బాలవర్ధన్ ఆబాలగోపాలానికి ఆనంద వర్ధన్:- డా. నమిలికొండ సునీత--9908468171

  మనం జానపద కథలను పెద్దల ద్వారానో పుస్తకాల్లోనో వినడం చదవడం చేస్తుంటాం. అవి ఏ కాలానికి సంబంధించినవైనా వాటిని అలాగే వినడం,పిల్లలకి వాటిని ఉన్నది ఉన్నట్లుగా అందించడం సర్వసాధారణమైన విషయం. అయితే విశ్రాంత ఉపాధ్యాయులు అయిన వి.ఆర్.శర్మ గారు మాత్రం అవిశ్రాంతంగా బాలలలోకంలోనే సేవలందిస్తూ,నిరంతర సృజన మూర్తిగా పిల్లల కోసం వినూత్న ప్రయోగాలతో సాహితీ సృజన చేస్తున్నారు.వీరి సాహితీ సృజనకు కేంద్రం పిల్లలు. బాల సాహిత్యంలో వివిధ ప్రక్రియల్లో బహుగ్రంధకర్త అయిన వీరు బాలల కోసం నవలా ప్రక్రియను చేపట్టి పిల్లలకు తొలి నవల'కానుక' నిచ్చి, బాలలలోకంలో సాహితీ 'ప్రయాణం' చేస్తున్న వీరు ఇటీవలే 'బాలవర్ధన్ 'అనే మరో నవలను వెలువరించారు. మంచి పుస్తకం వారు ఈ బాలల నవలను ప్రచురించారు. బాలవర్ధన్ నవలను బాలనాగమ్మ అనే జానపద కథ స్ఫూర్తితో టీనేజ్ పిల్లల కోసం ఆధునిక కాల్పనిక నవలగా వెలువరించడం శర్మగారి సృజనశీలతకు తార్కాణం. వీరు తమ రచనల ద్వారా పఠనాసక్తి సన్నగిల్లుతున్న నేటి తరాన్ని పుస్తకప్రియులుగా తీర్చిదిద్దడానికి చేస్తున్న కృషి చేస్తున్నారు. 'నేటినిజం 'పత్రిక ఈ నవలను ధారావాహికంగా వెలువరించడం ముదావహం.
    వి.ఆర్ . శర్మ గారు ఈనవలలో ప్రస్తుతసమాజాన్ని, సమాజంలో మార్పుల్ని సరళమైన,స్వచ్ఛమైన భాషతో, సులభ శైలిలో అందించిన  తీరు ఆబాలగోపాలాన్ని అలరించేలా ఉంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి యువతకు ఈ నవలలోని బాలవర్ధన్ పాత్ర ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో జీవితాలను చక్కబెట్టుకోవచ్చుననే సందేశాన్ని అందించారు. అంతేకాకుండా  ఈ నవల ద్వారా బాలలకు తల్లిదండ్రుల పట్ల ఉండవలసిన  ప్రేమను, బాధ్యతను తెలియజేశారు. అలాగే భావితరానికి జీవ కారుణ్య భావన, ప్రకృతి పట్ల ప్రేమ అత్యావశ్యకమని ఉద్బోధించారు. ఈ నవల చదువుతున్నంతసేపు కథన కుతూహలం కలిగిస్తుంది. నేటి బాలల్లో కొందరు పాఠ్య పుస్తకాలకు మాత్రమే పరిమితమై ర్యాంకుల వేటలో పడి లోకజ్ఞానాన్ని పొందలేకపోవడం విచారించదగిన విషయం. అలాగే చదువవంటే అనాసక్తత పెరిగిపోయి సెల్ ఫోన్, ఇంటర్నెట్ వంటి సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్న వారికి కూడా ఈ నవల కనువిప్పు కలిగిస్తుంది.
         ఆబాలగోపాలం కాల్పనిక ప్రపంచంలో విహరించడమన్నా,అద్భుతాలు, వింతలు, విశేషాలు, సాహసాలు వంటి విషయాలన్నా మక్కువ కలిగి ఉంటారు . శర్మగారు ఈ నవలలో తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని సందర్భోచితంగా ప్రస్తావించి ఈ నవలకు మరింత వన్నె తెచ్చారు.అలాగే లాక్డౌన్, వైరస్ వంటి సమకాలీన సమస్యలను కథలో అంతర్భాగం చేయటంలో శర్మగారి వాస్తవిక రచనా సంవిధానంలో నవ్యత  వెల్లడవుతుంది. వివిధ సంఘటనల్లో ఆయా ప్రాంతాలకు భూమి, ఆకాశం, తోబాటు పాతాళ లోకాలకు సంబంధించి శర్మగారి సాహిత్య ,సాంస్కృతిక, చారిత్రక ,సాంకేతిక విషయ పరిజ్ఞానం పఠితలకు ఆసక్తి కలిగిస్తుంది. 
         ఈ తరం పిల్లల్లో పఠనాసక్తిని కలిగించే విధంగా  నవలను రచించడం కత్తి మీద సాము వంటిది.శర్మగారు బాలనాగమ్మ జానపద కథను తీసుకొని వర్తమాన కాలానికి అనుగుణంగా వినూత్నమైన రీతిలో నవలగా మలిచారు.పిల్లల్లో ఉత్సుకత కలిగించే విధంగా వాస్తవికతను ప్రతిబింబించేలా పరిచితమైన ప్రాంతాలు పాత్రల పేర్లతో వర్తమాన సంఘటనలు చిత్రించిన తీరు పాఠకుల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. భారతదేశంలో ఉన్న చారిత్రక పర్యాటక ప్రాంతాలను అక్షర యానం ద్వారా పాఠకులకు ప్రత్యక్షంగా విహరిస్తున్న అనుభూతిని కలిగించడంలో శర్మగారి కృషి అద్వితీయమైనది. 
              బాలవర్ధన్ నవల ముగింపులో "ప్రకృతికి మనం ఏది ఇస్తే దాన్ని అనేక రెట్లు పెంచి ఇస్తుంది" అంటూ మానవ జాతికి ఆలోచనాత్మకమైన సందేశాన్ని అందించడమే కాకుండా, ఆత్మ విమర్శ చేసుకునే అవకాశం కల్పించారు.బాలల మేధస్సుకు పదును పెట్టారు. ఈ నవల ఆధారంగా బాలల చలన చిత్రాన్ని రూపొందిస్తే అమూల్యమైన సందేశాన్ని ప్రపంచానికి అందించినట్లవుతుందని నా భావన.