పెద్దలు జాన్సీ మేడమ్ గారు రచించి నాకు అందించిన విరోధాభాస పై సమీక్ష అంటే అది నా తాహతుకి మించినది. కానీ ఈ నవల మొదటినుంచి చివరివరకు చదివిన పాఠకుడిగా పరిశీలన మొదలు పెట్టిన నేను గమనించిన కొన్ని విషయాలు----
ఇది పుస్తకమా? లేక నిత్యజీవితంలో మన చుట్టూ తారసిల్లే భిన్న రకాల వ్యక్తుల సమూహమా? అని నన్ను నవల చదువుతున్నంత సేపు ఎన్నిరకాలుగ ప్రశ్నించుకున్నానో నాకే తెలియని స్ధితి. నవల ప్రారంభంలో జాన్సీగారు చెప్పినట్లు నవల చదువుతూ కొంచెం సేపు ఆపితే మన పాత విషయాలు కొన్ని కళ్ళముందు మెదలాలి ఆ కాస్తసమయంలో అన్న వారి మాట అక్షర సత్యం. అసలు ప్రేమ అనే పాశాన్ని ఇన్నిరకాలుగా వర్ణించవచ్చా? అనే విషయం ప్రీతం వ్యక్తిత్వంలో చాలా బాగ వివరించారు. ప్రీతం వ్యక్తిత్వంలో నిర్లక్ష్యం అనేది స్పష్టంగా వర్ణించారు మేడమ్ . వివాహబంధం అనేది ఒక బంధనం లా బావించే ప్రీతం లాంటి వ్యక్తులు, I want my own space అనుకునే పురుష పుంగవులు మనకు నిత్యమూ తారసిల్లే వ్యక్తులే. పోయిన తరువాత కానీ తెలియదు ఉన్న బంధం విలువ అనే మాటకు ప్రీతం వర్ఙీనియా ప్రయాణంలో ఎంత నరకయాతన అనుభవించిఉంటాడో చాలా సులభంగా అర్ధమవుతుంది. అయితే ప్రేమను మనుషులకే కాదు మూగజీవాలకూ పంచవచ్చు అనే విషయాన్ని రచయిత్రిగారు తన రచన ద్వారా చాలా విపులంగా వివరించారు. అలాగే అన్య తండ్రి ప్రేమకోసం పరితపించేప్పుడు ప్రీతంను మరపించేలా ప్రేమను పంచాలి. నేను మీనాను చూడడంలేదా అని ధీరజ అడిగితే నీ అంత అనుభవం ఓపిక నాకు లేవమ్మా అని ప్రీతి విలపించడం, ఎంత డాక్టరైనా జీవిత పుస్తకం చదవనిదే జీవితంలో సఫలికృతులు కాలేరు అనేదానికి చిన్న ఉదాహరణ. అన్యను కలవడంకోసం ప్రీతం చూసే ఎదురుచూపులోని ప్రేమను గంటలలో వర్ణించిన తీరు హృద్యంగా ఉంది. అక్కడే రచయిత్రిగారు ప్రీతం ఎడబాటును వర్ణించిన తీరును కళ్ళలో నీరు తిరిగేలా చేసింది. ఇక ధీరజ, సిద్దూ, విక్రం పాత్రలు ఎంత వర్ణించినా తక్కువే. ముగింపు చాలా హుందాగా ఇచ్చారు మేడంగారు. అదే చివరిలో ధీరజను సిద్దూ కలపకపోవడం. లేకుంటే నిర్మల తటాకంపై రాయి విసిరిన చందాన సిద్దూ జీవితం అల్లకల్లోలమయ్యేది.బిడ్డలకు తండ్రిస్ధానం పరిపూర్ణమైనప్పుడే భర్తగా నా స్ధానం అని హుందాగా పలికిన విక్రం పలుకులు ఆహ్వానించతగ్గవి. అందుకే ఆ నిబద్దతకు కట్టుబడిన విక్రం వ్యక్తిత్వానికి ప్రకృతి కూడ పరవశించి వారిద్దరిని ఒకటయ్యేలా చేసి, ధీరజ గుండెభారం తగ్గేలా సాగిన మేడమ్ రచనకు ఇక మాటల్లేవు. ఇందులో పాత్రలు కల్పితాలే కావచ్చు. కానీ జీవితం ఆడిందే ఆటగా, పాడిందే పాటగా ఉండదు అనేందుకు ప్రీతం జీవితాన్ని విడమర్చి చెప్పడంలో మేడమ్ గారు విజయవంతమయ్యారు. అలాగే చివరన అతనిలో భోగత్వం మాయమై యోగత్వం వచ్చింది అని చెప్పడం ప్రతి వ్యక్తిలో ద్వంద్వ పార్శ్వాలను సృసించినట్లు కనిపిస్తుంది.ధీరజను పునఃవివాహం విషయం ఆలోచించండి ఆంటీ అని అభ్యర్ధించి వ్యక్తిత్వాన్ని పెంచుకున్న ప్రీతం, ఎన్ని జంటలు విడిపోయి కలవడం లేదు ఆంటీ అనే మాటతో జీవితాన్ని అపహాస్యం చేసిన వ్యక్తిగా ధీరజ దృష్టిలో మిగిలిపోయాడు. ఎంత పాశ్చాత్యమైనా నడిచేది నేలమీదే, అన్న నగ్నసత్యం ప్రీతం వ్యక్తిత్వంలో తెలిపి, ప్రీతం రెండో పెళ్ళి చేసుకున్నది తనకు మంచివార్తే అలాగైనా అతని జీవితం గాటిన పడుతుందనే ప్రీతి మాటలు భారతీయ స్త్రీల వ్యక్తిత్వాన్ని బహిర్గతం చేసింది అనడంలో సందేహమే లేదు. అన్ని పాత్రలను అధ్బుతంగా మలచిన మేడమ్ గారికి వినమ్ర నమస్కారం. అటువంటి పుస్తకాన్ని చదివే అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదములు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి