తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు కర్రోళ్ల నర్సయ్య:--: డాక్టర్ వాసరవేణి పర్శరాములు,9492193437.

 

మే 16న(18వ వర్ధంతి సందర్భంగా)
( *స్వాతంత్ర్య సమరయోధులు కర్రోళ్ల నర్సయ్య*)
 నిజాం పాలనలో గ్రామాల్లో పటేల్, పట్వారి, దొరలు, భూస్వాములు నానా బాధలు పెడుతుంటే వారు వెట్టిచాకిరి, బానిసత్వం అధికంగా  ఉండేది. నిజాం పాలన  విముక్తి కోసం దొడ్డి కొమురయ్య, బందగి బద్దం ఎల్లారెడ్డి, చాకలి చాకలి ఐలమ్మ, అమృతలాల్ శుక్లా, కొమురం భీం, అన బేరిప్రభాకర్రావు, దాశరధి ఎందరో పోరాటం నడిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ప్రాంతంలో రైతాంగ సాయుధ పోరాటం తా సాగింది. ఎందరెందరో అమరవీరులు పోరాడి ప్రాణాలర్పించారు. వారి అమూల్యమైన జీవితాలను త్యాగం చేసి స్వాతంత్ర్యం సంపాదించారు. బతికి ఉన్నవారిలో కొందరు ఉన్నతంగా బతికితే మరికొందరు అవసాన దశలో దుర్భరమైన జీవితాన్ని గడిపి తనువులు చాలించారు. అటువంటి మహనీయులలో రైతాంగ సాయుధ పోరాట వీరుడు మాజీ ఎమ్మెల్యే కర్రోళ్ల నరసయ్య ఒకరు.
      సిరిసిల్ల ప్రాంతంలో రైతాంగ సాయుధ పోరాటం చేసిన వీరుల గురించి సేకరించాలని తెలంగాణ రాష్ట్ర సాధన మలిదశ ఉద్యమంలో భాగంగా 2014 మార్చి 9, 10 తేదీలలో వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, సిరిసిల్ల, కోనరావుపేట మండలాలలో సంచరించాను. నిమ్మ పల్లి, మానాల, గర్జనపల్లి, గాలిపెళ్లి లక్ష్మీపురం, వెంకటాపురం, పదిర, సింగారం గ్రామాలలో రైతాంగ సాయుధ పోరాట విషయాలు సేకరించాను.కర్రోళ్ల నరసయ్య గురించి విని మల్కపేట గ్రామం వెళ్లాను. కవి వెంగళ నాగరాజు సహకరించారు.
      కర్రోడ నరసయ్య ఇంటికి వెళ్లగానే కర్రోళ్ల మధు కొందరు నా శిష్యులు నమస్కారం సార్ మీరు మా ఇంటికి వచ్చారు అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వారు సిరిసిల్ల ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో శిష్యులుగా విద్య అభ్యసిస్తున్నారు. నేను ఆ కళాశాలలో లెక్చరర్గా తెలుగు బోధిస్తున్నాను. వారు కర్రోళ్ల నర్సయ్య మనువలుగా చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను. బాధపడ్డాను. ఒక మాజీ ఎమ్మెల్యే మనవలు మన ప్రభుత్వ కళాశాలలో చదువుతున్నారు.ఎంతగొప్ప కుటుంబం, ఎంత నిరాడంబరమైనది, ఒకింత సామాన్య జీవితం గడుపుతుంది. ఇంట్లో కారల్ మార్క్స్, లెనిన్, స్టాలిన్ ఫోటోలు ఉన్నాయి. కర్రోళ్ల నరసయ్య ఉమ్మడి సిరిసిల్ల నియోజకవర్గాల్లో రిజర్వడ్ నేరళ్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పని చేశారు. కుటుంబ పరిస్థితులు కుటుంబ సభ్యుల పరిస్థితులు చూస్తే నా గుండె చెరువు    అయింది.చలించి పోయాను. నిరుపేద కుటుంబం. నరసయ్య భార్య దుర్గవ్వను ఇంటర్వ్యూ చేశాను తనకు తెలిసిన సమాచారం అందించింది. నేను కూలి నాలి చేసుకుంటున్న అని కంట నీరు పెట్టుకుని చెప్పింది. నేటి రాజకీయ నాయకుల పరిస్థితులు మదిలో మెదిలాయి. సర్పంచులు, జెడ్ పి టి సిలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్కువమంది కార్లు బిల్డింగులు ఉండి  కోట్లు సంపాదిస్తున్నారు. కానీ నరసయ్య ఎమ్మెల్యేగా పనిచేసి నిజాయితీగా నిరాడంబరంగా బతికి ప్రజల సేవ చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల పెన్షన్ కోసం కాళ్లరిగేలా తిరిగి  మందుల కోసం అప్పులు చేసి  చివరకు తనువు చాలించిన మహనీయులు, రైతాంగ సాయుధ పోరాట వీరులు కర్రోళ్ల నరసయ్య అని తెలుసుకున్నాను.
