"నేను ముంబైకర్ ని..! దీర్ఘ కవిత. :-కూకట్ల తిరుపతి, కరీంనగర్.

 ఆత్మీయ మిత్రులు సంగెవేని రవీంద్ర రచన ఇది. రవీంద్ర బాల్యదశలోనే ముంబైకి వలసవెళ్ళిన తెలంగాణ బిడ్డ. చైతన్యవంతమైన కవి. జీవితానుభవాల నుండే కవిత్వాన్ని నిండుగా పండిస్తున్న అక్షర కృషీవలుడు. ఇప్పటికి 16 పుస్తకాలు రచించారు. అన్నీ అపురూపమైనవే. 
ఈ పొత్తం దీర్ఘ కవిత ప్రక్రియకు చెందింది. ఇందులో ముంబై వలస కార్మికుల వేదన ఉంది. ముంబై మహా నగర నిర్మాణంలో అద్వితీయమైన మనవారి పాత్ర వివరించబడింది. మూడు తరాలకు చెందిన వలస కార్మికుల కష్టాలు, కడగండ్లను హృద్యంగా వివరించారు. అనిర్వచనీయమైన కష్టజీవుల కృషిని కవి కళ్ళకు కట్టినట్టు అక్షరీకరించారు. అక్కడికి బతకడానికి పోయిన మనవారు ఆ ప్రాంత భాషను, సంస్కృతీ సంప్రదాయాలను గౌరవించిన తీరును, వాటిని ప్రేమతో అక్కున చేర్చుకున్న వైనాన్ని బొమ్మ కట్టించారు. వారు ఆ మట్టి మీద పెంచుకున్న మమకారం చాలా గొప్పది. 
వలస పిట్టలకు నీడ నిచ్చిన చెట్టును కన్నతల్లిగా భావించి, ఆ తల్లి జ్ఞాపకాలను కలకాలం మదిలో పదిల పరుచుకున్న విధానాన్ని లోకమంతటికి అక్షరాల తెలిసేలా వివరించిన కవి సంగెవేని రవన్న అభినందనీయులు.
మీ సోపతి
కూకట్ల తిరుపతి, కరీంనగర్.