సమయం ఎనిమిదవుతూవుంది. ట్యూషన్లో పిల్లలెవరూ లేరు. నోట్సులో కొంచం మిగిలివుంటే రాసుకుంటూ అలాగే వుండిపోయింది. అది చూసి సారు “పోమ్మా మంజూ... రేపు రాసుకుందువులే... బాగా చీకటి పడిపోయింది” అని హెచ్చరించాడు.
“ఏం కాదులే సార్... పక్క సందులోనే కదా మా ఇల్లు. పది నిముషాలు చాలు. నాకేం భయం లేదులే” అంటూ అలాగే రాసుకుంటూ వుండిపోయింది.
మరో పావుగంటకు రాయడం పూర్తయింది. లేచి పుస్తకాలన్నీ సంచీలో పెట్టుకొని, భుజానికి తగిలించుకొని బైలుదేరింది. చలికాలం కావడంతో జనాలంతా అప్పుడే తలుపులు మూసేసుకున్నారు. రోడ్డుమీద ఎవరూలేరు. అక్కడక్కడ కిటికీలోంచి లైట్ల వెలుతురు రోడ్డుమీదికి ప్రసరిస్తూ వుంది. చిన్న సందు కావడం చేత వీధి దీపాలు దూరం దూరంగా వున్నాయి. నెమ్మదిగా సందు దాటింది. ఇంకో ఐదు నిముషాలు. అక్కడ వరుసగా పెద్ద పెద్ద చెట్లువున్నాయి. అవి దాటి కుడివైపుకి తిరుగుతే చాలు ఇల్లు వచ్చేస్తుంది. చెట్లకింద చాలా చీకటిగా వుంది. నడుస్తూ ఒక పెద్ద మర్రిచెట్టు కిందకి వచ్చింది.
అంతలో... ఒక్కసారిగా... ధబ్బుమని పైనుంచి ఏదో దూకిన శబ్దం.
మంజు అదిరిపోయింది. ఎదురుగా.... తెల్లగా... గాలిలో తేలుతూ...
*చిన్న దెయ్యంపిల్ల!*
దాన్ని చూడగానే మంజు భయంతో బిక్క చచ్చిపోయింది. కాళ్ళు కదలలేదు. ఒళ్ళంతా వణికిపోయింది. అది నెమ్మదిగా దగ్గరికి వచ్చేసింది. మంజు గుండె కొట్టుకునే వేగం పెరిగిపోసాగింది. గజగజా వణికిపోసాగింది.
అంతలో... అది తన చిన్న చేతులు ముందుకు సాచి మంజు రెండు బుగ్గలూ పట్టుకొని “నీ పేరు” అంది.
మంజు వణికిపోతూ “మ...మ...మన్... జు....” అంది. “ఏం చదువుతున్నావ్” మరలా ప్రశ్నించింది. “తొ... తొ... తొమ్మిది” . అది కాసేపు మంజును అలాగే చూస్తుండిపోయింది. “భయపడకు. నిన్నేం చేయను. కాకపోతే నువ్వు నాకో సాయం చేయాలి. చేస్తావా” అంది. మంజుకు నెమ్మదిగా వణుకు తగ్గసాగింది.
“చేస్తాను. కానీ నన్నేం చేయొద్దు” అంది.
“ఏం చేయను. కానీ నువ్వు మాట నిలబెట్టుకోవాలి. లేకపోతే మాత్రం నిన్ను వదలను. ఎక్కడికిపోయినా” హెచ్చరించింది.
మంజు కొంచం ధైర్యం తెచ్చుకుని ఆ దెయ్యం వంక చూసింది. అది తనకంటే కొంచం చిన్నగానే వుంది. పన్నెండు, పదమూడేళ్ళ వయసుంటుంది. పోనీ టైల్ కట్టుకొని రబ్బరుబ్యాండ్ పెట్టుకొంది. అది సినిమాల్లో చూపించినంత, పుస్తకాల్లో చదివినంత భయంకరంగా లేదు. చాలా అందంగా ముద్దుగా వుంది. పెదవులపై చిరునవ్వు వెలుగుతూవుంది. ఆ చిరునవ్వును చూడగానే మంజుకు మరింత ధైర్యం వచ్చింది. అది తనను ఏం చేయదు అనిపించింది. దాంతో 'సరే ఏం చేయాలో చెప్పు' అంది.
