద్ర భట్టాచార్య తన జనవాహిని అనే నవలలో ఈ అంశాన్ని చర్చిస్తాడు. 
ఆదివాసీలు చదువుకుని నగరాలకి వచ్చి ఆధునిక సాంకేతికత, నాగారీకతను అలవరుచుకున్నప్పుడు తరతరాలుగా వస్తున్న వారి ఆచారాలకు నమ్మకాలకు విలువనిచ్చేలాగా వారిని ఉంచాలి. అవి కాపాడబడాలి ప్రభుత్వం సమాజము ఆ సంగతి మర్చిపోయింది అంటాడు. ఉమాదేవి దశ్మీ కథలో దశ్మీ ద్వారా ఈ విషయమే చెప్పించారు. 
           నిత్యమూ రైలూ బస్ పట్టుకుని బడికి, ఇంటికీ తిరిగే ఉమలో నిరంతరమూ రచయిత్రి మేలుకునే ఉంటుంది. ఆమె తన ప్రయాణంలో గమనించి గుర్తుపట్టిన మానవీయ కోణాలను కథల్లోకి తేవడంలో ఎంత అప్రమత్తంగా ఉంటారో ఈ కథలు చెబుతాయి.   
         ఊరుమ్మడి సిరి కథ చదివి కథలోని సరిత టీచర్ అమలు చేస్తున్న విద్యా విధానానికి పులకించి పోయాను. మాంటిస్సొరి పద్దతికి ధీటయిన ఓ మారుమూల గ్రామావసరాలకు అనువయిన విద్యాపాలనా విధానాన్ని రూపొందించుకుని తన పాఠశాలలో ప్రవేశపెట్టి అమలు చేసుకోవడమన్నది చాలా గొప్ప సంగతి.  
 వేంకటేశ మాడ్గుల్ గర్ తన జనగరవాడి అనే మరాటీ నవలలోని ఉపాధ్యాయునిలాంటి ఉపాధ్యాయిని ఈమె అనిపించింది. ఆ కథ చదివితే. అందులో ఉపాద్యాయునికి రచయిత పేరు పెట్టడు. అందరూ పంతులూ అనే పిలుస్తారు. ఊరివారికి అతడు దేవుడు. అందుకే ఉమని నేను బాసరమ్మ  అన్నది.
           ఇవి తెలంగాణా కథలు తెలంగాణ ప్రాంతపు కథలు. తెలంగాణా తెలుగు మాండలికాలు, యాసా నోటినిండా పలికిన కథలు. అక్కడి తండావాసుల వ్యవహార పదాలు, యాసలు కథల్లో సంభాషణలనిండా ఉన్నాయి. కానీ రచయిత్రి కథ మాత్రం తనదయిన వ్యవహార శైలిలోనే చెప్పారు. ఇది అభినందనీయం. కథంతా ఏ మాండలికంలో నడచినా మరో ప్రాంతపు వారికి చదవడానికి కష్టమే.  అయిన ఆసక్తి ఉన్నవారు  కష్టపడతారు. కానీ మనం ఎవరి గురించి చెబుతున్నామో వారి సమస్యలు అందరి దృష్టికి తీసుకు వెళ్ళాలంటే ఇది మధ్యే మార్గం. ఇది ఆదర్శవంతమయిన ఆచరనీయమయిన మార్గమని నాకు అనిపించింది. 
           గిరిజనుల జీవితాలలలోకి వెళ్లి దగ్గరగా చూసి కథలు రాసినవారు చాలా తక్కువ. ఆ ప్రాంతాలలో ఉద్యోగరిత్యా ఉండడాన్ని అవకాశంగా భావిస్తూ వారితో కలిసిపోయి ఆ జీవితాలను మిగిలిన సమాజాలకు ఇలా ఉమాదేవిలా చెప్పినవారు అరుదు. కానీ ఆమె తన రేలపూలు  పుస్తకంలోని ముందు మాటలో రాసుకున్న మాటలు మళ్ళీ ఇక్కడ గుర్తు చెయ్యాలని ఉంది 
            నీవు ఎవరి గురించి రాస్తున్నవో వారు ఈ కథలు చదవరు అన్నవారున్నారు.  వాళ్ళు ఇవి చదవక పోవచ్చు. కానీ ఈ సమాజంలో సాటి పౌరులుగా వున్నవారి గురించి తెలుసుకోవాల్సిన, పట్టించుకోవాల్సిన అవసరం బాద్యత మనందరి పైనా ఉన్నదని నేను నమ్ముతున్నాను. అలాగని నేను తండావాసుల రాజకీయ సామాజిక జీవనాల్లో అకస్మాత్తుగా వచ్చిన పెను మార్పుల గురించో, రాజకీయ జీవనాల గురించో నేను రాయలేదు. అందుకే వాటిని అగ్నిపూలనో మోదుగాపూలనో కాకుండా రేలపూలని పేరు పెట్టుకున్నాను ఈ రేలపూలు అడవికే అంకితమైపోతున్నాయి. జనం వాటిని పెంచి పోషించి కాపాడుకోవాలని నా తాపత్రయం .. ఇదీ ఆమె తపనా తాపత్రయమూనూ జనం మధ్య పరస్పర స్నేహాన్ని అందించడానికి సంకేతంగా ఉండే ఉమా జమ్మిపూలతో మన ముందుకు వస్తున్నారు. గిరిజనులతోనూ బడుగు గ్రామీణులతో స్నేహహస్తం కలపమని కోరుతున్న.. ఆమె ఆశయాలను సఫలం చేద్దాము. 
                                                  వాడ్రేవు వీరలక్ష్మీదేవి   
ప్రతులకు..  రచయిత్రికి చిరునామలను పంపి..  ఫోన్ పే , గూగుల్ పే ద్వారా పొందవచ్చును –
 సమ్మెట ఉమాదేవి - 9849406722
కామెంట్‌లు