అపోహ:--సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,ధర్మపురి.మొబైల్: 9908554535.

 కొండపల్లి లోని పేరిశాస్త్రి పౌరోహిత్యం చేయడంలో దిట్ట. కానీ ఎవ్వరు వచ్చి తనను పిలిచినా వారికి వ్యతిరేకంగా ఏమేమో ఊహించు కునే వాడు.
         ఒకసారి  రామశర్మ అనే వైద్యుడు కొత్తగా ఆ గ్రామానికి వచ్చాడు. అతడు తన వైద్యశాల ప్రారంభానికి పూజ కొరకై పేరిశాస్త్రి ఇంటికి వెళ్లి ఆయనను ఆహ్వానించాడు. అప్పుడు పేరి శాస్త్రి "ఓహో !మీరు వైద్యులా! అయితే నేను అసలే  రాను" అని అన్నాడు.
        " ఎందుకు రారు" అని ప్రశ్నించాడు రామశర్మ? అప్పుడు పేరిశాస్త్రి "మేము లోకా సమస్తా సుఖినోభవంతు" అని కోరుకుంటాము కదా!  అంటే ప్రజలంతా ఏ రోగాలు లేకుండా సుఖంగా ఉండాలని కదా !మీరేమో ప్రజలు  రోగాల బారిన పడి మీ వైద్యశాలకు ఎక్కువమంది రావాలని, ఎక్కువ డబ్బు సంపాదించాలని కోరుకుంటారు .అందుకే మా చేత పూజలు జరిపించు కుంటారు. మేము మీ వైద్యశాల బాగా నడవాలని ఆశీర్వచనం ఇవ్వడమంటే  ప్రజలు చాలా మంది రోగాల బారిన పడమనే కదా!  అందువల్ల ఇది లోక విరుద్ధం .మీకు, మాకు కుదరనే కుదరదు" అని అన్నాడు పేరి శాస్త్రి.
           అప్పుడు రామశర్మ " అయ్యా !మీరు చెప్పేది వాస్తవం కాదు . 'వైద్యో నారాయణో హరిః " అని కూడా మీరు వినలేదా! మా వద్దకు రోగాల బారిన పడిన వారు మాత్రమే వస్తారు .వారికి వైద్యం చేసి మేము వారి ప్రాణాలను కాపాడుతాం తప్ప వారు రోగాల బారిన పడి మా వద్దకు రావాలని మేము కోరుకోము గదా!  మా దగ్గరకు వచ్చిన వారికే మందు ఇస్తాం తప్ప ఆరోగ్యంగా ఉన్నవారికి అనవసరంగా  మందు ఇవ్వం  కదా! కనుక రోగుల జబ్బును నయం చేసి పంపడం మా కర్తవ్యం. వారి ప్రాణాలు నిలబడితేనే మాపై నమ్మకంతో ఇతర రోగులు  వస్తారు.  వారిని శక్తివంచన లేకుండా కాపాడే ప్రయత్నం చేస్తాం .ఇందులో మాకు శత్రువులనీ, మిత్రులు అనీ,  బంధువులనెడి  వివక్షకు తావులేదు.మాకు  అందరూ సమానులే .అందరూ మంచిగా ఉండాలని మేము కూడా మీ  వలెనే కోరుకుంటాం. అందువల్ల మీరు అన్న' లోకా సమస్తా సుఖినోభవంతు' అన్నది మాకు కూడా వర్తిస్తుంది .మీరు అందరిని సుఖంగా ఉండాలని కోరుకుంటే మేము అనారోగ్యంగా ఉన్న వారిని కూడా ఆరోగ్యవంతులుగా చేసి వారు కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటాం .తద్వారా మీరు కోరుకునే దానికి మేము కూడా పరోక్షంగా
తోడ్పడుతున్నాము. అందుకే పెద్దలు మమ్ములను విష్ణువుతో పోల్చారు. ఇది మీకు తెలియనిది కాదు గదా !"అని వివరించాడు .
       ఆ మాటలకు పేరిశాస్త్రి అపోహలు తొలగి పూజకు రావడానికి అంగీకరించాడు .అతడు పూజ చేస్తుండగానే క్రిందపడి స్పృహను కోల్పోతే రామశర్మనే మందు ఇచ్చి అతనిని రక్షించాడు.


కామెంట్‌లు