*“నీకు ఏమయినా కథలొచ్చా” ఆశగా అడిగింది ఆదయ్యంపిల్ల.*
“కథలా... అంటే” ఎదురు ప్రశ్నించింది మంజు.
“అంటే... నీకు ఎప్పుడూ ఎవరూ కథలు చెప్పలేదా” నిరాశగా ప్రశ్నించింది.
“లేదే... ఎలాగుంటాయి అవి” మరలా ప్రశ్నించింది మంజు. దయ్యంపిల్ల నీరసపడిపోయింది. ఒక్కసారిగా నిట్టూర్చి,
“నాకు ఒక మంచికథ కావాలి. నువ్వు ఎలాగయినా సరే... ఎక్కడయినా సరే... ఎవరినో ఒకరిని పట్టుకొని ఒక్క కథ చెప్పించుకొని నాకు చెప్పాలి. కానీ అది పుస్తకాల్లో చదివి చెప్పగూడదు. సినిమాల, సీరియళ్ళ కథలొద్దు. మన అమ్మమ్మలు, తాతయ్యల కాలంనాటి కథ. కమ్మని పూర్ణం కర్జకాయలాంటి కథ. నువ్వు అదిగాని చెప్తే నాకీ రూపం తొలగిపోతుంది. చెప్తావా” ఆశగా అడిగింది.
మంజు కాసేపు ఆలోచించి “సరే... నేను ఎవరినో ఒకరికి అడిగి కనుక్కుంటాలే” అని చెప్పి బైలుదేరింది. దెయ్యంపిల్ల టాటా చెబుతూ అలాగే అక్కడే కళ్ళనిండా ఆశను నింపుకొని నిలబడిపోయింది.
*********************
మంజు ఇంటికొచ్చింది. అమ్మ వంటింట్లో వుంది. అక్కన్నించే హాలులోని టీవీలో సీరియల్ చూస్తూ వంట చేస్తూవుంది. నాన్న తన పర్సనల్ గదిలో కూర్చుని కంప్యూటర్లో ఏదో పని చేసుకుంటున్నాడు. అన్న తల ఎత్తకుండా రికార్డు వర్కు రాసుకుంటూ వున్నాడు.
“ఏమే ఇంత ఆలస్యమైంది” వంటింట్లోంచే అమ్మ అడిగింది.
“కొంచం పెండింగుంటే నోట్సు రాసుకుంటుంటి” అని చెప్పి గబగబా బ్యాగు గూట్లో పెట్టేసి అమ్మ దగ్గరకు చేరింది.
“అమ్మా... అమ్మా... నీకేమయినా కథలొచ్చా” ఆసక్తిగా అడిగింది.
వాళ్ళమ్మ చేస్తున్న పని ఆపి ఒక్క నిమిషం మంజువంక విచిత్రంగా చూసి, మరలా బీరకాయలపై చెక్కుతీస్తూ “అంత తీరిక నాకెక్కడిదమ్మా... పొద్దున్నుంచీ రాత్రివరకూ ఈ పనులతోనే సరిపోతుంటే.... మీ నాన్నకడుగు. ఇంటికి ఆలస్యంగా వచ్చినప్పుడల్లా కొత్త కొత్త కథలు మస్తుగ చెబుతుంటాడు” అంది.
పాప వురుక్కుంటూ వాళ్ళ నాన్నను చేరుకొని వెనుకనుంచి మెడచుట్టూ చేతులేసి “నాన్నా... నాన్నా... నీకేమయినా కథలొచ్చా నాన్నా” అని అడిగింది.
“ఎందుకమ్మా ఇప్పుడు” చేస్తున్న పని ఒక్క క్షణం ఆపి అడిగాడు. “మా టీచర్... రేపు ఒకొక్కరు ఒకొక్క కథ చెప్పాలి. అంది నాన్నా” అంటూ అబద్దమాడేసింది.
“నెట్లో చిల్డ్రన్ స్టోరీస్ అని క్లిక్ చేస్తే చాలమ్మా... కుప్పలు కుప్పలు సైట్లోస్తాయి. కాసేపున్నాక రా... నా పనయిపోగానే వెదుకుదాం” అన్నాడు.
