అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు: - రామ్మోహన్ రావు తుమ్మూరి
శ్రీమద్రామాలయమున
నేమము శ్రీరామనవమి నేటేటగు మా
రాముడు కరుణాధాముడు
నా మనమున నుండి గాచు నన్నెల్లపుడున్

శ్రీరామనవమి పండుగ
మా రామాలయమునందు మాన్యత శ్రీ సీ
తారాముల కల్యాణము
ఏమారక జూచినట్టి దెప్పటి స్మృతియో

శివునికి రాముడు బ్రియుడట
ప్రవిమలమగు రామనామ రతుడని వినమే
శివునికి గలదొక గుడియట
పవనాత్మజు రాతిబొమ్మయును బరగెనటన్

నా చిన్నతనము నందున
ఆచిన్మయమూర్తి శోభ ఆత్మను నిలువన్
తోచెను రాముడు మనలను
బ్రోచెడివాడనెడు మాట బుద్ధికి యపుడే

నా రాముడు గుణధాముడు
ప్రేరణనందించు మిగుల ప్రేమను జూపున్
కారణమతడే నతడోం
కారమునకు మూలమటులె కార్యంబతడే

ధరజాత ధవుడు రాముడు
ధరలో గన ధర్మరూపుడుగ ధవళించెన్
సురలోక వినుత శీలుడు
కరమున కోదండధరుడుగా ఖ్యాతి నిలన్

ఊరికి ఎప్పుడు వెడలిన
మారామాలయము జూచి మరలుదునెపుడున్
తారాడుచుండు బాల్యపు
మారాములు, మారాముని మధుర స్మృతులున్