--సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,ధర్మపురి. మొబైల్: 9908554535.


 ఊత పదం తెచ్చిన తంటా


        పద్మాపురం అను గ్రామంలో సోమిశెట్టి అనే వ్యాపారి ఉండేవాడు.  అతడు మహా పిసినారి. అంతేకాదు .అతడు తనకు లాభం లేనిదీ ఎటువంటి పని చెయ్యడు. అతని ఊత పదం" బుద్ధి లేదా" .

      ఆ గ్రామంలోనే రంగడు అనే యువకుడు ఉండేవాడు. వాడు ఆకతాయి .రంగడు సోమిశెట్టి దుకాణంలో నుండే   సరకులు  తీసుకొని వెళ్ళేవాడు. కానీ అప్పుడప్పుడు సోమిశెట్టితో  గొడవ పడుతూ ఉండేవాడు.

       ఇది ఇలా ఉండగా ఒకరోజు సోమిశెట్టి  రంగనితో

" డబ్బు చక్కగా కట్టకపోతే  సరకులు ఇవ్వను" అని అన్నాడు. దీంతో మాటా మాటా పెరిగి రంగడు సోమిశెట్టిని " ఏయ్ పిసినారీ! నాకు సరకులు ఇవ్వకుంటే ఎవరికి ఇస్తావు" అని అన్నాడు. దాంతో సోమిశెట్టి కోపంతో న్యాయాధికారికి రంగడు  తనను పిసినారి అన్నాడని చెప్పాడు .న్యాయాధికారి రంగడిని పిలిపించి  ఆ మాట అన్నందుకు వంద రూపాయల జరిమానాను విధించాడు. రంగడు విధిలేక ఆ జరిమానాను చెల్లించాడు.  అంతేకాదు .సరకుల కొరకై అతడు సోమిశెట్టిని బ్రతిమిలాడవలసి వచ్చింది. అప్పటినుండి రంగడు సోమిశెట్టితో బుద్ధిగా ఉండ సాగాడు .

      ఒకరోజు సోమిశెట్టి రంగడికి సరుకులు ఇస్తూ" నీకు బుద్ధి లేదా! ఏదన్నా పని చేసుకో రాదు "అని అన్నాడు. వెంటనే రంగడు "అదిగో !నన్ను బుద్ధి లేదా అని అంటావా" !అంటూ న్యాయాధికారికి ఫిర్యాదు చేశాడు. అతడు సోమిశెట్టిని పిలిపించి  జరిమానా వేసి ఇక ముందు ఎప్పుడూ  "బుద్ధి లేదా" అని అన్నా వంద రూపాయలు జరిమానా కట్టాలని ఆదేశించాడు. సోమిశెట్టి అది తన ఊత పదం  అని తెలిపినా ప్రయోజనం లేకపోయింది. సోమిశెట్టి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది .ఎందుకంటే ఈ ఊత పదం తాను రోజుకు యాభై  సార్లు అంటుంటాడు. మాట మాటకు తనకు ఈ ఊత పదమే వస్తున్నది. తాను ఎంత జాగ్రత్త పడ్డా "బుద్ధి లేదా" అన్నమాట అనకుండా ఉండలేక పోతున్నాడు. అలా సోమిశెట్టి  రంగనికి జరిమానా చెల్లించి తన ఊత పదానికి క్షమించమని వేడుకున్నాడు. కానీ రంగడు ఒప్పుకోలేదు. "ఒక్కసారి పిసినారి అన్నందుకు వంద రూపాయలు  వసూలు చేస్తావా !నీవు "బుద్ధి లేదా "అన్నప్పుడల్లా నాకు జరిమానా కట్టాల్సిందే "అని అన్నాడు .చేసేదిలేక సోమిశెట్టి రంగడికి రోజూ కొంత డబ్బును  జరిమానా క్రింద చెల్లించ సాగాడు .ఊత పదం కారణంగా కొద్ది రోజులకే సోమిశెట్టి బాకీ ముట్టి పోవడమే కాకుండా రంగడికి హాయిగా రోజులు గడవ సాగాయి. అతడు సోమిశెట్టికి డబ్బు కట్టే అవసరం రానేలేదు. పైగా సోమిశెట్టే రంగడికి  బాకీపడవలసి వచ్చింది .ఆ గ్రామంలోని వారు పిసినారికి తగిన శాస్తి రంగడు చేశాడని చెప్పుకోవడం  మొదలుపెట్టారు.


కామెంట్‌లు