గుమ్మడి కాయ దొంగ అంటే...:-- బెల్లంకొండనాగేశ్వరరావు., చెన్నై

 అమరావతి నగరంలోని విశ్రాంతి అటవి శాఖ అధికారి రాఘవయ్య తాత ఇంటి అరుగుపై ఆవాడకట్టు లోని పిల్లలు అందరూ నీతికథ వినడానికి చేరారు.అందరికి మిఠాయిలు పంచిన రాఘవయ్యతాతయ్య'బాలలు దొంగతనం చేయడం చాలాతప్పు. మనం మన అవసరాలకు ఎలా ధనం దాచుకుంటామో ఎదటివారు కూడా వారి అవసరాలకు దాచుకుంటారు.వారి కష్టార్జితాన్ని దోచుకోవడం తప్పు.దొంగతనం చేసినవారు ఏదో ఒక రోజు పట్టుపడక తప్పదు అప్పుడు సమాజాంలో వారికి తగిన మర్యాదా మన్ననలు ఉండవు.అలాంటి వారికథ చెపుతాను వినండి.
పూర్వం గుంటూరు గ్రామంలో సోమయ్య,శివయ్య అనేవారు ఇరుగు పొరుగుగా నివశిస్తుండేవారు.సోమయ్య ఇంటి ఆవరణలో ఆవీధి లోని పలువురి కోళ్ళు తిరుగుతుండేవి.కోళ్ళు ఊరివాళ్ళవి అయినా అవి తన ఇంట పెట్టే గుడ్లు దొంగిలిస్తూండంతో పాటు,పలుమార్లు  తన ఇంటి ఆవరణలో తిరుగుతున్నఇతరుల కోళ్ళను ఎవ్వరూ చూడకుండా పట్టుకుని చంపి వండుకు తినేవాడు సోమయ్య.
ఒక రోజు శివయ్య కోడిపుంజు కనిపించకుండా పోయింది. అది సోమయ్య చేసిన పని అని తెలసి,న్యాయాధికారిని కలసి  జరిగిన విషయం విన్నవించాడు.
సోమయ్య,శివయ్యలను తన వద్దకు పిలిపించిన న్యాయాధికారి 'సోమయ్య నీవు శివయ్య కోడిని అపహరించావని ఫిర్యాదు చేసాడు దీనికి నీసమాధానం ఏమిటి?'అన్నాడు.
'అయ్యా నేను నిర్ధోషిని శివయ్య ఆరోపణ నిరూపించే సాక్ష్యం చూపమనండి'అన్నాడు సోమయ్య.ఇప్పటికే పలువురు సోమయ్యపై ఫిర్యాదు చేసినా సాక్ష్యం లేదు కనుక తాను ఏమి చేయలేకపోయాడు. ఎలాగైనా సోమయ్యను శిక్షించాలి అనుకున్న న్యాయాధికారి'రేపు ఉదయం సరిగ్గా పదిగంటలకు రచ్చబండ వద్దకు మీఇద్దరూ రండి'అని సోమయ్య శివయ్యలను పంపించాడు.తనకు నమ్మకమైన మిత్రులను ఇద్దరిని పిలిపించి రేపు ఉదయం సోమయ్య రచ్చబండకు చేరువగా రాగానే వీధిలో చేయవలసిన పని వివరించాడు న్యాయాధికారి.అతని ఇద్దరి మిత్రులు అలాగే అని వెళ్ళిపోయారు.
మరు దినం ఉదయం సోమయ్య  బయలు దేరి రచ్చబండకు వచ్చేదారిలో జంనంతో కలసి నడవ సాగాడు. రచ్చబండకు చేరువరాగానే 'సోమయ్య వెనుకనుండి ఎవరో 'ఏమండోయ్ మీతలపాగాపై కోడి ఈకలు ఉన్నవి'అన్నారు.ఆవీధిలోని జనం అందరిలో శివయ్య ఒక్కడే ఉలిక్కిపడి గబగబా తన తలపాగా తీసి విదిలించాడు.
'గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తముడు కున్నట్లు,కోడి ఈకలు అంటే ఈవీధిలో ఇంతమంది ఉండగా నువ్వు ఎందుకు తలపాగా ఊడదీసి చూసుకుంటున్నావు సోమయ్య'అన్నాడు చెట్టు చాటునుండి  చేరువుగా వచ్చిన న్యాయాధికారి.తత్తరపడ్డ సోమయ్య మాటలు తడబడ్డాయి.'నీఇంటి పెరటిలో పలుకోళ్ళ ఈకలు గోతిలో దొరికాయి.నిజం ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుంది'అన్నాడు న్యాయాధికారి.
తన తప్పు ఒప్పుకుని కోళ్ళ యజమానులు అందరికి ధనం చెల్లించాడు సోమయ్య. అయినప్పటికి దొంగకోళ్ళ సోమయ్య అని అందరూ పిలవడంతో అవమానం భరించలేక ఊరు వదలి దూరం గా ఎటో వెళ్ళి పోయాడు.
బాలలు విన్నారుగా దొంగతనం వలన ఇటువంటి కష్టాలు ఎన్నో అనుభవించవలసి వస్తుంది.కనుక మీ జీవితంలో ఎన్నడూ దొంగతనం చేయకండి.చేసేవారిని ప్రోత్సహించకండి'అన్నాడు రాఘవయ్యతాత.
బుద్ధిగా తల ఊపారు పిల్లలంతా.
కామెంట్‌లు