*అక్షర శరం*:--అయిత అనిత--8985348424
ప్రభవతో ప్రారంభమైన
ఆయనప్రయాణం వేగుచుక్కై వెలిసి
మహాప్రస్థానమై కోటిహృదయాల్లో ప్రజ్వలించింది!
తాడితపీడిత జనులకు
అభయహస్తమై వెలుగొంది మరోప్రపంచానికి వారధి వేసింది!!

నేను సైతం అంటూ ఆత్మవిశ్వాసపు వీచికయై
యవతకు ఊపిరిపోసింది!
ఉద్యమాల సమిధల్ని సమానత్వయజ్ఞానికి ఆహుతిచ్చింది,!
ఆయన అక్షరం విప్లవకెరటమై ఎగిసింది!
ఆ...కవిత్వం లక్షలగొంతుల్లో స్ఫూర్తిగీతమై ప్రభవించింది!!


శ్రామికుల వెతలకథలే సిరాయై
ఆ...కలం ములుకు నిప్పురవ్వగ చిగురించింది!

ప్రాసలు శేషల సమ్మిళితమై
సంపంగి వనాన కవన మయూరమై నాట్యమాడింది!

చెమటచుక్కల సారమే కవిహృదయపు కమ్మనిభావమై
తిమిరంతో సమరం సాగించింది!

అరసం..విరసం తో మమేకమై
యిజాల మికిలీని కడిగి
మరో గురజాడగా దేశభక్తికి స్థానమయ్యింది!
జగతిన అహంభావపు చీకట్లను తరిమే అభ్యుదయ  తొలిపొద్దయ్యింది!!

వ్యవహారిక భాషా విత్తనమై
అలతి అలతి పదాలుగా అంకురించింది!
ఎన్నోవిమర్శల కొలిమిలో కాలి పునీతమయ్యి సాహిత్య నవనీతమయ్యింది!!
ప్రజల నాలుకలపై శాశ్వతచరితను లిఖించింది!