వృక్షవిలాపం(వచనకవిత):-డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.

 పరోపకారార్థ మిదం శరీరమ్ అని వృక్షాలు
తలెత్తుకొని నిల్చున్నాయి.
తరతరాలుగా తరగని సంపదని‌ మనకు నిర్విరామంగా అందిస్తున్నాయి.
కాసింతచోటు,రవ్వంత ఊతం,
పిసరంత ప్రేమ,చాలినంత నీరు కోరుతున్నాయి.
స్వార్థం లేని జీవనంతో భువిని స్వర్గమే చేస్తున్నాయి చెట్లు
బతికినంతకాలం బరువు కాకుండా,కాలం చెల్లినా,
బ్రతుకుకు ఊపిరిపోస్తున్నాయి.
కన్నతల్లిలా,కల్పవృక్షంలా,
కామధేనువులా,మనం కాటేసినా బ్రతికిస్తున్నాయి.
ఎడారి కాకుండా,నిలువనీడలై
ధరణిని కాపాడుతూ,
పునీతలవుతున్నాయి‌.
ఓ మనిషి మేలుకో!
చెట్ల విలువ తెలుసుకో!
కాలుష్యపుకోరల నుండి నిను రక్షించే వృక్షదేవతలను విరివిగా నాటు!
చేసుకోకు నీకు నీవు చేటు!
విలపింపనీయకు నీ తర్వాతి తరాలను!
ప్రాణవాయువులనిచ్చి,అండగా నీకుండి,నిన్ను ఎల్లప్పటికీ కాపాడే చెట్లు
తమను కాపాడమంటున్నాయి.
అమృతం నీకు ఇస్తామంటున్నాయి.
నీవు విషమే చిమ్మినా,
నిలువునా చీల్చినా,నీకే నా జీవితం అంకితమంటున్నాయి.
షరాబుగా ఖరీదు కడితే
నిన్ను పునాదుల నుండి పెకిలిస్తే
నీ అజ్ఞానాన్ని చూసి నవ్వుకుంటున్నాయి.
మానవతనే కోరుకుంటున్నాయి
కామెంట్‌లు