"అలాకాదు నాన్నా... చెబుతుంటే విని తిరిగి చెప్పాలంట. అది గూడా చెప్పేవాళ్ళు అప్పటికప్పుడు చదివి చెప్పగూడదంట. ఎప్పుడో విన్నవి గుర్తుకు తెచ్చుకొని చెప్పాలంట” అంది మంజు.
“మీ టీచర్ పిచ్చిగానీ... ఎవరికి గుర్తుంటాయమ్మా ఆ తిక్క తిక్క కథలన్నీ... ఐనా మీ టీచర్ కి ఇంతకన్నా మంచి ప్రాజెక్ట్ దొరకలేదా ఏంటి. నేనొచ్చి మాట్లాడ్తాలే” అన్నాడు.
“అంటే నీకు ఒక్కటి కూడా రాదా నాన్నా” నిరుత్సాహంగా ప్రశ్నించింది.
“లేదమ్మా... ఏదో మా చిన్నప్పుడు ఒకటి రెండి వినింటి. కొన్ని చదువుకొనింటి. కానీ ఇప్పుడు అవేమీ గుర్తులేవు”
మంజు నిరాశగా అక్కడినుంచి బైటి కొచ్చేసింది.
అన్నం తిని వాటి గురించే ఆలోచిస్తూ అలాగే నిదురపోయింది. రాత్రంతా ఏవేవో కలలు. కథలు వింటున్నట్టు, చెబుతున్నట్టు, మధ్యలోనే మరచిపోతున్నట్టు... -
ఉదయమే పరిగెత్తుతూ పాఠశాలకు చేరుకొంది. కనబడిన స్నేహితులను, స్నేహితురాళ్ళను, సీనియర్లను, జూనియర్లను అందరినీ అడిగింది. “ఏమోనే... ఈ పాఠాలు బైహార్ట్ చేసి అప్పజెప్పడానికే సమయం సరిపోవడం లేదు. ఎప్పుడన్నా ఏమన్నా కొంచం సమయం మిగిలితే ఇంటర్నెట్ లో మెయిల్స్ చెక్ చేసుకోవడం, చాటింగ్ చేయడం, గేమ్స్, టీవీలో సినిమాలు చూడ్డంతోనే సరిపోతోంది. కథలు చెప్పమని
మేమెప్పుడు ఎవరినీ అడగలేదు. చెబుతామని మా దగ్గరికి ఎవరూ రాలేదు” అన్నారు అందరూ.
లాభం లేదనుకొని వాళ్ళ క్లాస్ టీచర్ను కలిసింది. ఆమె వయసు అరవై పైన్నే వుంటుంది. రిటైరయినాక ఆమెకున్న సబ్జెక్టు చూసి ఇక్కడ తీసుకున్నారు. ఆమె నవ్వుతూ “మా చిన్నగున్నప్పుడు టీచర్లు తరగతి గదుల్లో సమయం దొరికినప్పుడల్లా కథలు చెబుతూండేవాళ్ళు. కథలు చెప్పడానికి, చదవడానికి టైంటేబుల్ లో పీరియడ్లు గూడా కేటాయించేవాళ్ళు. కానీ ఈ ప్రయివేటు బళ్ళల్లో ర్యాంకులు, మార్కుల పోటీల్లో అవన్నీ అటకెక్కినాయి. ఉద్యోగంలో చేరిన కొత్తలో నేనుగూడా అప్పుడప్పుడు సందర్భానికి తగినట్లు కథలు చెప్పేదాన్ని. కానీ ఒక రోజు మా పై అధికారి పిలిపించి... ఏమ్మా... క్లాసులో పాఠాలు చెప్పమంటే కథలూ, కాకరకాయలూ చెబుతూ పిల్లలని గబ్బులేపుతున్నావంట. నీకు జీతమిస్తున్నది అందుక్కాదు.
జాగ్రత్త. మార్కులు తక్కువొస్తే బాగుండదు అని హెచ్చరించాడు. ఆ తర్వాత నా మనసులో సబ్జెక్టు తప్ప ఏమీ మిగలలేదు. ఆఖరికి ఉత్తమ ఉపాధ్యాయినిగా రాష్ట్రస్థాయిలో అవార్డు గూడా అందుకున్నాను” అంది నిట్టూరుస్తూ.
