దురదృష్ట వశాత్తు మనలో చాలామందికి ప్రతీ దానిని నిష్పత్తులలో చూడటం బాగా అలవాటై పోయింది. ఎందుకంటే, 'ప్రజాస్వామ్యం' కదా! అందులో మనది అత్యంత సుస్థిరమైన, ఘనమైన, లిఖిత రాజ్యాంగ బద్ధమైన పకడ్బందీ పాలనాధికార వ్యవస్థ. ఇక్కడ లెక్కలు, ఇంకా మాట్లాడితే సాక్ష్యాలే ముఖ్యం. మానవత్వం, ప్రేమ, మమకారం, భావోద్వేగాలు ఇంకా విశ్వాసాలు అన్నీ ఆ తర్వాతే. మారు మాట్లాడితే ఇవన్నీ అప్రధానమై పోతాయి. ఈ ఆధునిక సమాజంలో ఇంత కఠినంగా, నిర్మొహమాటంగా మాట్లాడవలసి వస్తున్నందుకు వ్యక్తిగతంగా నాకు చాలా బాధగానే కాదు, సిగ్గుగాను ఉంది. దయచేసి ఈ అక్షరాల వెనుక ఉన్న దయనీయ, నిస్సహాయ స్థితిని అర్థం చేసుకోవలసిందిగా అందరినీ వేడుకొంటున్నాను.
కిందటడాది ప్రపంచ వ్యాప్తంగానే కరోనా కేసులు కోటికి, మరణాలు వేలకు చేరితేనే 'అయ్యో' అని అందరం పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్నాం. ప్రధాన కారణమైన చైనా దేశాన్ని, అంటువ్యాధికి వాహకులుగా పనిచేసే ప్రతీ ఒక్కరినీ దోషులుగా పరిగణించాం. జాతీయ, అంతర్జాతీయ, ఇంకా మానవీయ స్ఫూర్తితో మన భారతీయ కేంద్ర, అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు స్వీయ లాక్ డౌన్ వంటి ముందుజాగ్రత్త చర్యలకు తాము ఉపక్రమిస్తూ కోట్లాదిమంది ప్రజలను ఆ దిశగా ప్రేరేపించాయి. అమాయక ప్రజానీకాన్ని మానసికంగానూ బాగా సంసిద్ధులను చేశాయి.
కానీ, ఈ రెండో సంవత్సరం, రెండో దశగా భావిస్తున్న ఈ నేపథ్యంలో ఒక్క మన భారత దేశమే అత్యధిక కరోనా బాధిత దేశంగా పరిణమించింది. కేవలం మన దేశంలోనే కరోనా కేసులు కోట్లలోకి, మరణాలు వేలలోకి (అధికారికంగానే. అనధికార లెక్కలు ఇంతకు ఎన్ని రెట్లో) ఎగబాకుతున్న వార్తలు వింటున్నాం. క్షణక్షణం, రోజురోజుకూ పరిస్థితి విషమిస్తున్నదే తప్ప మందగిస్తున్న దాఖలాలు కొంచెమైనా కనిపించడం లేదు. ప్రపంచంలోనే రెండో అత్యధిక జనాభాగల దేశంగా, అత్యంత ఉదార, స్వేచ్ఛాయుత స్వాభావిక సమాజంగా గర్వ పడాల్సిన మన పరిస్థితి ఇప్పుడు సిగ్గుపడే స్థాయికి దిగజారింది. కేసులు, మరణాలతో అప్పుడే మూడోదశలోకీ వచ్చేశామన్న వార్తలు వస్తున్నాయి.
క్రమక్రమంగా మనం మనుషుల చావులకు అలవాటు పడుతున్నాం. కరోనా ఒక భారీ ప్రజా 'విపత్తు' స్థాయికి చేరుకున్నది. ఇప్పటికైనా ఇంకా మనం లెక్కలు, నిష్పత్తులు, ఆర్థిక నష్టాలను బేరీజు వేసుకుంటూ కూర్చుంటే, 'లావా' అందరి ఇండ్లలోకీ జొరబడుతుంది. ఎవరినీ వదలదు. దానికి దాయా దాక్షిణ్యాలు ఉండవు. మాస్కులు వంటి జాగ్రత్తలు పాటించడం సరిపోతుందనుకుంటే, మరి, నిరంతరం వాటినే ధరిస్తున్న వారు సైతం ఎందుకు బాధితులవుతున్నారు? కేవలం పది శాతం లోపు కేసులనే తట్టుకోలేని మన ఆరోగ్య, వైద్య సౌకర్యాల వ్యవస్థ రేపు మరింత శృతిమించితే ఏమవుతుంది?
కనీసం ఒక్క నెలో, రెండు నెలలో అయినా మనమంతా ఎవరికి వాళ్ళం, ఎక్కడి వాళ్ళం అక్కడ బతకాలేమా? ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార, వాణిజ్య, కార్పొరేట్ సముదాయాలు వ్యక్తిగత, సంస్థాయుత ఆదాయ వ్యయాలకు అతీతంగా ప్రజలను ఆదుకోలేవా? చేతులు కాలేదాకా చూస్తూ ఊరుకుందామా? 'అత్యవసర ఆరోగ్య పరిస్థితి'ని అధికారికంగా ప్రకటించుకుని తక్షణ రక్షణ చర్యలకు ప్రభుత్వాలు ఉపక్రమించలేవా? అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు ఏం జరిగినా సరే, ఆర్థిక నష్టాలు ఉండకూడదని బీష్మించుకుంటే.. పోతున్న ప్రాణాలు, అడుగంటుతున్న మానవ సంబంధాలు, న్యాయం ధర్మం వంటివన్నీ తిరిగి వస్తాయా? ఇప్పటికైనా ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా మనం మనుషులమని నిరూపించుకుందాం.
ప్రజా 'విపత్తు'ను పట్టించుకుందాం!:-- దోర్బల బాలశేఖర శర్మ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి