రత్నపురిని ఏలే రాజు సింహ దత్తుడు చాలా జిజ్ఞాస కలవాడు. అనేక విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి అతనికి ఉండేది .
ఒకసారి అతని ఆస్థానానికి గురు పాదుడు అనే యోగి పుంగవుడు వచ్చాడు.రాజు అతనికి ఆతిథ్య మిచ్చి "అన్నింటి కంటే గొప్పది ఏది? "అని అడిగాడు.గురుపాదుడు "ప్రాణం" అని అన్నాడు.అయితే అన్ని ప్రాణులు గొప్పవే కదా"అని అన్నాడు రాజు." కాదు మహారాజా!మనిషి ప్రాణమే గొప్ప"అని అన్నాడు యోగి." అదేమిటి ? అన్నీ ప్రాణులకు ప్రాణం ఉంది కదా. కేవలం మనిషి ప్రాణమే గొప్పనా ఏమిటి? నేను నమ్మను "అని అన్నాడు రాజు. "అవును మహారాజా ! మనిషి ప్రాణమే అత్యంత విలువైనది "అని అన్నాడు యోగి. అందుకు రాజు అంగీకరించలేదు. " మీరు నిరూపిస్తారా "అని అన్నాడు రాజు." అవును మహారాజా! నిరూపించి తీరుతాను .కానీ మీరు నాతో మారువేషంలో రావాలి "అని అన్నాడు యోగి. సరేనన్నాడు రాజు .
ఇద్దరూ కలిసి మిట్టమధ్యాహ్నం వారసంతకు మారువేషంలో వెళ్లారు .అక్కడ ఒక వ్యక్తి వారి కళ్ళముందే ఒక బరువైన తూకం రాయితో ఒక మేకను గట్టిగా కొట్టాడు .ఆ రాయి ఆ మేకకు తిన్నగా తగిలి అంతటితో ఆగకుండా ప్రక్కనే ఉన్న ఒక బాలుడి తలకు గట్టిగా తగిలింది .బాలుడి తల నుండి కొద్దిగా రక్తం కారసాగింది. వెంటనే అక్కడి ప్రజలు ఆ బాలుడిని ఎత్తుకొని వైద్యుని వద్దకు తీసుకొని వెళ్లారు. మేకకు కూడా చాలా దెబ్బ తాకింది .అది బాధతో అరుస్తున్నది.
అప్పుడు యోగి "చూశారా మహారాజా! ఆ బాలుడికి దాకిన దెబ్బ రెండవ సారి మాత్రమే. మొదటి సారి గట్టిగా దెబ్బ తాకిన మేకను వదిలి వారు బాలుడిని కాపాడాలని ప్రయత్నం చేశారు. మేకది కూడా ప్రాణమే కదా! అది మూగ జీవి. దాని గురించి ఎవరూ ఆలోచించడం లేదు. అందరూ బాలుని గురించి ఆరాటపడుతున్నారు .అందువల్లనే మనిషి ప్రాణమే అత్యంత విలువైనది" అని చెబుతున్నాను అని అన్నాడు యోగి. రాజు అంగీకరించక తప్పలేదు.
రాజు గురుపాదుని తన ఆస్థానంలోనికి తీసుకొని వెళ్లి ఘనంగా సత్కరించాడు .అంతేకాకుండా రాజ్యం లోని ప్రాణులను హింసించ వద్దని ఆదేశించాడు. అతడు చూపిన భూత దయ వల్ల పశుపక్ష్యాదులు స్వేచ్ఛగా జీవించాయి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి