బూడిద గుమ్మడి-బాల గేయం :--ఎం. వి. ఉమాదేవి నెల్లూరు

గుమ్మాడమ్మా గుమ్మాడి 
దొడ్లో బూడిద గుమ్మాడి 
కుండాలంతా కాయలు 
కాసిందమ్మా గుమ్మాడి 

బాయీ పక్కన పాదమ్మా 
పాదూ నిండా పూతమ్మా 
పెద్దా పండగ గొబ్బిళ్లు 
పసుపూ పూలు చెల్లమ్మా !

బుజ్జీ పిందెలు వచ్చాయి 
ఆకుల కింద దాగాయి 
వేసిన  అమ్మే చూసింది 
చాలా సంబర మయ్యింది!

లేత కాయలు చూసారు 
ఊర్లో వాళ్ళు అడిగారు 
తలోకాయ ఇచ్చాము 
సాంబార్ , హల్వా తిన్నాము!

ఎండాకాలం వచ్చిందీ 
 గుమ్మడి పాదు ఎండిందీ 
కాయలు అన్నీ తొలిగించీ 
కాళ్లు తగలని అటకలపై !

మినప్పప్పు నానబోసీ  
బూడిద గుమ్మడి తురిమేసీ 
ముందేరాత్రి మూటకట్టీ 
పళ్లెంలోను బరువుపెట్టీ !

పొద్దునలేచి రుబ్బామూ 
ఉప్పూ,జిలకర కలిపామూ 
మంచిఎండలో మంచంపై 
పంచెపై వడియాల్ పెట్టాము!

పచ్చి వడియాలు వేయించీ  
అన్నములోకి తిన్నామూ 
గలగల వడియాలు ఎండాయీ 
వొలిస్తే సులువుగ వచ్చాయీ!

డబ్బాల్లోకి సర్దేసాము 
ఇరుగూ పొరుగుకు కొన్నిచ్చాం 
కూరలు దొరకనివర్షాకాలము
పప్పు చారులోనంజుడు కిష్టం!