మంజుకి ఏం చేయాలో అర్థం కాలేదు. అంతలో ఒక స్నేహితురాలు పక్కకి పిలిచి "మంజూ.... గ్రంథాలయమని కొండారెడ్డి బురుజు దగ్గర వుంటాదంట. అక్కడ అన్నీ పుస్తకాలేనంట. వాటిని చదవడానికి చాలామంది వస్తుంటారంట. అక్కడికిపోతే...” అంది. మంజుకి ఆ ఆలోచన నచ్చింది. నెట్ లో జిల్లా లైబ్రరీ ఎక్కడుందో సెర్చ్ చేసి ఆటోలో సాయంత్రం చేరుకుంది.
గ్రంథాలయం చాలా విశాలంగా వుంది. ముందు పెద్ద గదివుంది. దానిలో కొందరు కూర్చుని దినపత్రికలు తిరగేస్తున్నారు. లోపలి గదుల్లోకి అడుగుపెట్టింది. వేలకొద్దీ పుస్తకాలు ర్యాకులలో వరుసగా కిందామీదా సర్ది వున్నాయి. గది చాలా నిశ్శబ్దంగా వుంది. తన అడుగుల శబ్దం తనకే వినబడుతూ వుంది. చుట్టూ చూసింది. ఎవరూలేరు. నవలలు, కవిత్వం, శాస్త్ర గ్రంథాలు... ఇలా ఒకొక్క విభాగమే దాటుతూ కథల దగ్గరకు చేరుకుంది. పుస్తకాలు ఎన్నో రోజులనుంచీ ఎవరూ కదపక దుమ్ము పేరుకపోయున్నాయి. లైబ్రేరియన్ ఆశ్చర్యంగా తననే చూస్తున్నాడు.
“ఏమమ్మా... దారి తప్పి ఇలా వచ్చావు. ముందు గదిలో మీకు కావాల్సినవి వున్నాయి చూడు” అన్నాడు. “అది కాదంకుల్... ఇక్కడికెవరూ రారా”
“చాలా తక్కువమ్మా... ఇప్పుడు సమాచారమంతా నెట్ లో క్షణాల్లో దొరికిపోతుంది గదా... ఇక్కడ ఇంకేంపని. ఎవరో పరిశోధకులు మాత్రం అప్పుడప్పుడూ వస్తుంటారు. ఇంతకూ నీకేం పని”
“ఎవరయినా ఇక్కడ కథలు చదివేవాళ్ళు చెప్పేవాళ్ళు కనబడారేమోనని...” “కథలా...” గట్టిగా నవ్వేశాడు.
“ఇప్పుడిక్కడ అవన్నీ ఎవరు చదువుతున్నారమ్మా... మేముగూడా వాటికి కొనడం మానేసి కెరీర్ గైడ్స్, వ్యక్తిత్వ వికాసం, ఆధ్యాత్మికం, వివిధ పోటీ పరీక్షల మ్యాగజైన్లు తెప్పిస్తున్నాం.”
“మీకేమయినా కథలొచ్చా అంకుల్”
“నాకా....” అంటూ పెద్దగా నవ్వేస్తూ “నా ఉద్యోగం పుస్తకాలు పేర్చడమే తప్ప చదవడం కాదమ్మా...” అన్నాడు.
మంజు ఒక్కనిమిషం అక్కడున్న వేలకొద్దీ పుస్తకాలను పరికించి చూసింది. ఆమెకు అవన్నీ శ్మశానంలో వరుసగా పేర్చబడ్డ శవాల్లా కనిపించాయి.
నిరాశగా గ్రంథాలయం నుంచి వెనుదిరిగింది.
