"కృతజ్ఞత":- ఎం. బిందు మాధవి

 తనపై దయ నుల్కొనఁ గన్
గొన నేతెంచినను శీల గురుమతులను వమ్
దనముగఁ భజింపందగు
మనమలరగ నిదియ విబుధ మతము కుమారా!
ఓ కుమారా! దయతో తనకు మంచి చేయ బూనిన వారిని గౌరవించి, నమస్కరింపుము. వారి మనస్సు సంతోషపడునట్లు చేయుటయే నీవు వారి పట్ల చూపించదగు మర్యాద. పెద్దలనుసరించే మంచి పద్ధతి యిదియే.
*******
"వర్షకి పెళ్ళి అవటం కష్టం అని బంధువులనుకుంటున్నారమ్మా...." అని ఇంకా ఏదో అనబోతూ ఉండగా, "ఎవర్రా ఆ మాట అన్నది" సీతమ్మగారు కొడుకు మాటకడ్డం వచ్చింది.
"బంగారం లాంటి పిల్లకి వంకలెంచటానికి ఎవరికి అంత ధైర్యం? అయినా ఇప్పుడు దానికి వయసేం మించుకు పోయిందని! దాన్ని అర్ధం చేసుకుని నెత్తిన పెట్టుకునే వాడొస్తాడు, చూస్తూ ఉండు" అని కొడుకు మాటని మధ్యలోనే తుంచేసి మనవరాలి బుగ్గలు పుణికి దిష్టి తీసింది.
*****
విశ్వనాధం కాలేజిలో చదివేటప్పుడు, వాళ్ళు విజయవాడ గవర్నర్ పేట లో అద్దెకుండే వారు. పక్క పోర్షన్ లో మురహరి వాళ్ళ కుటుంబం ఉండేది. మురహరికి శార్వాణి అని ఒక కూతురు. పెళ్ళయి భర్తతో ఉత్తరభారత దేశంలో ఉండేది. ఆమెకి ఒక కొడుకు శ్యామ సుందర్. మూడేళ్ళవాడు. సెలవలకి అమ్ముమ్మ గారింటికి వచ్చినప్పుడు, ఎక్కువ భాగం విశ్వనాధం ఇంట్లోనే ఉండేవాడు.
విస్సు ఫైనల్ ఇయర్ లో ఉండగా, మురహరి అకాలంగా గుండె జబ్బుతో చనిపోయాడు. మురహరి భార్య పెద్ద తెలివైనది కాదు. చదువుకోలేదు...ఉద్యోగస్థురాలు కాదు.
మధ్య తరగతి కుటుంబాల్లో యజమాని సంపాదించినంత కాలం ఇల్లు గుట్టుగా, హుందాగా నడుస్తుంది. ఆ ఒక్క వ్యక్తి తప్పుకుంటే, కలిగే లోటు ఇల్లాలికి ప్రాణ సంకటమే! జీవితం నీరు ఎండిపోయిన చెరువులో చేప చందమే!
మురహరి గారి భార్య శారదమ్మ, దొడ్డి వైపు తలుపు కొట్టి "పిన్ని గారూ అల్లుడొచ్చాడు, ఓ రెండొందలుంటే సర్దుబాటు చేస్తే త్వరలో ఇచ్చేస్తాను"....ప్రాణం పోయినంత పనయి అడిగింది.
" కష్టాలు మనుషులకి కాక మానులకొస్తాయా, దిగులు పడకమ్మా; భగవంతుడు దారి చూపిస్తాడు, నిబ్బరంగా ఉండు" అని సీతమ్మగారు కొంగు చాటు చేసి డబ్బు తెచ్చి శారదమ్మ చేతిలో పెట్టింది.
అలా అప్పుడప్పుడు శారదమ్మ సహాయం కోరటం..పెద్ద మనసుతో సీతమ్మ గారు అక్కర తీర్చటం జరుగుతూ ఉండేది.
******
మురహరి కొడుకు అనిరుధ్ ట్యూషన్స్ చెప్పుకుంటూ, బాబాయి సహాయంతో డిగ్రీ పూర్తి చేసి సిఏ కూడా చదివి హైదరాబాద్ లో ఒక అంతర్జాతీయ సంస్థ లో ఉద్యోగంలో చేరాడు.
విస్సు కూడా చదువు పూర్తి చేసి హైదరాబాద్ లో కేంద్ర రక్షణ సంస్థ లో ఉద్యోగంలో చేరాడు. పెళ్ళయింది; భార్య శాంత, పేరుకు తగ్గట్టు శాంత మూర్తి. అత్తగారు సీతమ్మకి తలలో నాలుక లాగా మసులుకుంటుంది.
శాంత విస్సుల కూతురు వర్ష.
ఒక రోజు కాలేజి నించి వస్తుండగా, ఒక చిన్న పిల్లవాడు స్కూల్ బయట ఆటో కింద పడబోతూ ఉండగా వాడిని రక్షించటానికి పరుగెత్తి వర్ష అదే ఆటొ కింద పడింది. కాలు విరిగింది. ఆపరేషన్ చెయ్యటంలో వచ్చిన తేడా వల్ల నడుస్తుంటే కాలు ఎత్తెత్తి వేస్తున్నట్టు ఉంటుంది.
