చిరుదర హాసం :- కవిరత్న నాశబోయిన నరసింహ(నాన),హెల్త్ సూపర్వైజర్, కవి,రచయిత, చిట్యాల,నల్గొండ,9542236764)

అనంత కోటి జీవరాశులలో 
ఉన్నతమైన మానవజన్మకు 
ఆజన్మాంత నవ్య కానుకగ 
దివ్యౌషధం ధరణిలో దరహాసం... 

సంకుచిత మనో మందిరాన 
అహంభావ ఆవేశ మణిచి 
ఉత్సాహం ఉల్లాసం ప్రపుల్లం చేసి 
ఆనంద సౌరభాల నందించే చిరు దరహాసం... 

నిస్పృహ నిరాశ నిర్వీర్య పరిచి 
మేనులో నరనరాల బిగువు సడలించి 
మనో ఒత్తిడి మాయ చేయు మంత్ర కవాటం 
ఆయురారోగ్య అంకురార్పణం మందహాసం...

ఆనంద తరంగా లాకాశం తాకగ 
అణువణువు ఆకర్షణ అంతరంగం చేరగ 
మదిలో మబ్బు తెరల సుదూరం చేయగ
ఎదఎదలో నవశక్తి వాహిని దరహాసం... 

హృదయ గాయాల ఉపశమనంగా 
అశాంతి అసంతృప్తి ఆందోళనలో 
అలసిన మదికి ఆహ్లాదం నీయగ 
అమోఘ ఐశ్వర్యాభరణం చిరు దరహాసం...

(ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా..)
కామెంట్‌లు