పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105

 పూర్వ విద్యార్థులు అందరూ ప్రయోజకులు అయిన తర్వాత ఒకే వేదికనా అందరు కలుసుకోవడం నేడు అపురూప దృశ్యం గా వస్తుంది. ఎప్పుడో స్కూల్ డేస్ పూర్తైన తదుపరి అందరూ మళ్లీ ఒక్క చోట కలుసుకోవడం అనేది బహు అరుదు.
ప్రతి మనిషి జీవితంలో బాల్యం అనేది మరువలేనిది. అది ఒక తీపి గుర్తుగా నిలుస్తుంది. పాఠశాల దశలో చేసిన అల్లరి, చిల్లరి పనులు తోటివారిని ఏడిపించడం, మాస్టర్ చేతిలో దెబ్బలు తినడం, చీవాట్లు పడడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద గ్రంధమే అవుతుంది.
నిజంగా ప్రయోజకులైన స్నేహితులు అందరూ ఒకే వేదికగా కలుసుకోవడం అనే ఆలోచన అభినందనీయం. ఆత్మీయ నేస్తాలు కలిసిన రోజు పండగ వాతావరణమే. ఒకరి బాగోగులు ఒకరికొకరు తెలుసుకుంటూ, తమ పాతికేళ్ళ ప్రస్థానం నేస్తాలతో పంచుకునే అరుదైన సమ్మేళనం, పూర్వ విద్యార్థుల సమ్మేళనం.
చిన్ననాటి మిత్రుల ఆలింగనాలు, కరచాలనాలు, స్నేహితులకు పెట్టుకున్న నిక్ నేమ్స్ తో మళ్ళి వాళ్ళను పిలవడం, కల్మషం లేని మనసుతో మాట్లాడుకునే కార్యక్రమంగా చెప్పవచ్చు.
ఆనాడు అందరూ కలిసి తిరిగిన ప్రదేశాలు, ఆడిన ఆటలు ఉంటకిస్తు, ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ, పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆ రోజంతా తమ ప్రాణ స్నేహితులతో గడుపుతారు. ఆనాటి తన బెంచిమేట్లతో ఎంతో చనువుగా ముచ్చటిస్తూ, సంతోషంగా గడిపే సరదా సందడి కార్యక్రమం ఈ సమ్మేళనం.
తమ ఆత్మీయ నేస్తాలకు ఏదైనా ఆపద వచ్చిందంటే, కష్టాల కడలిలో కూరుకు పోయారు అంటే, ముందువెనుకలు ఆలోచించకుండా మేమున్నామని భరోసా ఇచ్చే మిత్రులు దొరకడం నిజంగా అదృష్టం గా భావించవచ్చు, ఒక రకంగా చెప్పాలంటే ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఒక అపురూపమైన కలయికగా చెప్పవచ్చు. ఎంత ఎత్తుకు ఎదిగినా చిన్ననాటి మిత్రులు ముందు ఎదుగుదల కనిపించదు. ఈ సమ్మేళ నాలలో అందరూ ఒక సహాయ నిధి ఏర్పాటు చేసుకుంటున్నారు .తమకు తోచినంత జమచేసి కష్టాల కడలిలో ఉన్న మిత్రులకు కొండంత ధైర్యం చెప్పే వేదికలు అవుతున్నాయి ఈ సమ్మేళనాలు.
ఇలాంటి కార్యక్రమాలను అందరూ తప్పనిసరిగా స్వాగతించాలి, అభినందించాలి. భావితరాలకు స్ఫూర్తిగా ఆదర్శంగా నిలవాలి. ఒకరికొకరు తోడుగా ఉన్నామనే సందేశం సభ్య సమాజానికి అందించాలి.

కామెంట్‌లు