పడమటి సంస్కృత యాగం.: రామ్మోహన్ రావు తుమ్మూరి


 వి.రాజారావు బండారు


              2012 లో న్యూజెర్సీలో  ఉన్న మా అమ్మాయి దగ్గరికి వెళ్లాను. అప్పుడే శ్రీమతులు కాశీనాథుని రాధ,భావరాజు భారతి,వైదేహి శశిధర్ గారలతో  పరిచయం కలగడం  బ్రిడ్జి వాటర్  వేంకటేశ్వర స్వామి దేవాలయంలో  జరిగిన సాహిత్య కార్యక్రమం లో  పాల్గొనే అవకాశం కలిగింది. 


                   అమెరికాలోని  తెలుగు సంఘాల వాళ్లకో  మంచి సంప్రదాయం  అలవడింది, అమెరికాలోని పిల్లల దగ్గరికి వెళ్లిన తల్లిదండ్రుల్లో  ఎవరైనా  సాహితీపరులున్నట్లయితే వారి అనుభవాలను పంచుకోవడం. అలా శ్రీమతి కాశీనాథుని రాధగారు ఓ రోజు నా  ప్రసంగం ఏర్పాటు చేశారు. అది  అభినవ పోతన  డా. వానమామలై  వరదాచార్యుల శతజయంతి సంవత్సరం గనుక,నేను ఆయన పోతన చరిత్రము లోని  భోగినీలాస్యం గురించి మాట్లాడాను.నేను మాట్లాడింది బ్రిడ్జివాటర్  వేంకటేశ్వరాలయం లోని  ఓ తరగతి గది. రాధ గారు వారాంతాల్లో అక్కడి తెలుగు పిల్లలకు తెలుగు  నేర్పుతారు. ఆ రోజు సభకుఓ ఇరవై మంది దాకా హాజరయ్యారు.వాళ్ళంతా ఎంతలేదన్నా ఓ యాభై మైళ్ల కంటే పైనే దూరాలనించి వచ్చారు. నేను నా ప్రసంగం లో  వానమామలై గారి గురించి చెబుతూ  వారి పోతనచరిత్రం పై సిద్ధాంతవ్యాసం  సమర్పించి  కృతకృత్యులైన  ఆచార్యులవారి అంతేవాసి  డా. అందే వెంకటరాజం గారిని  ప్రస్తావించటం జరిగింది.


        ఆ వచ్చిన వారిలో  ఒకాయన  తన విజిటింగ్  కార్డు ఇచ్చి  వీలైనప్పుడు  ఫోన్ చెయ్యండి అని అన్నారు.  తొలి పరిచయంలో  వారిది కరీంనగర్ జిల్లా చొప్పదండి గ్రామమని, అందే వెంకట్ రాజం గారి బంధువని  పేరు హరికిషన్  అని మాత్రం తెలిసింది. ఆ తరువాత  ఫోన్లో మాట్లాడటంతో వారి   గురించి అనేక విషయాలు తెలుసుకోగలిగాను.లీడ్ ఇండియా - 2020  నిర్వాహకులుగా  ఏ.పి.జె. అబ్దుల్ కలాం గారితో కలిసి పని చేసిన వ్యక్తి అని తెలిసి ఆశ్చర్య పోయాను.ఉట్నూరు దగ్గరలో ఆదివాసులకై సకల సౌకర్యాలతో  ఏర్పాటు చేసిన పాఠశాల,తానూ చదువుకున్న చొప్పదండిలో అధునాతన పాఠశాల భవన నిర్మాణము ఇంకా అనేక కార్యక్రమాలను చేపట్టిన  ఆయన  విశ్వ రూపం  తెలిసే సరికి ఆశ్చర్యపోయాను. 


       అంతటి ప్రతిభాశాలి, ప్రజ్ఞాశీలి, అమెరికా లో  మంచి పలుకుబడి గల వ్యక్తి  ఒక మామూలు బడి పంతులుతో  స్పందించిన తీరు ఆ వినయ విధేయతలు,ఆత్మీయత చూసి నేను ఆశ్చర్య చకితుణ్ణి  అయ్యాను,అది ఈ ఇండియాలో మనం చూడం గనుక. ఆ తరువాత ఆయనే  ఒక పని మీద  వి. రాజారావు  బండారు గారి గురించి  తెలియజేసి  మా ఇద్దర్నీ కలుసుకునే  ఏర్పాటు చేశారు. రాజారావు గారి గురించి చెబుతూ  వారు ఇక్కడి వారికి సంస్కృతం  నేర్పిస్తారు  అని మాత్రమే చెప్పారు. వెంటనే  మనకు ఊహల్లోకి వెళ్లి పోవడం  సహజం కదా ! ఆయన కూడా నాలాగే వచ్చిన సంస్కృత  పండితుడయ్యుంటారులే అనుకున్నా. చాలా ఏళ్లయి ఉంటుంది  అమెరికాలో స్థిరపడి  అనిగూడా అనుకున్నా. ఎందుకంటే నన్ను  తీసుకుని వెళ్లడానికి ఆయన కారులో వస్తారు అని చెప్పారు గనుక. 

