ఏంట్రా ఈ వేషం?:-- యామిజాల జగదీశ్
 కుమార్తె పెళ్ళిలో ఓ తండ్రి ఆకారం ఇలాగేనా ఉండాలి? జైల్లోంచి తప్పించుకుని పారిపోయి వచ్చిన ఖైదీలాగా? గుడి వాకిట్లో ఓ సత్తు పాత్ర చాచి ధర్మం చెయ్యండి బాబూ అని యాచిస్తున్న బిచ్చగాడిలా? మాసిన గడ్డం....పస్తులతో చిక్కిన మొహమూ....? మగపెళ్ళివారు అతనిని చూసి హేళనగా నవ్వుతూ మాటలనడం విని రాజశేఖరానికి కోపమూ బాధా కలిగాయి. నా మిత్రుడేంటి ఇలా పిచ్చోడిలా ఉన్నాడేంటీ వాడి కూతురు పెళ్ళి శుభమా అంటూ జరుగుతుంటే అనుకుని ఉండలేకపోయాడు రాజశేఖరం. 
దగ్గరకెళ్ళి మిత్రుడ్ని పక్కకు తీసుకెళ్ళి "ఏమిటీ ఆకారం? మీ అమ్మాయి పెళ్ళి బాగానే చేస్తూ నువ్వు మాత్రం ఇలా ఉన్నావేంటీ? ఎందుకిలా? క్షవరం చేసుకుని చక్కగా కనిపించక్కర్లా? ఏమిట్రా?" అడిగాడు రాజశేఖరం.
అప్పుడు పెళ్ళికూతురు తండ్రి 
"ఏం చెయ్యనురా? నీకేం తెలుసు నా బాధ? నాలుగైదేళ్ళుగా ఎన్ని సంబంధాలు చూస్తున్నానో ఎక్కడెక్కడ తిరిగానో నీకేం తెలుసు....చివరికి ఓ గుడికెళ్ళి అమ్మవారికి దణ్ణం పెట్టి మొక్కుకున్నా. మా అమ్మాయి పెళ్ళి ఖాయమై సాఫీగా జరిగిపోయేవరకూ ఈ గడ్డం పెంచుతానని. అలాగే జుత్తూనూ. పెళ్ళి ముగిసిన తర్వాత తలనీలాలిస్తానని. క్షవరం చేసుకుంటానని. ఇలా మొక్కుకున్న ఆరు నెలలకు ఈ పెళ్ళి జరుగుతోంది. కనుక పెళ్ళి ముగిసాక రేపో మాపో వెళ్ళి మొక్కు చెల్లించుకుంటాను" అన్నాడు.
ఇంకేం మాట్లాడుతాడు రాజశేఖరం.