కథలు ఎక్కడ దొరుకుతాయో, ఎవరు చెబుతారో ఎంత ఆలోచించినా అర్థంకాలేదు. ముసిలోళ్ళనడిగితే “తెలుసుగానీ.... ఇంతకాలం... ఎవరూ అడగక... ఎప్పుడూ చెప్పక... మరిచిపోయామమ్మా” అంటున్నారు. పిల్లలనడిగితే "అస్సలు తెలీదు. ఆమాటే ఎప్పుడు వినలేదు.” అంటున్నారు. పెద్దవాళ్ళనడిగితే "ఇంకేం పనిలేదా... చదువుకోక” అంటూ కసురుకొంటున్నారు. తెలిసిన ప్రతి ఇంటి తలుపూ కొట్టింది. లాభం లేకపోయింది. ఎవర్నడిగినా మాకు తెలీదంటే మాకు తెలీదన్నారు.
మంజుకు బుల్లి దయ్యం గుర్తుకు వచ్చింది.
దానికిచ్చిన మాట గుర్తుకు వచ్చింది. విచారంగా ఇంటి ముఖం పట్టింది.
రాత్రి ట్యూషన్ పూర్తికాగానే సంచీ తగిలించుకొని మౌనంగా నడవసాగింది. మనసంతా ఏదో చెప్పలేనంత దిగులుగా వుంది. అడుగుతీసి అడుగువేయడం కష్టంగావుంది. చెట్టు దగ్గరపడుతున్న కొద్దీ కళ్ళల్లో నీళ్ళు తిరుగసాగాయి. ఏడుపు నాపుకుంటూ చెట్టు దగ్గరికి వచ్చింది.
పైనుంచి బుల్లి దయ్యం కిందకు దిగుతూ, “మంజూ... కథ దొరికిందా” అంటూ ఆశగా అడిగింది. ఎలా చెప్పాలో తెలియక మంజు దిగులుగా తల వంచుకుంది. బుల్లి దయ్యానికి విషయమంతా అర్థమైపోయింది. ఒక్కసారిగా దాని ముఖమంతా విచారం కమ్ముకుంది.
మంజుకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.
ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక పోయినందుకు చాలా బాధగా వుంది. ఒక్కకథ దొరికింటే ఎంత బాగుండు అనిపించింది.
అంతలో మంజుకు ఏదో ఏడుపు వినిపించి తలెత్తింది.
బుల్లిదయ్యం రెండు చేతుల్లోనూ ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తూవుంది. దాని కళ్ళలో నీళ్ళు కారిపోతూవున్నాయి. అది చూడగానే మంజుకు కూడా ఒక్కసారిగా దుఃఖం తన్నుకువచ్చింది. తమాయించుకుంటూ ఒక్కుదుటున బుల్లి దయ్యాన్ని చేతుల్లోకి తీసుకొంది. హృదయానికి హత్తుకుంది. కళ్ళనీళ్ళు తుడుస్తూ "అసలు... నీ పేరేమి. ఎందుకిలా అయ్యావు” అడిగింది. అది కన్నీళ్ళు తుడుచుకుంటూ తన కథ చెప్పడం ప్రారంభించింది. -
నా పేరు కావ్య. మాది కర్నూలు. రోజూ పొద్దున్నే లేవడం, మ్యూజిక్ ఛానెల్ పెట్టుకోవడం, చూస్తూ చూస్తూ టిఫిన్ తినడం, తయారు కావడం, బడికి పోవడం, పాఠాలు బైహార్ట్ చేయడం, ట్యూషన్... ఇంటికి రాగానే హోంవర్కు... మరలా టీవీ ముందుకు చేరడం... చూస్తూ చూస్తూ తినడం, అలాగే పడుకోవడం. ఆదివారం గూడా క్లాసులుండేవి. లేకుంటే నెట్ లో గేమ్స్, సినిమాలు, ఛాటింగ్లు.
ఒకసారి మా ఇంటికి మా అమ్మమ్మ వచ్చింది. వాళ్ళది ఆదోని దగ్గర బస్సురోడ్లు కూడా లేని చిన్న పల్లెటూరు. అక్కడే సొంతింట్లో తాతయ్య అమ్మమ్మ వుంటారు. ఆమెకు డెబ్బై ఏళ్ళుంటాయి. తన పనులన్నీ తానే చేసుకుంటుంది. అమ్మమ్మ వచ్చినా మేం పెద్దగా ఎప్పుడూ పలకరించింది లేదు. ఏమ్మా అంటే ఏమ్మా అంతే... నన్ను వారం నుండి గమనిస్తున్న మా అమ్మమ్మ ఒకరోజు నాతో “ఏందే... ఒక అచ్చటా లేదు. ముచ్చటా లేదు. గానుగెద్దు మాదిరి ఎప్పుడూ ఆ టీవీ ముందో, కంప్యూటర్ ముందో, పుస్తకాలముందో పడుంటావు. హాయిగా బైట పిల్లలతో ఆడుకోవడమో, మంచి మంచి కథలు పెద్దవాళ్ళనడిగి వినడమో చేయొచ్చు గదా” అంది.