                   తెల్లవారి అన్న సమయానికి వచ్చారు  రాజారావు గారు.అతి నిరాడంబరంగా  ఓ టీ  షర్టు  ప్యాంటు లో ఉన్నారు. వయసు అరవై పైనే ఉంటుందనిపించింది. ఆరోగ్యంగా ఉన్నారు .పొట్టిగా బట్ట తలతో  ఆయను చూడ గానే ఏ విధంగానూ అంచనా వెయ్య లేక పోవడం నా తప్పు కాదు అది  వారి సంస్కారం. కారులో వెళ్ళేప్పుడు నా అమాయకపు ప్రశ్నలతో కొంత సమాచారం  తెలుసుకోగలిగాను.75 ఏళ్లకు  పైనే వయసు .రూర్కేలాలో  ఐ. ఐ. టి. చేసి,ఆపై ఢిల్లీలో కొన్నాళ్ళు ఉండి,పదేళ్లు లండన్లో  ఆ పై చదువులేవో చదివి,అమెరికా వెళ్లి  ట్రినిటి  పేరుతో సాఫ్ట్ వేర్  కు సంబంధించిన  సంస్థ నెలకొల్పి  పాతిక ముప్పై సంవత్సరాలు దిగ్విజయంగా నడిపించిన పేరొందిన  ప్రొఫెసర్ అని. అంతటి ప్రొఫెసర్తో నాకేదో తెలుగులో కాస్త పాండిత్య మేడిచిందనుకుని  రెండు మూడు మాటలు  మాట్లాడగానే అర్థమయ్యింది,పరువు  దక్కాలంటే  నోరుమూసుకోవాలని. ఇంతకీ మే ఇద్దరం కలిసి వెళ్లింది  న్యూజెర్సీలో కొడుకు దగ్గరికి వచ్చి ఉన్న వడ్డే పల్లి కృష్ణ గారింటికి. 


      నేనూ  రాజారావు గారూ  వడ్డేపల్లి గారింటికి  వెళ్ళాము ఆయన చెప్పిన చిరునామా ప్రకారం. 

కారు దిగగానే  కారు డిక్కీలోంచి రాజారావు గారు రెండు మూడు  సంచులు తీసారు. వాటిలో కొన్ని పుస్తకాలతో పాటు తినుబండారాలు, నీళ్లగ్లాసులు,పేపరు ప్లేట్లూ ఉన్నాయి. అవన్నీ పైకి తీసుకుని  వెళ్ళాము. క్రిష్ణగారు  ఒక్కరే ఉన్నారు. కొడుకు,కోడలు ఉద్యోగాలకు వెళ్లారు.పలకరింపులన్నీ అయిన తరువాత అసలు విషయం గురించి  చర్చించే ముందు,రాజారావు గారు పేపరు ప్లేట్లలో కొన్ని డ్రై ఫ్రూట్స్  సర్ది, గ్లాసుల్లో.......మీరనుకునేవేంకాదు, అచ్చమైన నారింజరసం  పోశారు. ఇవన్నీ ఎందుకండీ అంటే  ఆయన నవ్వుతూ మన వల్ల  ఎవ్వరికీ ఇబ్బంది కలుగ కూడదు కదా అన్నారు. రాజారావు గారు అమెరికాలో స్థిరపడ్డా  అలవాట్లు మాత్రం  అతి ఆరోగ్యకరమైనవి. అచ్చమైన పళ్ల రసాలు తప్ప  కూల్ డ్రింక్స్ కూడా ముట్టరు.ఉదయం గుప్పెడు  డ్రై  ఫ్రూట్స్ ,ఒక రంభా ఫలం(అయన మాటల్లో),ఒక గ్లాసుడు పళ్ల రసం ,మధ్యాహ్నం  ఇంటి వెనుక స్వయంగా పండించుకున్న కూరగాయలతో మితమైన శాకాహారం .అందుకే 75 ఏళ్లు దాటినా  అరవై కూడా అనిపించని  ఆయన్ని చూస్తే ,ఆయనతో మాట్లాడితే అప్రయత్నంగా గౌరవ భావం  కలుగుతుంది.