      కర్రోళ్ల నర్సయ్య1942లో భూమికోసం,భుక్తికోసం,తెలంగాణ విముక్తికోసం బద్దం ఎల్లారెడ్డి,అమ్రృతలాల్ శుఖ్లా ఉపన్యాసాలకు ఉత్తేజితుడై15యేళ్ల వయస్సులో సాయుధపోరాటంలో చేరారు.నిరుపేద దళితకుటుంబంలో నర్సయ్య-ఎల్లమ్మ దంపతులకు జన్మించారు. సమసమాజస్థాపనకోసం నడుము బిగించారు.సాయుధ శిక్షణపొంది నర్సయ్య నిమ్మపల్లి పోలీసు అవుట్ పోస్టుపై దాడిచేశారు.తర్వాతలోతురెల్లో ఆనాటి నిజాం పోలీసులను మాటువేసి మట్టి కరిపించారు. నర్సయ్యకు చదువులేకపోవడంతో రాజకీయ ఆర్గనైజేషన్లో ముందుకు సాగలేకపోగా కలత చెందారు.రాత్రివేలళ్లో బడికిపోయి కష్టపడి నాల్గవతరగతి చదువుకున్నారు.సమాజాన్ని చదివారు.రాజకీయాన్ని ఒంటబట్టించుకున్నారు.ప్రజల సమస్యలను అధ్యనంచేశారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేశారు.దీనితో పార్టీ నాయకత్వం మిలటరీదళంనుండి రాజకీయదళాల్లోనికీ బదిలీ చేసింది.వెట్టిచాకిరి,బానిసత్వం,రైతులు,రైతుకూలీలసమస్యలను తెలుసుకున్న నర్సయ్య దొరల వెట్టిచాకిరి విధానానికీ వ్యతిరేకంగా సభలు,సమావేశాలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేయడంలో అలుపరుగని క్రృషి చేసారు.
      బద్దం ఎల్లారెడ్డి,అమ్రృతలాల్ శుఖ్లా,గడ్డం తిరుపతిరెడ్డి మొదలగు రైతాంగ సాయుధ అనుచరులతో ముందుకు సాగారు. అప్పటికే విధ్వంసకర సంఘటనలతో సంచలనం సృష్టించిన నరసయ్యను పట్టుకున్న పోలీసులు ఆయనకు బేడీలు వేసి గ్రామ గ్రామాన తిప్పారు. ప్రజలను  ఇతనికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వాలంటూ నైజాం పోలీసులు ఎంత ప్రయత్నించినా ఎవరు సహకరించలేదు. దీనితో పోలీసులు బలమైన ఆధారాలు లేకుండానే కోర్టులో హాజరుపరిచారు. నరసయ్య తిరిగి మూడు నెలలకే విడుదలయ్యి మళ్లీ పోరాట బాటలోనే ప్రయాణం కొనసాగించారు. 1948  సెప్టెంబర్ 17న భారత ప్రభుత్వం పోలీసు చర్య అనంతరం సాయుధ పోరాటాన్ని కమ్యూనిస్ట్లు రహస్య జీవితం నుండి బయటకు వచ్చారు. నరసయ్య గారు కూడా బయటకు వచ్చారు.