నాకా మాటలు కొత్తగా అనిపించాయి. “కథలా... అంటే ఏంటివమ్మమ్మా...” అన్నాను.
ఆమె నన్ను దగ్గరకు తీసుకుంటూ “కథలంటే అదో అందమైన ప్రపంచమమ్మా. లోకంలోని ఆనందాలన్నీ అందులోనే వుంటాయి. మేం చిన్నగున్నప్పుడు లేస్తే కథ. కూర్చుంటే కథ. పనులకి పోయేటప్పుడు ఎవరో ఒకరు కథ ఎత్తుకోనేవాళ్ళు. మైళ్ళకు మైళ్ళు దూరం తెలిసేది గాదు. ఎంతటి పనైనా ఏమాత్రం కష్టమనిపించేది కాదు. వూ కొడతా అలా సాగిపోయేవాళ్ళం . చీకటి పడితే చాలు పిల్లలంతా ఎవరో ఒకరి దగ్గర ఒదిగిపోయేవాళ్ళం . వాళ్ళు ఆకూ వక్కా నముల్తా... వూరిస్తా... వూరిస్తా... తియ్యని చెరుకురసం నోట్లో పోసినట్లు... కమ్మగా కథ చెబుతావుంటే... వింటా... వింటా... అక్కన్నే అలాగే నిదురపోయేవాళ్ళం. బళ్ళల్లో పంతుళ్ళు గూడా కథలు చెప్పడంలో పోటీ పడేటోళ్ళు. ఇక తెలుగు పంతులైతే చెప్పాల్సిన అవసరమేలేదు... నోటి నిండా కథలే....
దేవతలూ, దయ్యాలూ... రాజులూ, రాక్షసులూ... మంత్రాలూ, మాయలూ... నీతులూ, నవ్వులూ... భలేగుంటాయి ఆ కథలు. ఆకాశంలో, పాతాళంలో విహరిస్తూ... ఇంద్రధనస్సులను తాకుతూ, రెక్కల గుర్రాలపై గెంతులేస్తూ, ఏడుతలల నాగుబాములతో తలబడుతూ, ఒంటికంటి రాక్షసులను సంహరిస్తూ, మాంత్రికులను బురిడీ కొట్టిస్తూ, మంచిని గెలిపిస్తూ... అబ్బ.... అవి వినాలే గానీ వూరికే చెబితే ఆ ఆనందం అర్థం కాదమ్మా.
అమ్మ ఒడిలో భద్రంగా పడుకొని వెచ్చగా పాలు తాగినట్లు, ఎండాకాలంలో వేపమానుకింద చేరి చల్లని గాలిలో వుయ్యాలలూగినట్లు.... పండుగరోజున తియ్యని పూర్ణం కర్జికాయను నోట్లో పెట్టుకొని తనివితీరా నమిలినట్లు... నేను చెప్పలేనే... ఆ ఆనందమే వేరు” అని చెప్పింది.
దాంతో నాకు గూడా ఆ కథలు ఒక్కసారి వినాలనిపించింది. అమ్మమ్మతో అంత సేపు ఎప్పుడూ గడపలేదు. అమ్మమ్మకు మరింత దగ్గరగా జరిగి “అయితే... నాకుగూడా ఒక్కకథ చెప్పు అమ్మమ్మా... వింటా” అన్నా.
"సరే... చెప్తాలే... కానీ ఈ రోజు బాగా పొద్దుపోయింది గదా... రేపు సాయంత్రం ఆ చెత్త టీవీ చూడకుండా బడయిపోగానే నా దగ్గరికి రా” అంది.