             ఆయన ఆధునిక ఆధ్యాత్మ యోగి. గీతా శ్లోకాలకు వ్యాకరణ వ్యాఖ్యలు,పాణిని వ్యాకరణ సూత్రాల వివరణ, భారత భాగవత, రామాయణ గీర్వాణాంధ్ర గ్రంధాలలోని  శ్లోకాలు, పద్యాల ధారణ  చూస్తుంటే ఆశ్చర్యపడాల్సిందే.ఇవన్నీ నాకు తరువాత ఆయనతో  చాలా సార్లు కలిసిన తరువాత అవగతమైనవి. ఓసారి పల్లెటూరి లాంటి చోట ఉన్న ఫార్మ్ ల్యాండ్ (వాళ్ల ఇల్లు)కు వెళ్లాను. ఇంటివెనక పెద్ద పెరటి తోట  చూస్తే  అచ్చు ఇండియాలోని అందమైన పల్లెటూరు  గుర్తుకు వస్తుంది. మనసుంటే మార్గముంటుందని  అర్థమయింది. ఆయన తన 50 ఎకరాల  సోయాబీన్ తోట చూపించి ఏ కాపలా లేకుండా,  ఏ పాలేర్లు లేకుండా   నిర్రంధిగా ఎలా పంట తీయవచ్చో చెబుతుంటే  నమ్మలేక పొయ్యాను. ప్రపంచం లోని  ఉత్తమ విద్యార్థులు ఎక్కడ తమ ఉన్నత  విద్యాభాసం గురించి కలలు కంటారో, ఎక్కడ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్  నివసించి ఉద్యోగం చేస్తూ తన పరిశోధనలు సలిపారో  ఆ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన విశ్వవిద్యాలయానికి తీసుకుని వెళ్లి నాకు చూపించిన ఆ పెద్దమనిషికి  నా ఋణం తీర్చుకోలేనిది. 

                                నేను చెప్పదలుచుకున్నది  అమెరికాలో నాకు అదృష్టవశాత్తూ  పరిచయమైనా  గొప్పవాళ్ళ గురించే గనుక శాఖా చంక్రమణం అనుకోవలసిన అవసరం లేదు. మేం ముగ్గురం కలిసి ఓ పుస్తకం తయారుచేయటానికి ఏర్పాటైన  సంప్రదింపుల సమావేశం ఇక్కడ కేవలం ఒక  ప్రస్తావన మాత్రమే.అది ఇప్పనపల్లి గారి  కోరిక మేరకు తెలుగు భాషా బోధిని లాంటి  పుస్తకం తయారు చెయ్యాలని. దాని గురించి  కొంత సేపు మాట్లాడుకుని  తిరిగి బయలుదేరాం నన్ను మా  ఇంట్లో దింపి వెళ్లారురాజారావు గారు.ఆ తరువాత మేమిద్దరమే మూడు నాలుగు సార్లు కలుసుకున్నాం. నేను ఇండియా వచ్చేప్పుడు ఆయనిచ్చిన ఏ 4  సైజు ఒక్కొక్కటి నాలుగైదు వందల పేజీల  సంస్కృత వ్యాకరణ  డి.టి.పి .పుసకాలు నాలుగిచ్చారు. అవి చూసి గుండె ఆగినంత పనయ్యింది. భగవద్గీతలోని ఒక్క శ్లోకానికి దాదాపు 10 పేజీల వ్యాకరణాంశాల వివరణ,పాణిని సూత్రాల అధారంగా. అవన్నీ తెచ్చి మా నారాయణ గౌడు  గారి వద్ద ఉంచాను.  కొంత గాక పోయినా కొంతైనా న్యాయం జరుగుతుందని. 

  రాజారావుగారు వారంలో కొన్ని నియమిత సమయాల్లో ప్రత్యక్షంగా,కొన్నిసమయాల్లో పరోక్షంగా  అంటే ఆన్ లైన్  లో అమెరికావ్యాప్తంగా వున్న సంస్కృతభాషాభ్యసనాభిలాషులకు  సంస్కృతం నేర్పిస్తారు. వారి విద్యార్థుల్లో ఎనభై దాటిన వారు కూడా ఉండటం ,చాలా పెద్ద ఉద్యోగాల్లో ఉన్నవారు కూడా ఉండటం విశేషం .అలాంటి మహానుభావుని పరిచయం గావటం నా పూర్వజన్మ సుకృతం. ఆయనను నాకు పరిచయం చేసిన శ్రీ ఇప్పనపల్లి హరి కిషన్ గారికి నా కృతజ్ఞతలు.