      1952లో నిషేధం కూడా ఎత్తి వేయలేదు. అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో నరసయ్య గారు పోటీపడగా పోటీ చేయకుండా అడ్డుకున్నారు. తరువాత 1957లో తిరిగి జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి సిరిసిల్ల నియోజకవర్గం నుండి జనరల్ అభ్యర్థిగా అమృతలాల్ శుక్లా పోటీచేయగా రిజర్వ్ అభ్యర్థిగా నరసయ్యలు పోటీ చేసి విజయం సాధించారు. నరసయ్య గారు గెలుపొందిన అనంతరం సిరిసిల్ల ప్రాంతంలోని నర్మాల ప్రాజెక్టు కింద భూములను పేదల దున్నుతుంటే ప్రభుత్వం 12 ఏళ్ళపాటు నిషేధం విధించింది. భూములపై నిషేధం ఎత్తివేయాలని ఉద్యమాలు నిర్వహించడమే గాక 500 రూపాయల వ్యాల్యుయేషనకే భూములకు పట్టాలు ఇప్పించడంలో నరసయ్య గారు ప్రముఖ పాత్ర వహించారు. తిరిగి 1962- 67 లలో అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో నియోజకవర్గాలకు రిజర్వేషన్ కేటాయించడంతో నరసయ్య నేరెళ్ల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థి జానకి రామయ్యపై పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి రాజకీయాలలో రాణించడానికి తన వద్ద ఆర్థిక స్థోమత లేకపోవడంతో కాలక్రమేణా రాజకీయాలలో ముందుకు సాగ లేకపోయారు. సామాన్య జీవనం గడిపారు.
      ఎందరికో ఆదర్శంగా నిలిచిన నరసయ్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న చూపే చూశాయి. 1980లో కేంద్ర ప్రభుత్వ సమరయోధుల పింఛన్ దరఖాస్తు చేసుకున్న నరసయ్యగారికి తీరని ఆవేదన మిగిలింది. అప్పటినుండి పరిశీలనలో ఉన్న నర్సయ్య గారి ఫైలుకు రెండు దశాబ్దాలుగా మోక్షం లభించలేదు. సిరిసిల్ల మాజీ శాసనసభ్యులు సిహెచ్ రాజేశ్వరరావు చైర్మన్గా సమరయోధుల స్క్రీనింగ్ కమిటీ ఆయన పింఛన్ ఫైలుకు మోక్షం కలగజేసినా ఢిల్లీలో పెండింగ్లో పడిపోయింది. కేంద్ర మంత్రి విద్యాసాగర్రావు, మాజీ శాసనసభ్యులు సి.హచ్. రాజేశ్వరరావులను కలిసి అనేకసార్లు పింఛన్ మంజూరు చేయాలని విన్నవించుకున్నా మంజూరు కాలేదు. మాజీ శాసన సభ్యునిగా ప్రభుత్వం ఇచ్చే వెయ్యి రూపాయల గౌరవ వేతనం మందలకే సరి పోగా 2002లో ఆర్థిక సహాయం అందించాలని అప్పటి ముఖ్యమంత్రికి దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి కరీంనగర్ జిల్లా కలెక్టర్ సుమిత్ర డావ్రా రూపాయలు 50000 ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరు చేశారు. స్వాతంత్ర సమరయోధుల పెన్షన్ కోసం కాళ్లరిగేలా తిరిగారు. తీవ్ర అనారోగ్యంతో 2003 మే 16న పరమపదించారు. అసెంబ్లీలో  ఆ సంవత్సరంలో పరమపదించిన ఎమ్మెల్యేలు వావిలాల గోపాలకృష్ణయ్య, ఆలపాటి ధర్మారావు,వి. ధర్మారెడ్డి, నిచ్చెర్ల రాములు, డి. సుందరయ్య మంగెన గంగయ్య, ఉప్పలపాటి రామచంద్ర రాజులతో పాటుగా కర్రోళ్ల నరసయ్యగారికి ప్రగాఢ సంతాపం తెలిపారు.