తరువాత రోజు శనివారం. ఆఫ్ డే స్కూల్. పొద్దున్నే లేశా. అమ్మమ్మ ఇంకా లేవలేదు. తొందరగా తయారయి ఏడుకంతా బైటపడ్డా. బళ్ళో అందరికి అమ్మమ్మ గురించి, ఆమె చెప్పబోయే కథల గురించి చెప్పా. అందరూ సోమవారం ఆ కథలన్నీ తమకు కూడా చెప్పాలని ప్రామిస్ చేయించుకున్నారు.
మధ్యాహ్నం బడయిపోగానే పరుగెత్తుకుంటూ ఇంటికి చేరుకున్నాను. ఇంటి ముందంతా బంధువులు, నాన్న స్నేహితులు. లోపల ఏవో ఏడుపులు. ఏమీ అర్థం కాలేదు. బెరుకుబెరుకుగా లోపలికి అడుగు పెట్టాను. వరండాలో అమ్మమ్మ కింద పడుకొని వుంది. కళ్ళు మూసుకొని వున్నాయి. ముక్కుల్లో దూదివుంది. తలవెనుక దీపం వెలుగుతూవుంది.
“రాత్రి నిద్దురలోనే పోయింది. పొద్దున ఎంత సేపటికీ లేవకపోతే” నాన్న తాతయ్యకు చెబుతూ వున్నాడు.
అలా... ఆరోజునుంచీ కథ వినాలనే కోరిక నెరవేరనే లేదు. అమ్మను, నాన్నను, ఎదురింటోళ్ళను, పక్కింటోళ్ళను... ఎందరినో.... అడిగీ... అడిగీ... అలసిపోయా.
అన్నం తినబుద్ది కాలేదు. నీళ్ళు తాగబుద్ధి కాలేదు. ఒక్కకథ... ఒక్కకథ... అంటూ నిద్రలో గూడా కలవరించసాగా... "
అమ్మా... నాన్నా... నన్ను చూసి తల్లడిల్లిపోయారు. ఏవేవో బుక్కులు తెచ్చి చదివి వినిపించసాగారు. ఎవరెవరినో పిలిపించి కథలు చెప్పించసాగారు. కానీ.... వాళ్ళ మాటల్లో జీవంలేదు. వాళ్ళ ముఖాళ్ళో కథ చెబుతున్నామనే ఆనందం లేదు. దాంతో... మా అమ్మమ్మ వర్ణించినట్టు కమ్మని అమ్మపాలవంటి అద్భుతమైన కథ ఏదీ నాకు దొరకలేదు.
వైద్యులకు చూపించారు. మందులు తినిపించారు. మంత్రగాళ్ళను పిలిపించారు. తాయెత్తులు కట్టించారు. వాస్తు మార్పించారు. జాతకాలు చూపించారు. కథలకోసం ఎవరెవరినో అడిగారు. పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చారు.
ఆఖరికి శ్రీశైలం దగ్గరి నల్లమల్ల అడవుల్లో... నగరానికి దూరంగావున్న చెంచుగూడెంలో... ఒక అవ్వ వుందనీ.. ఆమె కథలు చెబుతుందనీ కనుగొన్నారు.
అందరమూ అక్కడకు బైలు దేరాం. ఆరోజు రాత్రి పెద్దవాన. కటిక చీకటి. డ్రైవర్ చూసుకోక... ఎదురుగా మలుపు తిరుగుతున్న లారీని కొట్టేశాడు. కిటికీ పక్కన కూర్చున్న నేను ఎగిరి లోయలో పడిపోయాను.
అంతే...
*******************
ఆరోజు నుంచి ఎదురు చూస్తూ వున్నా... నాకోరిక తీరి నాకీ రూపం ఎప్పుడు తొలగిపోతుందా అని. ఈ బాధనుంచి ఎప్పుడు విముక్తమవుతానా అని.
ఒక్క కథ
మా అమ్మమ్మ వూరించి వూరించి చెబుతానన్న ఒక్క కథ...
కమ్మని పూర్ణం కర్జికాయలాంటి ఒక్క కథ.
ప్లీజ్....
మీకెవరికయినా తెలుస్తే చెప్పండి...
మీ కూతురిలాంటి నాకోసం...
ప్లీజ్...
..........
......
.....
.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి