కోపంతో కష్టనష్టాలు నాకే:-- యామిజాల జగదీశ్

 మనం ఎప్పుడూ ఎవరో ఒకరిని విమర్శిస్తుంటాం. ఫలానా వ్యక్తిలో అది లోపం అది లోపం అంటూ ఏవేవో చెప్తుంటాం. కానీ మనలో ఉన్న లోటుపాట్ల గురించి అస్సలు ఆలోచించం. మన గురించి మనం ఆలోచించడం మొదలుపెడితే ఎన్నో సమస్యలు తలెత్తవు. 
ఒకడు మరొకడి దగ్గరకు వెళ్ళి ఎవరెవరి దగ్గర ఎంతెంత ఉంది అని లెక్కలు చెప్పడం మొదలుపెట్టాడు. నిజానికి ఇతనేమీ వారి వారి గురించి అసలు వాస్తవాలు తెలియవు. ఎవరెవరో ఏవేవో చెప్తే ఆ మాటలన్నీ మోసుకొచ్చి చెప్పాడంతే. అతను చెప్పినవన్నీ విన్న వ్యక్తి "సరేగానీ, ఎవరెవరి విషయాలో మనకెందుకుగానీ నీ దగ్గరెంతుంది చెప్తావా అని అడిగాడు. చెప్పలేను అన్నాడివతలి వ్యక్తి. నీ స్థాయేమిటో నీకు తెలీదు గానీ ఇతరుల గురించి నీకెందుకు అనేసరికి ఇతను చిన్నబోయాడు. చిన్నబోవడంసరే కోపమూ వచ్చింది. 
ఈ కోపం ఉంది చూసారు...ఇది మహా డేంజరు. నాకు చీటికీమాటికీ కోపం వస్తుంటుంది. కోపం రావడానికి కారణాలనేకం. 
మనమనుకున్నది జరగకపోతే కోపం వస్తుంది.
మనకిష్టంలేనిది జరిగితే కోపమొస్తుంది. 
మనకిష్టమైన వ్యక్తి మనమనుకున్నదో మనకిచ్చిన మాటో తప్పితే కోపం వస్తుంది. 
ఇలా కోపం రావడానికి కారణాలు ఒకటా రెండా అనేకం....
ఆ మధ్య యూ ట్యూబులో చూసాను....
కన్నతల్లి కొడుకు కారుకి నిప్పు పెట్టింది. కన్నతల్లి ఇలా చేయడమేమిటని అందరు విస్తుపోయారు. కానీ ఆమె ఆ పని చేసిన మాట నిజం. 
కొడుకు కొత్తగా కొన్న కారులో రోజూ తన భార్యను షికారు తీసుకెళ్తుండటం అతని తల్లికి నచ్చలేదు. కోపం పొంగుకొచ్చింది. కారుని తగులబెట్టేసింది.
మరొక సంఘటనలో అక్క చెల్లిని చంపేసింది. ఇంతకూ అక్కకెంత వయస్సో తెలుసా? అయిదేళ్ళు. ఈ పిల్లకు ఓ చెల్లి. ఇంట్లోని వారే కాకుండా ఇంటికొచ్చేవారూ ఇరుగుపొరుగువారూ చిన్నమ్మాయిని తెగ ముద్దాడుతుండటం భరించలేని అయిదేళ్ళ అక్క ఏం చేసిందో తెలీసా? ఆ చిన్నారిని డాబా మీదున్న వాటర్ ట్యాంకులో పడేసింది. దాంతో ఆ చిన్నారి చనిపోయింది.
ఇంకొక సంఘటనలో నడివయస్కుడు ఆఫీసు నుంచి హ రోజూలాగే తన కారుని డ్రైవ్ చేసుకుని ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో గేటు ఎంతసేపటికి ఎవరూ తీయకపోవడంతో అతను కోపంతో కారుని వేగంగా నడిపి గేటుని డీకొట్టి ఆవరణలోకొచ్చిడు. కోపంతో కన్నూమిన్నూ కానక నడపడంతో గేటు పాడవడమేకాక కారు ముందుభాగం ధ్వంసమైంది. కోపం పక్కనపెట్టి తాను కారు నుంచి కిందకు దిగి గేటు తలుపు తీసి కారు నడిపి లోపలకు వచ్చేసుంటే కారు పాడయ్యేది కాదు. 
ఇలా చెప్పుకుంటూ పోతే కోపం గురించి ఎన్నో సంఘటనలుంటాయి. 
పైగా కోపానికి వయస్సుతో సంబంధం లేదు. 
ఏ వయస్సు వారికైనా కోపం రావచ్చని ఇక్కడ ప్రస్తావించిన సంఘటనలతో తెలుసుకోవచ్చు. 
నా విషయానికొస్తే బోలెడన్ని సందర్భాల్లో చిన్న చిన్న విషయాలకు కోపం వచ్చేస్తుంటుంది. కానీ ఆ కోపం ఎక్కువసేపు ఉండకపోయినా అవతలి వ్యక్తిని నొప్పించడం మాటెలా ఉన్నా దానివల్ల ఇద్దరి మధ్య బంధానికి చిల్లు పడుతుందన్నది నిజం. అప్పుడు నష్టం ఎవరికి? నాకేగా. అందుకే కోపం వచ్చినప్పుడు జాగర్తగా ఉండటంకన్నా అసలు కోపమే రాకుండా చూసుకోవడం మంచిదేమో కదూ. నిజమే, అది మంచిదే. కానీ కోపం చేతిలో ఎప్పుడూ నేను ఓడిపోతూనే ఉన్నాను. శేషజీవితంలోనై ఒక్కసారైనా గెలవాలని ఆరాటం. చూడాలి, అనుకున్నది సాధిస్తానేమోనని!!