      నరసయ్య భార్య దుర్గవ్వ దినసరి కూలీగా మల్కపేటలో జీవనం సాగించి 16-10- 2018లో పరమపదించారు. నరసయ్య- దుర్గవ్వలకు ముగ్గురు కుమారులు. దుర్గవ్వ బతికి ఉన్నప్పుడు భర్త నర్సయ్యకు అన్ని విధాలుగా సహకరించింది. నేను నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు దుర్గవ్వ మాటల్లో చెప్పినది ఏమిటంటే "రజాకార్లతోటి కోట్లా డడానికి పదిహేనేళ్లు ఇల్లు విడిచి పోయిండు.. సచ్చిండో బతికిండో తెలియదు.. బతికి వస్తాడని ఏనాడు అనుకోలేదు.. నేను రోజు కైకిలి పోయి నా భర్తను సాధినా.. ఎన్ని పదవులు చేసిన మాకు ఏ సంపాదన లేదు.. ఎప్పుడు అడిగినా ప్రజలు ప్రజలు అంటాడే తప్ప కుటుంబాన్ని భార్యాపిల్లలను పట్టించుకునే వారు కాదు.. కొడుకులు ఎవరి సందల్లవారు కైకిలి గంబడి చేసుకుని బతుకుతుండ్రు..
      నరసయ్య గారు ఎంత ఎత్తు ఎదిగిన ఒదిగే ఉన్నారు. అవసాన దశలో నేటి రాజకీయాలు స్వార్థపూరితంగా మారాయని ఆవేదన చెందారు. ధనార్జనే ధ్యేయంగా నాయకులు  నడుచుకోవడం బాధాకరమని, ప్రజాక్షేమం వారి అవసరాలు పట్టించుకోవడంలేదనీ,  నాడు ప్రజా జీవితాలతోనే రాజకీయ నాయకుల జీవితం ముడిపడి ఉండేదని, నిస్వార్థంగా ఏలే వారని తను అభిప్రాయపడ్డారు. నేడు అసెంబ్లీలో  ఎమ్మెల్యేలు ప్రజాసమస్యలు విస్మరించి ఒకరిపై మరొకరు ఆరోపణలు చేస్తూ కుంభకోణాలు, అక్రమాస్తుల పైననే చర్చలు సుదీర్ఘంగా జరుపుతూ కాలం వెళ్లదీస్తున్నారనీ అభిప్రాయపడ్డారు. మాజీ ఎమ్మెల్యే అయినప్పటికీ 1984 నుండి తన స్వాతంత్ర్య సమరయోధుల పెన్షన్ కోసం తిరిగినా మంజూరు చేయలేదని ఆవేదన చెందారు.
      ప్రజాస్వామ్య విలువలకు ఊపిరిలూదిన నరసయ్య గారిని చూసి నేటి రాజకీయ నాయకులు ప్రజా ప్రతినిధులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దళ నాయకునిగా పని చేసి రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ అజ్ఞాత జీవితం గడిపి జైలు పాలై విడుదలై ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి ప్రజలకు సేవలు అందించారు. పేదలకు భూములు పంపిణీ చేయించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంలో అప్పుడు ప్రచారానికి నరసయ్య గారు ఖర్చు చేసింది కేవలం 150 రూపాయలు మాత్రమే. నేడు ఎన్నికల్లో ధనం, మద్యం, డబ్బు ఏరులై పారుతుండటం దిగజారిన రాజకీయాలకు నిదర్శనం. నేటి తరాలకు కర్రోళ్ల నరసయ్య లాంటి మహనీయుల జీవిత చరిత్ర తెలియాల్సిన అవసరం ఉంది. ఆనాడు నిస్వార్ధంగా పోరాడిన వారి త్యాగాన్ని స్మరించుకుని వారి స్ఫూర్తితో దేశాన్ని ఈ ఈ దుస్థితి నుండి కాపాడి ముందుకు నడిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నమ్ముతూ కర్రోళ్ల నరసయ్యగారికి జోహార్లు అర్పిస్తున్నాను.
                   
                         ఇట్లు/ డా.వాసరవేణి పర్శరాములు,9492193437,బాలసాహిత్య రచయిత,పరిశోధకులు,తెలంగాణ వివేక రచయితల సంఘం,అధ్యక్షులు, సింగారం,రాజన్న సిరిసిల్ల.ఈమెయిల్:parsharamulutvrs@gmail.com