ఇప్పుడు ఆ కారణం వల్లనే వచ్చిన ప్రతి సంబంధం వెనక్కి పోతున్నది.
బామ్మ సీతమ్మగారు మాత్రం ధైర్యంగానే ఉన్నారు.
"మనుషుల్లో స్వార్ధం పెరిగిన మాట నిజమే కానీ, మరీ కాలం అంత పాడయిపోలేదురా! పది మంది మంచి కోరేవాళ్ళం! అవసరమని వచ్చిన వారికి మనకి చేతయినంతలో సహాయమే చేశాం! దేనికయినా కాలంకలిసి రావాలి; ఊరికే దిగులు పడకండి" అని కొడుక్కి కోడలికి ధైర్యం చెబుతూ ఉంటుంది.
*****
"విశ్వనాధం గారిల్లా అండి" అనే ఫోన్ రిసీవ్ చేసుకున్న సీతమ్మ గారు "ఎవరు" అనడిగారు. "మీరు విజయ వాడలో ఉండే వారా అండి" అవతలి గొంతు నిర్ధారించుకునే ప్రయత్నంలో ఉన్నది. "అవునమ్మా, ఇంతకీ మీరెవరు" అనడిగారు మళ్ళీ.
"పిన్ని గారూ నేనండి, శారదని. మీ పక్కింట్లో ఉండే వాళ్ళం! మురహరి గారి భార్యనండి! నిన్న మీ మనవరాలి సంబంధం మ్యాట్రిమొనీ లో చూశాడుట మా శార్వాణి కొడుకు శ్యాము. పిల్ల బాగుంది, అమ్ముమ్మా అన్నాడు. వివరాలు చూస్తే, తండ్రి పేరు విశ్వనాధ్ అని ఉంది. మీరేనేమో అని ఒక ఆశ కలిగింది. అవునో కాదో కనుక్కుందామని ఫోన్ చేశాను" అన్నది.
సీతమ్మగారు కుశల ప్రశ్నలయ్యాక "అమ్మా శారదా పిల్ల బాగుండే మాట నిజమే! ఈ సంవత్సరమే డిగ్రీ పూర్తి అయింది. పెళ్ళి సంబంధం ఎక్కడ కుదురుతుందో తెలియక
ఉద్యోగంలో చేరనివ్వలేదు. పెళ్ళి సంబంధాలు చూసుకునేటప్పుడు నిజాయితీగా ఉండాలి. నిజాలు దాచినా, బయటపడ్డప్పుడు అవి తుఫానులని సృష్టిస్తాయి. మీరు మా ఇంటికి రండి, మాట్లాడుకుందాము. ఇరు పక్షాలకి ఆమోదమయితే అప్పుడు ముందుకెళదాము" అన్నారు.
"పిన్ని గారూ మీరంత ఇదిగా చెప్పాలా? అసలు మీ పిల్ల పెళ్ళికి ఉందని తెలియగానే నేనెంతో ఆనదించాను. మీ గురించి నాకు తెలియదా? ఎడ్రెస్ ఇవ్వండి రేపు వచ్చి మిమ్మల్నందరినీ కలుస్తాను. చూసి చాలా రోజులయింది" అని శారద అప్పటికి సంభాషణ ముగించింది.
******
మధ్యాహ్నం నాలుగింటికి అనిరుధ్, శారద విస్సు వాళ్ళింటికి వచ్చారు. తన పుట్టింటికొచ్చినంత ఆనందంగా ఇల్లంతా కలయ తిరుగుతూ గల గలా మాత్లాడుతున్నది శారద.
మేడ మీద గదిలో నిద్రపోతున్న వర్ష, కొత్త గొంతుల అలికిడికి మెలకువ వచ్చి మెట్లు
దిగి కిందికొచ్చింది. వర్షని చూసిన శారద కళ్ళల్లో ఆనందంతో కూడిన మెరుపు. కానీ వర్ష నడక ఆమె దృష్టి దాటి పోలేదు.
"మీ నాన్న చిన్నప్పుడు వీళ్ళు, మేము విజయవాడలో పక్క పక్క ఇళ్ళల్లో ఉండే వారం. నిన్న మ్యాట్రిమొనీలో వీరి మనవడు శ్యాము నీ ఫొటో చూశాడుట. ఈ రోజుల్లో కూడా చదువు అవ్వగానే పెద్ద వాళ్ళు ఆగమన్నారని ఉద్యోగంలో చేరకుండా ఉన్న అమ్మాయి అంటే ఏదో ప్రత్యేకత ఉన్నది. నేను ఆ అమ్మాయినే చేసుకుంటానని, ఈమెని కనుక్కు రమ్మన్నాడుట" అని సీతమ్మ గారు పరిచయ వాక్యాలు ముగించగానే, బామ్మా మంచినీళ్ళు తెస్తా అని లోపలికి వెళ్ళింది వర్ష.
"చూశావు కదమ్మా, కొంచెం కుంటుతున్నట్టు నడుస్తుంది. పుటక లోపం కాదు. ఒక యాక్సిడెంట్ లో చిన్న పిల్లవాడిని తప్పించబోయి ఆటో కింద పడింది. ఎన్ని సుగుణాలున్నా...జనాలు భౌతిక అందానికి ఇచ్చిన ప్రాధాన్యత మిగిలిన వాటికివ్వరు కదా" అన్నారు.
"భలే వారే పిన్ని గారూ. మీ గురించి, మీ కుటుంబం గురించి తెలిసిన వారు అలా అనుకోగలరా? మీరు ఎన్నో సార్లు నిస్వార్ధం గా చేసిన సహాయం వల్ల మేము ఇంత వాళ్ళమయ్యాము. మాకు ఆ ఋణం తీర్చుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది. మేమేదో రాజీ పడుతున్నాం అనుకోకండి. మీ మంచితనం, నిస్వార్ధ చింతన మీ మనవరాలికి వారసత్వంగా వచ్చాయని ఆ అమ్మాయి పరాయి పిల్లవాడిని రక్షించటానికి సిద్ధమవటాన్ని బట్టి తెలుస్తున్నది."
"మా శ్యాము ని మీరు చిన్నప్పుడు చూశారు. వాడు ఇప్పుడు "టీసీఎస్" లో వైస్ ప్రెసిడెంట్ గా చేస్తున్నాడు. వాళ్ళమ్మ వాడి పెళ్ళి బాధ్యత నా మీద పెట్టింది. వచ్చే ఆదివారం మేమందరం వస్తాము. మీరు కూడా వాడిని చుసినట్టుంటుంది."
"శార్వాణి వాళ్ళు బరోడాలో ఉంటున్నారు. నిశ్చితార్ధానికి వస్తారు. మా అబ్బాయి అనిరుధ్ ఇక్కడ "హెచ్ఎస్ బిసి" లో పని చేస్తున్నాడు. వాడికి ఒక కూతురు, కొడుకు. ఆ మనవడికి మీ మనవరాలు దొరికినట్లే వీడి పిల్లలకి కూడా మీ లాంటి ఒక మంచి కుటుంబంలో పిల్లలు దొరకాలని ఆశీర్వదించండి" అని వంగి పాదాభివందనం చేసింది.

"తనపై దయ నుల్కొనఁ గన్
గొన నేతెంచినను శీల గురుమతులను వమ్
దనముగఁ భజింపందగు
మనమలరగ నిదియ విబుధ మతము కుమారా!"
"అని కుమార శతకం లో చెప్పినట్లు, మన ఆలోచన, ప్రవర్తనే మన భవిష్యత్తుకి పెట్టుబడి అన్నట్లు, మన శ్యాము చిన్నప్పుడు విజయవాడలో మన పక్కింట్లో ఉన్న విశ్వనాధ్ గారి అమ్మాయినే ఇప్పుడు మాట్రిమొనీ లో చూసి ఇష్టపడ్డాడు. ఇప్పుడే వాళ్ళింటికి వెళ్ళొస్తున్నాను. మనం వారికి కృతజ్ఞతలు తెలియ చెయ్యాలనే కాదు, పిల్ల కూడా బుద్ధిమంతురాలు. అత్త మామలతో బాగా కలిసిపోతుందనిపించింది" అని కూతురికి ఫోన్ చేసి చెప్పి నిశ్చితార్ధానికి తరలి రమ్మని చెప్పింది శారదమ్మ.
******
పెళ్ళయి ఏకాంతంగా ఉన్నప్పుడు, "మీరు నిజంగా అన్ని విధాలుగా ఇష్టపడే నన్ను చేసుకున్నారా? లేక మీ అమ్ముమ్మగారు చెప్పారని చేసుకున్నారా" అనడిగింది వర్ష.
"నీ ఫొటో చూడగానే నాకెందుకో నువ్వు స్పెషల్ అనిపించింది. నిజం చెప్పాలంటే, మీ వాళ్ళు కింద నీ గురించి తెలిపిన వివరాలు పూర్తిగా చదవలేదు. అయినా నా మనసు నాకు సరయిన మార్గ నిర్దేశమే చేసింది. చదువులు, ఉద్యోగాలు, లక్షల సంపాదన ఇప్పుడు కామన్ అయిపోయింది. వ్యక్తిత్వం, ఇతరుల పట్ల ప్రేమ..అక్కర అందరికీ ఉండవు. నేను అవి కోరుకున్నాను. పరిచయం అయితే కానీ అలాంటివి తెలియవు. మన అదృష్టం, మన పెద్దలకి పూర్వ పరిచయం ఉండటం..వారు ఒకరినొకరు గౌరవించుకోవటం, కాదంటావా" వర్ష చేతిలో ఆప్యాయంగా చెయ్యి వేశాడు.
అర్ధం చేసుకో గలిగిన భర్త వచ్చినందుకు, బామ్మ నమ్మకం వృధా కానందుకు వర్ష సంతోషించింది.