తేనెలొలుకు తెలుగు-: రామ్మోహన్ రావు తుమ్మూరి

 ఇప్పుడు మన భాష ఎప్పుడు పుట్టింది.ఎట్ల పుట్టింది.ఎంతమందికి మన భాష తెలుసు.అందరు ఒక్కతీర్గనే మాట్లాడుతున్నరా.ఎందుకు మాట్లాడుతలేరు.భాషలో యాసలెందుకున్నయ్అవ్వి ఎట్లెట్ట ఉన్నయ్.పాటలేంది.పద్యాలేంది.
సామెతలేంటియి శాస్త్రాలేంటియి.అసలు భాషెందుకు నేర్వాలె.మనకు భాష ఎట్ల వస్తది.ఎంతమంది మాట్లాడేటోళ్లున్నరు.గివన్నీ ప్రశ్నలు మనముందర కనిపిస్తయి.గవన్నిటి గురించి తెలుసుకోవాలె నంటె మనం కొన్ని పాత ముచ్చట్లు చెప్పుకోవాల్సుంటది.బాగా తెల్సినోళ్లు చెప్పేదేమిటంటే మన భాష మొదలై దగ్గరదగ్గర రెండు వేల సంవత్సరాలయిందట.అంతకు ముందు సంస్కృతమని పూజలు జేసేటప్పుడు మంత్రాలు జదువుతరు చూడున్రి. గా భాషలనే మాట్లాడుకునేటోళ్లట.మెల్లమెల్లెగ గా భాషలనుంచే మన తెలుగు భాష పుట్టిందట.అది అట్లట్ల పెరిగి పెద్దదయ్యి ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద కొన్ని కోట్ల మంది మాట్లాడేటంత పెద్దగయ్యింది.ఇప్పుడు మనకు రెండు తెలుగు రాష్టాలయినయని మీకు తెలుసు.మనది తెలంగాణ.వాళ్లది ఆంధ్రప్రదేశ్.అక్కడ ఇక్కడ మాట్లాడేది తెలుగే.కని వాళ్ల యాస ఓ తీరుగుంటది.మనదో తీరుగుంటది.మన దాంట్ల కొంచెం తురక భాష,కొంచెం మరటి భాష కలిసి మాట్లాడే తీరుల కొంత ఫరకుంటది.ఏది ఏమైన అంతా తెలుగు భాషనే.ఇగ ఇప్పుడు సమస్య ఏంటిదంటే అక్కడా ఇక్కడ కూడా పిల్లలు సరిగ్గ తెలుగుల మాట్లాడుత లేరు.ఎందుకు?వాళ్లు చదువుకునే బళ్లు ఇంగ్లీషు మీడియం బళ్లుగదా!మన తల్లి భాషను మర్చి పొయ్యే పరిస్థితి వచ్చింది గనుకనే మన భాషను మనం బతికిచ్చుకోవాలనే ఆరాటం.గా ఆరాటం తోనే మన తెలుగు భాషల పాటలెట్లుంటయ్ పద్యాలెట్లుంటయ్.గవన్నీ మాట్లాడుకుందాం. మీకు తెలుసో తెలువదో గని మాట పుట్టిన కొంత కాలానికి పాటపుట్టింది.పాట నుంచి పద్యం పుట్టింది.ఇగ ఆతరువాత ఎన్నో బుట్టినయ్.ఇప్పుడు మనం ఒకసారి గుర్తు చేసుకుందాం.చిన్న పిల్లలను జోకొట్టుటానికి పాటలు పాడుతరా లేదా?
‘ఏడువకు ఏడువకు ఎర్రినాగన్నా
ఏడిస్తె నీ కండ్ల నీలాలు గారు 
నీలాలు గారితో నే జూడలేనూ 
పాలైన గారవే బంగారు కండ్లా
జో జో జో జో ‘-
ఇంక లాలిపాటలు పాడుతరు 
‘శ్రీరామ రామ లాలీ
మాయన్న
సీతానమేతలాలీ ‘-
ఇంకా కొందరు 
‘కస్తూరి రంగ రంగా మాయన్న కావేటి రంగ రంగా ‘- అని పాడుతరు
మీరు యిన్నరో లేదో గని కొందరు ఇదిగుడ పాడుతరు
‘తొలుత బ్రహ్మండమ్ము తొట్లెగావించీ
నాలుగూ వేదాలు గొలుసులమరించీ’
అని.
అంటే చిన్న పిల్లలప్పుడే పిల్లల చెవుల్లో తల్లి పాడిన పాటలు పడుతయ్.
ఇంక ఎనకట ముసలమ్మలు ముసలయ్యలు పాటలు పద్యాలు జద్వే టోళ్లు. భాగవతం పద్యాలు.
 భారతం పద్యాలు నోటినిండ చదువుతుంటే పిల్లలు వినేటోళ్లు.
నిలవడి కాల్జెయ్యాడిచ్చే పిల్లల్ని ఆటలాడిచ్చుకుంటు 
‘తారంగం తారంగం 
తాండవ కృష్ణా తారంగం 
వేణూనాథా తారంగం 
వేంకటరమణా తారంగం ‘
అని పాటలు పాడేటోల్లు. ఇప్పుడవన్ని పొయ్నయ్.
ఇదంత ఎందుకుజెప్తున్ననంటే మన పిల్లలకు మన భాష రావాలంటే మన పాటలు పద్యాలు ఒంటబట్టాన్నంటే ఇంట్లో ఇటువంటి వాతావరణం ఉండాలె.పిల్లలు ఏ భాషయినా ఎట్ల నేర్చుకుంటరు.వింటేనే గదా.ఏది వింటరో అవి వస్తయి.ఇప్పుడు మన బళ్లు చూడవోతే అన్నీ ఇంగ్లీషు మీడియం బళ్లేనాయె.అక్కడొకటి చెపుతరు .ఇక్కడొకటి మాట్లాడుతరు.అది సమఝ్గాదు నా యిది సమఝ్ గాదు. అటుగాకుండిటు గాకుండపోతున్నరు పిల్లలు.సర్కారు బళ్లల్ల తెలుగుమీడియం జదివే పిల్లలయినా మన భాష సరిగ్గ నేర్చుకుంటులేరు.ఇంత గొప్ప భాష మనం నిర్లక్ష్యం జెయ్యటంతో వెనుకబడి పోతున్నది.అందుకే మన పాటలు, పద్యాలు,భజనలు, కీర్తనలు,తత్వాలు, మంగళా రతులు మన పిల్లలకు మనం అందజెయ్యాలె.వాళ్లు వాళ్ల పిల్లలకు అందజెయ్యాలె.గప్పుడే భాష బతికి బట్టగడుతది.
సరె ఒక మంచి పద్యం పాడుకుని ఇవ్వాళటికి ఆపుజేద్దాం ముచ్చట.
‘చేతులారంగ శివుని పూజించడేని
నోరు నొవ్వంగ హరికీర్త నుడువడేని
దయయు సత్యంబు లోనుగా తలపడేని
కలుగనేటికి తల్లుల కడుపు చేటు’