*ముద్దుగుమ్మ ఆన్షీ.‌‌.చిలుకపలుకులు*:-రమాదేవి బాలబోయిన హన్మ కొండ .


 తాతయ్యలు మనవలూ, మనవరాళ్ల కి సంబరంగా కొత్త కొత్త డ్రెస్ లు కొనిస్తారు, బోలెడన్ని చాక్లెట్లు,కేకులూ, ఐస్క్రీం లు ఇస్తారు. ఇంకా ఆడుకోవడానికి బొమ్మలు కొనిస్తారు.  కానీ ఈ తాతయ్య డా.కె ఎ ల్.వి.ప్రసాద్ గారు, సాహితీ వారసత్వం గల విలక్షణమైన తాతయ్య కదా! అందుకే  ఏం చేసారో,తెలుసా? తన మనవరాలు ఆన్షీకి ,ఒక అపురూపమైన కానుక ఇచ్చారు. అదే "చిలకపలుకులు" అనే ఈ పుస్తకం. ఇందులో మనవరాలివి మంచి మంచి ఫోజులతో ఉన్న ఫోటోలు కూడా పంచుకున్నారు.

బంగారం,డబ్బూ, సంపదలు దానం చేయడం వల్లో, విలాసాలకు ఖర్చు చేస్తేనో, కొన్ని తరాలు పోయాక నేలమట్టం కావచ్చు కానీ ఈ అక్షరలక్షలు మాత్రం తరతరాలు అందరి గుండెల్లో సురక్షితంగా ఉండాలనే ఆశయంతో అంతేగాక పసిప్రాయంలోనే పిల్లలకు మన బంధాలు, అనుబంధాలు, ఆప్యాయతల తో పాటు మంచి నడవడిక ,చక్కని అలవాట్లు కూడా తెలియజేయాలని సద్భావంతో తన మనవరాలికే గాక, పసిపిల్లలందరికీ అందజేశారు ఈ తాతయ్య.
 పసితనంలో పిల్లలకు నేర్పాల్సిన అంశాలు ఎన్నిటినో ఇందులో పొందుపరుస్తూ ప్రముఖ కార్టూనిస్ట్ "సరసి" గారిచే ప్రత్యేకంగా వేయించిన ముఖచిత్రాన్ని ఈ పుస్తకానికి అందంగా అమర్చారు. ఇంకా లోపలి అంశాలను చూస్తే స్వతహాగా దంత వైద్యులు అవడంతో స్వభావరీత్యా మొదటి కవితను పసిపిల్లల్లో దంతాలు వచ్చేటప్పుడు కనిపించే "సంకేతా"లను సూచించే కవితగా 
పళ్ళొచ్చిన పాపాయి /ముఖం /అందంగా ఉంటుంది!
 నవ్వినప్పుడు/ పలువరుస చూస్తుంటే/ పరమానందమౌవుతుంది.. అంటూ సంబరంగా అంబరాన్ని చుంబించే ఆనందాన్ని వ్యక్తం చేశారు.
 "కరోనా కాలం" పిల్లల స్వేచ్ఛను హరించి ఆడే పాడే బుజ్జాయిలను గృహ బందీలను చేసినపుడు వారు పడే వేదనని ఇలా వ్యక్తం చేశారు. 
ఇంట్లో... /గొడవ అంటారు/ బయటికి /వెళ్లొద్దంటారు!/ రోజంతా/ ఎలా గడిపేది/ ఎప్పటి వరకూ/ఈ నరకం /అనుభవించేది !!
అనే పిల్లలవేదనను తన మాటల్లో చక్కగా వ్యక్తం చేశారు.
అమ్మకు పిల్లల్ని అందంగా  బొమ్మల్లా అలంకరించడాన్ని ఇష్టంగా చెబుతూ... ఆ ముద్దుగుమ్మ, "అందాల బొమ్మ" ఉండగా వేరే బొమ్మ ఎందుకు? అంటూ నవ్వుతుంది అంటూ. మనవరాలి పేచీని ముద్దు ముద్దు గా చెప్పారు.
 తెలుగు భాష పరిమళాల్ని, అమ్మానాన్న పిలుపులోని మకరందాన్ని, "పరిమళం" కవితలో వ్యక్తం చేస్తే... వానలు పల్లెల్లో పడితే మోదం, అదే నగరంలో కురిస్తే ఖేదం అంటూ "నగరంలో వాన" లో, మొక్కలు పెంచాల్సిన ఆవశ్యకత "మొలక" అనే కవితలో... అదేవిధంగా మొలక పత్రికకు కృతజ్ఞతగా కూడా రాశారు. ఇంకా అనారోగ్యకరమైన ఫాస్ట్ఫుడ్స్ తినకూడదనీ, ప్రకృతిని కాపాడాలని, చెట్లు నాటాలనీ కవితలురాసారు. ఆరోగ్యకరమైన అలవాట్లు, ఫలాలపై కవితలు చెప్పారు. ప్లాస్టిక్ వినియోగించకూడదు అంటూ, బంధాలు బంధుత్వాలు కాపాడుకోవలసిన అవసరాన్ని తెలియజేస్తూ..‌. సాంకేతిక విజ్ఞానం పెరగడంతో గతించిపోబోతున్న ఉత్తరము, రేడియో ప్రాముఖ్యతను వివరిస్తూ...వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ను గుర్తుచేస్తూ అందమైన కవితలు రాశారు.. అయితే ఈ పుస్తకం లోని కవితలలో భాష మరియు భావవ్యక్తీకరణలో కవితాత్మకత చూడొద్దంటూ కవి స్వయంగా చెప్పడంతో వాటిని విస్మరించి, అందులోని ఆంతర్యాన్ని మాత్రమే గ్రహిద్దాం. 
ఇక చిట్టచివరిగా రాసిన ఒక పాట... ఈ తాత పుట్టిన ఊరు "దిండి" పై మమకారాన్ని వ్యక్తం చేస్తూ రాసిన పాట"ఏం తాతో ఎల్దామొస్తవా". ఇది చదవగానే పుస్తక ముగింపు చాలా ఎనర్జిటిక్గా మార్చేసి ఇంకా రాస్తావా ...ఇంకా నేర్పవూ...అంటూ మనవరాళ్ళూ, మనవళ్ళూ కోరే విధంగా అందమైన "చిలుక పలుకులు"ను మన ముందుకు తీసుకువచ్చి...ఇంకా ఇలాంటి ఎన్నో పుస్తకాలు వెలువడాలి అనేటువంటి ఉత్సాహాన్ని నింపారు డాక్టర్ కె ఎల్ వి ప్రసాద్ గారు. పిల్లలందరూ చదవాల్సిన చక్కని పుస్తకానికీ, తాతా మనవరాళ్ళకీ అభినందనలతో ....